టీఆర్ఎస్‌లో లిస్టు టెన్షన్‌... అంతుచిక్కని కేసీఆర్‌ ఆలోచన

టీఆర్ఎస్‌లో లిస్టు టెన్షన్‌... అంతుచిక్కని కేసీఆర్‌ ఆలోచన
x
Highlights

రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ రానున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్‌ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎవరికి టిక్కెట్లు ఇంకెవరికి తలపోట్లు అనే...

రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ రానున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్‌ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎవరికి టిక్కెట్లు ఇంకెవరికి తలపోట్లు అనే లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటివరకు అధికారికంగా ఎవరినీ ప్రకటించకపోయినా కేసీఆర్‌ వ్యూహామేంటో అంతుచిక్కడం లేదనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది.

టీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు కాంగ్రెస్ తొలివిడుత లిస్టు ప్రకటించి జోరుగా ఉంటే అధికార టీఆర్ఎస్‌లో మాత్రం ఇంకా మంతనాలు జరుగుతున్నాయి. శుక్ర శనివారాల్లో ఆశావహులతో కేసీఆర్‌ లంచ్‌ మీటింగ్‌ ఉంటుందని చెప్పినా అలాంటిది జరగకపోవడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. కొందరి పేర్లు బయటకు వినిపిస్తున్నా జాబితాలో తమ పేరు ఉందో లేదో అన్న టెన్షన్‌ ఆశావహులను నిద్ర పట్టనీయడం లేదు. మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కూడా కాబోతోంది. ఆదివారం కరీంనగర్‌ నుంచి కేసీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తుండటంతో లిస్టుపై మరింత ఆసక్తి పెరుగుతోంది.

కొంత‌మంది సిట్టింగ్‌లకు మరోసారి అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతోంది. 7 నుంచి 8 స్థానాల్లో పాత‌వారికే మ‌ళ్లీ టిక్కెట్‌ ఇస్తారని చెబుతున్నారు. వినోద్ క‌మార్, క‌విత‌, బీబీపాటిల్, కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, బూర న‌ర్స‌య్య గౌడ్, న‌గేష్, ప‌సునూరి ద‌యాక‌ర్ ల‌కు ఇప్ప‌టికే ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి అనధికారిక ఆదేశాలు అందాయని తెలుస్తోంది. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి, మ‌హ‌బూబాబాద్ ఎంపీ సీతారాం నాయ‌క్ ల‌కు ఈసారి చాన్స్ దక్కే అవ‌కాశాలు లేన‌ట్లు విస్తృతంగా ప్రచారం జ‌రుగుతోంది.

సిట్టింగ్‌లు లేని నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ఎవ‌రిని ఎంపీక చేస్తార‌న్నది హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి, ఆమె త‌న‌యుడు కార్తీక్ రెడ్డి లు టిఆర్ఎస్ లో చేరేందుకు సిద్దంకావ‌డంతో చేవెళ్ల ఎంపీ టిక్కెట్‌పై సందిగ్ధ‌త నెల‌కొంది. ఇప్ప‌టికే గ‌డ్డం రంజిత్ రెడ్డికి టిక్కెట్ ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంటే కార్తీక్‌రెడ్డి తెర‌మీద‌కి రావ‌డంతో ఈ ఇద్ద‌రిలో ఎవ‌రికి ద‌క్క‌వ‌చ్చన్న చ‌ర్చ ఇప్ప‌డు జోరుగా సాగుతోంది. సికింద్రాబాద్ నుంచి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ త‌న‌యుడు సాయికిర‌ణ్ యాద‌వ్ కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేశారు. మల్కాజ్‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఒక పక్క న‌వీన్ రావు, మ‌రోవైపు మంత్రి మ‌ల్లారెడ్డి అల్లుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. నాగ‌ర్ క‌ర్నూల్ పి.రాములు, మ‌హ‌బూబాబాద్ లో మాలోతు క‌విత‌, ఖ‌మ్మంలో వంకాయ‌ల‌పాటి రాజేంద్ర ప్ర‌సాద్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత స‌త్య‌నారాయ‌ణ రెడ్డి సోద‌రుడు శ్రీనివాస్ రెడ్డికి టిక్కెట్‌ ఖ‌రారు అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగినా ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి అధికారిక స‌మాచారం మాత్రం విడుదల కాలేదు. మరోవైపు న‌ల్గొండ నుంచి గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి పోటీకి సుముఖంగా లేక‌పోవ‌డంతో కొత్త‌గా ఎవరికి ఇస్తార‌న్న‌ది ఆసక్తిగా మారింది.

అయితే శుక్ర‌, శనివారాల్లో కెసీఆర్ సిట్టింగ్ ఎంపీలు, ఆశావ‌హుల‌తో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసి అభ్య‌ర్దుల ఎంపీక‌పై క్లారిటీ ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగినా మీటింగ్ మాత్రం జ‌ర‌గ‌లేదు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి కాల్ వస్తే వెళ్లేందుకు అభ్య‌ర్ధుల‌పై హైద‌రాబాద్ లోనే మ‌కాం వేశారు. రెండు విడ‌త‌ల్లో అభ్య‌ర్దుల‌ను ఖ‌రారు చేస్తార‌నే ప్రచారం కూడా జోరుగా జ‌రుగుతోంది. మొదటి విడ‌త‌లో కొంత‌మంది సిట్టింగ్ ఎంపీల‌ను ప్ర‌క‌టించి మిగ‌తా వారిని రెండో ద‌ఫాలో ప్ర‌క‌టిస్తార‌ని చెబుతున్నా కేసీఆర్‌ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories