ఆసక్తికరంగా నిజామాబాద్‌ పోరు...కవితకు పోటీగా...

ఆసక్తికరంగా నిజామాబాద్‌ పోరు...కవితకు పోటీగా...
x
Highlights

ఓ వైపు అధికార పార్టీ నుంచి మేయిన్‌ లీడర్‌. బలం బలగానికి కొదువే లేదు. ఛరిష్మాకు తక్కువేం కాదు. ఏకంగా సీఎం కేసీఆర్‌ కూతురు. ఆమె కల్వకుంట్ల కవిత....

ఓ వైపు అధికార పార్టీ నుంచి మేయిన్‌ లీడర్‌. బలం బలగానికి కొదువే లేదు. ఛరిష్మాకు తక్కువేం కాదు. ఏకంగా సీఎం కేసీఆర్‌ కూతురు. ఆమె కల్వకుంట్ల కవిత. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం బరిలో మరోసారి నిలుస్తున్న ఈ నాయకురాలిని ఢీ కొట్టేందుకు యువ నాయకుడు దిగుతున్నాడు. బీజేపీ పెద్దల ఆశీర్వాదంతో అడుగు ముందుకేస్తున్నాడు. ఆయనే ధర్మపురి అరవింద్‌. మరి ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతోంది..? బరి.. నువ్వా నేనా అన్నట్లు సాగుతుందా..?

రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం మరో రసవత్తరపోటీకి వేదికగా మారుతోంది. సిట్టింగ్‌ ఎంపీ కవితకు పోటీగా భారతీయ జనతా పార్టీ యూత్‌ లీడర్‌ను బరిలోకి దించుతోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంపై కన్నేసిన కమలం పార్టీ యువనేత ధర్మపురి అరవింద్‌ను పోటీలో నిలపాలని దాదాపుగా నిర్ణయం తీసుకుంది. ఇవాళో రేపో దీనికి సంబంధించి అధికారిక నిర్ణయం వెలువడనుంది.

నిజామాబాద్‌ ఎంపీ స్థానంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ మొదటి నుంచి వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రచార శంఖారావాన్ని పూరించారు. నిజామాబాద్‌ వేదికగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి కేడర్‌లో జోష్‌ను నింపారు. 1999 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి 33.4 శాతం ఓట్లు సాధించింది. అప్పటి నుంచి బీజేపీ ఈ సీటుపై ఆశలు పెట్టుకుంది. దీంతో ఈ సారి ఎలాగైనా ఎంపీ సీటును సాధించాలని పట్టుదలతో ఉంది. సిట్టింగ్ ఎంపీ కవితకు పోటీగా ధర్మపురి అర్వింద్ ను బరిలో నిలపాలని నిర్ణయించిన బీజేపీ అధిష్ఠానం ఈ మేరకు కార్యచరణ సిద్దం చేస్తోంది. అరవింద్‌ పోటీలో ఉంటే పార్టీకి కలిసొచ్చే అంశమని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్ది లేకపోవడంతో నిజామాబాద్‌లో పోటీ టీఆర్ఎస్ - బీజేపీ మధ్యే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత బలంగా ఉన్నా నువ్వా-నేనా అన్నట్లు పోటీని ఇవ్వగల సత్తా అరవింద్‌కు ఉందని కమలదళం నేతలు భావిస్తున్నారు. యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించిన అరవింద్‌కు ఫాలోయింగ్ పెరుగుతుంది. ఇక ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న ఆయన చెరుకు రైతుల సమస్యలపై పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇటీవల చేసిన పాదయాత్రకు భారీ స్పందన వచ్చింది. అలాగే కేంద్రంలోని పెద్దలతో సత్సంబంధాలు కూడా ఆయనకు కలిసొస్తాయని చెబుతున్నారు. దీనికి తోడు మున్నూరు కాపు సామాజిక వర్గం అరవింద్‌కు కలిసొచ్చే అంశంగా ప్రచారం జరుగుతోంది.

మరోవైపు పసుపు బోర్డు, ఎర్ర జొన్నల ధర విషయంలో సిట్టింగ్ ఎంపీ కవితపై రైతుల్లో వ్యతిరేకత ఉన్నట్లు చర్చ జరుగుతోంది. రైతు సమస్యల పరిష్కారంలో కవిత విఫలమైనట్లు బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్న తరుణంలో ఈ అంశాలన్ని అరవింద్‌కు ప్లస్ అవుతాయని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అరవింద్‌ను కవితపై పోటీ పెడితే సానుకూల ఫలితం ఉంటుందనే భావన పార్టీ క్యాడర్ లో వ్యక్తం అవుతోంది.

నిజామాబాద్‌ కోటలో కాషాయ జెండా ఎగిరేయాలని పావులు కదుపుతున్న బీజేపీ అధిష్టానం అందుకు తగ్గ వ్యూహాలకు పదును పెడుతోంది. అందుకే డైరెక్ట్‌గా అమిత్‌ షానే రంగంలోకి దిగి ప్రచార పర్వాన్ని మొదలుపెట్టారు. అయితే ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్‌ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. ఈ నెల 19 న కేసీఆర్‌ ప్రచారాన్ని ప్రారంభించనుండటంతో నిజామాబాద్‌ పోరు ఉత్కంఠతతో పాటు ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories