యూపీఏ భేటీకి బీటలు

యూపీఏ భేటీకి బీటలు
x
Highlights

మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యత కోసం ఓ వైపు ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తుంటే సమావేశానికి...

మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యత కోసం ఓ వైపు ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తుంటే సమావేశానికి ఒక్కో పార్టీ హ్యాండ్‌ ఇస్తోంది. బీజేపీయేతర పార్టీల సమావేశానికి ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి రావడం లేదని ఆ పార్టీ ప్రకటించగా తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్‌ కూడా ఫలితాలు విడుదలయ్యే వరకు ఆగాల్సిందే అని స్పష్టం చేశారు.

కేంద్రంలో మరోసారి అధికారం ఎన్డీయేదే అని ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ తేల్చిచెప్పాయి. అసలు మూడో కూటమికి అవకాశం లేదన్నట్లుగా ఎన్డీయే కూటమి 300 లకు పైగా స్థానాలను గెల్చుకుంటుందని స్పష్టం చేశాయి. దీంతో బీజేపీ యేతర పార్టీలు కొన్ని మూడో ఫ్రంట్‌ కూటమి ఏర్పాటు అసాధ్యం అనే భావనలో పడ్డాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్‌ కూడా కేంద్రంలో ఏ కూటమిలో చేరాలనేది ఫలితాల తర్వాతే నిర్ణయిస్తామని మే 23 సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడవుతాయి కాబట్టి ఇప్పుడే ఢిల్లీలో పార్టీలతో సమావేశం జరపడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. ఫలితాల తర్వాత సమావేశాలు జరిపితే ఓ ప్రయోజనం ఉంటుందని చెప్పుకొచ్చారు.

డీఎంకే ప్రస్తుతం యూపీఏలో భాగస్వామ్యంగా ఉంది. రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని ఆ పార్టీ అధినేత స్టాలిన్‌ ఆకాంక్షించారు. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చాక ఆయన వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. కేంద్రంలో ఏ కూటమిలో చేరాలో ఫలితాల తర్వాత నిర్ణయిస్తామని చెప్పడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఆయన యూపీఏను వీడి ఎన్డీయే వైపు అడుగులు వేస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరోవైపు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కూడా సోనియా, రాహుల్‌గాంధీతో ఇవాళ ఢిల్లీలో జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. ఇవాళ మాయావతి లక్నోలోనే ఉండనున్నారని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. మాయావతి ఇవాళ ఢిల్లీకి రావడం లేదని స్పష్టం చేశారు. దీంతో విపక్షాల ఐక్యత ఎంతమేర ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. శని ఆదివారాల్లో ఏపీ సీఎం చంద్రబాబు మాయావతి, శరద్‌పవార్‌, సీతారాం ఏచూరీ, అఖిలేష్‌ యాదవ్‌తో పాటు సోనియాగాంధీతో కూడా సమావేశం అయ్యారు. ఫలితాల తర్వాత ప్రతిపక్షాల ఐక్యత కోసం ఎలా వ్యవహరించాలో అన్నదానిపైనే మంతనాలు జరిపినట్లు చెబుతున్నారు. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్డీయేకు అనుకూలంగా రావడంతో విపక్ష కూటమి ఢీలా పడినట్లు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories