టీడీపీలో రాజంపేట రగడ

టీడీపీలో రాజంపేట రగడ
x
Highlights

కడప జిల్లా రాజంపేట టీడీపీలో వర్గ విభేదాలు గుప్పుమన్నాయి. ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి పార్టీ వీడి వైసీపీ గూటికి చేరుతారంటూ ప్రచారం రాజకీయంగా కలకలం రేపింది.

కడప జిల్లా రాజంపేట టీడీపీలో వర్గ విభేదాలు గుప్పుమన్నాయి. ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి పార్టీ వీడి వైసీపీ గూటికి చేరుతారంటూ ప్రచారం రాజకీయంగా కలకలం రేపింది. అలర్ట్ అయిన టీడీపీ అధిష్టానం మంత్రి ఆదినారాయణ రెడ్డిని రంగంలోకి దింపింది. రాజంపేట టీడీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి అనుకూల వ్యతిరేక వర్గాల కార్యకర్తలు, అనుచరుల నినాదాలు, నిరసనలతో సమావేశం కాస్తా రసభసాగా మారింది.

కడప జిల్లా రాజంపేట టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. జిల్లాలో టీడీపీ తరపున రాజంపేట నుంచి గెలిచిన ఎకైక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి కొంత కాలంగా పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. వైసీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో ఎమ్మెల్యే మేడా మంతనాలు జరుపుతున్నారన్న సమాచారం పార్టీలో జోరుగా చర్చ జరిగింది. ఈ నేపధ్యంలో టీడీపీ అధిష్టానం అప్రమత్తం అయ్యింది. మంత్రి ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మేడాను ఆహ్వానించకుండానే రాజంపేట నియోజకవర్గ టీడీపీ సమావేశం ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాలు సమావేశంలో ఒక్కసారిగా నినాదాలు, నిరసనలతో హోరత్తించారు. సమావేశానికి తమ నేతను పిలువకపోవడంపై మేడా వర్గీయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కావాలనే తమ నాయకుడిని పిలువలేదని, పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెడుతున్నారని మండిపడ్డారు.

అధిష్టానం ఆదేశాలను పాటించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటుండటంతోనే ఎమ్మెల్యేను సమావేశానికి ఆహ్వానించలేదంటూ ఆయన వ్యతిరేక వర్గం నేతలు ఆరోపించారు. దీంతో ఇరు వర్గాలు బాహా బాహీకి దిగారు. ఎమ్మెల్యే వర్గీయులు సమావేశాన్ని బహిష్కరించారు.

మేడా మల్లికార్జున్ పై వర్గీయులపై మంత్రి ఆదినారాయణ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. టీడీపీలో ఉంటావో పార్టీ మారుతావో తేల్చుకోవాలంటూ ఎమ్మెల్యే మేడాకు సూచించారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. టీడీపీలో కొనసాగేట్లయితే పార్టీ సమావేశాలకు రావాలి లేదంటే పార్టీ వీడి వెళ్లిపోవచ్చని కామెంట్ చేశారు. మరో వైపు మంత్రి ఆదినారాయణ రెడ్డి మాటలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి. అడ్డదారుల్లో పదవులు పొందినవారు తనగురించి మాట్లాడమేమిటని ప్రశ్నించారు. అధిష్టానం వద్దనే తేల్చుకుంటానన్నారు. త్వరలో చంద్రబాబును కలిసి జరిగిన విషయాలన్నీ చెబుతాన్నారు ఎమ్మెల్యే మేడా. ఆ తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారాయన. రాజంపేట టీడీపీ వర్గాలు మద్య జరిగిన ఈ పరిణామాలపై అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories