సీబీఐ VS మమత

సీబీఐ VS మమత
x
Highlights

పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొల్ కతా పోలీస్ కమిషనర్ ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన సీబీఐ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకుని...

పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొల్ కతా పోలీస్ కమిషనర్ ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన సీబీఐ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. కేంద్రం తీరును నిరసిస్తూ సీఎం మమతా బెనర్జీ ఆకస్మిక ధర్నాకు దిగారు. మోడీ ప్రభుత్వం సీబీఐని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. సీబీఐ తీరును వివిధ పార్టీల నేతలు ఖండించారు. విచారణ కోసం వచ్చిన సీబీఐ అధికారులను పశ్చిమ బంగ ప్రభుత్వం నిర్భందించడంపై సీబీఐ ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.

పశ్చిమ బెంగాల్ లో రాత్రి హైడ్రామా నడిచింది. శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో ప్రమేయముందన్న ఆరోపణలపై కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన సీబీఐ అధికారులకు చుక్కెదురయింది. సీబీఐ అధికారులను పశ్చిమ్‌ బంగా పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఓ సీబీఐ ఉన్నతాధికారిని పోలీసులు బలవంతంగా లాక్కొని వెళ్ళారు. కొల్ కతా సీబీఐ కార్యాలయం దగ్గర భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. సీబీఐ అధికారులను ఉంచిన పోలీస్ స్టేషన్ తలుపులను మూసివేశారు. ఓ దశలో పోలీసులు, సీబీఐ మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

ఈ విషయం తెలుసుకున్న మమతాబెనర్జీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంటికి వెళ్లారు. ఆయనను గట్టిగా సమర్థించారు. కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా మెట్రో ఛానెల్‌ వద్ద మమతా బెనర్జీ ధర్నా చేశారు. మోడీ ప్రభుత్వం సీబీఐని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. దేశంలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితి కన్నా దయనీయంగా పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ గద్దె దిగే సమయం ఆసన్నమైందని మమతా బెనర్జీ అన్నారు.

పశ్చిమ్‌బంగలో సీబీఐ వ్యవహరించిన తీరును వివిధ పార్టీల నేతలు ఖండించారు. ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ద్వయం వ్యవస్థలను ధ్వంసం చేస్తోందనడానికి కోల్‌కతా పరిణామాలే నిదర్శనమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మమతా బెనర్జీకి అండగా ఉంటామని చంద్రబాబు తెలిపారు.

పోలీస్‌ కమిషనర్‌ను అరెస్ట్‌ చేసేందుకు సీబీఐ వెళ్లడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు మాజీ ప్రధాని దేవెగౌడ. ఎమర్జెన్సీ సమయంలోనూ దేశం ఇలాంటి విరుద్ధ పరిణామాలే ఎదుర్కొందని పశ్చిమ్‌బంగలోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పారు. కేంద్రం చర్యలతో ప్రజాస్వామ్యం, ప్రజల స్వేచ్ఛ ప్రమాదంలో పడ్డాయని సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఒకే తాటిపై ఉన్నాయని చెప్పారు.

కేంద్రం ఒంటెద్దు పోకడలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి సీఎం కేసీఆర్ మద్దతుగా నిలవకపోవడం శోచనీయమన్నారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి. ఫెడరల్ వ్యవస్ధను కాపాడాలని ఉద్యమిస్తున్న కేసీఆర్ మమత బెనర్జీకి మద్దతుగా, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎందుకు ఒక్క ప్రకటన కూడా చేయడంలేదని ప్రశ్నించారు.

విచారణ కోసం వచ్చిన సీబీఐ అధికారులను పశ్చిమ బంగ ప్రభుత్వం నిర్భందించడంపై సీబీఐ ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. కోల్‌కతా ఘటన గురించి సీనియర్‌ న్యాయవాదులను సంప్రదిస్తున్నామని సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ నాగేశ్వరరావు తెలిపారు. చిట్‌ఫండ్‌ కుంభకోణంలో సాక్ష్యాలను తారుమారు చేయడంలో రాజీవ్‌ కుమార్‌ ముఖ్యపాత్ర పోషించారని చెప్పారు. మరోవైపు అరస్టైన ఐదుగురు సీబీఐ అధికారులను కోల్‌కతా పోలీసులు విడుదల చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories