logo

ఆమె.. అభివృద్ధికి స్పీడ్‌ బ్రేకర్‌..!

ఆమె.. అభివృద్ధికి స్పీడ్‌ బ్రేకర్‌..!
Highlights

ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. దీదీ కోటలో సుడిగాలి పర్యటన చేసిన మోడీ ప్రతిపక్షాలపై మండిపడ్డారు....

ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. దీదీ కోటలో సుడిగాలి పర్యటన చేసిన మోడీ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. బెంగాల్ నాశనాన్ని మమత కోరుకుంటోందన్నారు. అభివృద్ధికి ఆమె పెద్ద అడ్డంకిగా మారిందన్నారు. పథకాలే ప్రచారాస్త్రాలుగా ముందుకు సాగారు. విపక్షాలపై మాటల తూటాలతో చెలరేగిపోయారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోడీ విమర్శల విల్లు ఎక్కు పెట్టారు. దీదీ కంచుకోటలో నిలబడి విపక్షాలను గంప గుత్తగా ఏకి పారేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్ లో ప్రసంగించిన మోడీ బెంగాల్ లో గత కొంత కాలంగా అభివృద్ధి స్తంభించిపోయిందన్నారు. అభివృద్ధికి మమతా బెనర్జీ పెద్ద స్పీడ్ బ్రేకర్ లా అడ్డుతగులుతున్నారన్నారు.

సిలిగురిలో ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన మోడీ విపక్షాలవన్నీ ఎన్నికల ముందు జనాన్ని మోసగించడానికి వేసే ఎత్తుగడలేనని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనీ అన్నారు. బీజేపీ ఎంతో కష్టపడి డిజైన్ చేసిన ఆయుష్మాన్ భారత్ స్కీము ప్రజలకు చేరకుండా మమతా అడ్డు తగులుతున్నారన్నారు. రైతుల కోసం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ యోజనా పథకం కూడా బెంగాల్ ప్రజలకు చేరకుండా అడ్డుతగులుతున్నారన్నారు. ఈ స్పీడ్ బ్రేకర్ ఎప్పుడు అడ్డు తొలగితే అప్పుడే బెంగాల్ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు. దీదీ ఆమె మేనల్లుడు కలసి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారన్నారు. పేదలు మరింత పేదలుగా మార్చేసేలా దీదీ పాలన ఉందన్నారు.

ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నీ మోడీ వదిలిపెట్ట లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోకి మే 23తో గడువు తీరిపోతుందనీ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఉగ్రవాదులనుంచి భద్రతా దళాలను రక్షించే AFSPA చట్టాన్ని సమీక్షిస్తామన్న కాంగ్రెస్ మేనిఫెస్టోను తీవ్రంగా తప్పుబట్టారు. దేశాన్ని 50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ ఏం ఇచ్చిందంటూ నిలదీశారు. నక్సలైట్లు, వేర్పాటువాదులపై ఉక్కుపాదం మోపాల్సి ఉండగా కాంగ్రెస్ రాజీ రాజకీయాలు చేస్తోందన్నారు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ లది ఒకే ఐడియాలజీ అన్నారు. సరిహద్దుల్లో సైన్యం మనోధైర్యాన్ని దెబ్బ తీస్తూ శత్రువులకు కాంగ్రెస్ వత్తాసు పలుకుతోందన్నారు.

ఈశాన్య భారతానికి అరుణా చల్ ప్రదేశ్ ను గేట్ వేగా మార్చాలని తాను ప్రయత్నిస్తుంటే విపక్షాలు అడ్డు తగులుతున్నాయన్నారు. 42 ఎంపీ సీట్లున్న బెంగాల్ లో గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 34, కాంగ్రెస్ 4, బీజేపీ2, వామపక్షాలు రెండూ గెలుచుకున్నాయి. మరి మోడీ ప్రచారం ఈసారి ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో చూడాలి. యూపీ సహా ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో కోల్పోయే సీట్లను భర్తీ చేసుకోడానికి బెంగాల్ లాంటి రాష్ట్రాలలో బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.


లైవ్ టీవి


Share it
Top