Top
logo

తెలుగు రాష్ట్రాల్లో శివ నామస్మరణ

తెలుగు రాష్ట్రాల్లో శివ నామస్మరణ
X
Highlights

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలకు భక్తులు...

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తున్నారు. ఇరు రాష్ట్రాల్లోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. అభిషేక ప్రియుడైన నీలకంఠునికి భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. స్వామి దర్శనానికి ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. రాజమండ్రి, కోటిలింగాలతో పాటు పలు పుష్కరఘాట్‌ల్లో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించి స్వామి దర్శనం చేసుకుంటున్నారు.

హైదరాబాద్: హైదరాబాద్ ఫిల్మ్ నగర్ దైవ సన్నిదానంలో శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఉదయం నుంచి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు ఉపవాసం ఉంటే ఏడు జన్మాల పాపాలు పోతాయని ఆలయ అర్చకులు చంద్రశేఖర్ చెబుతున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్: మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నల్లమలలో కొలువైన ఉమామహేస్వరం, ఆలంపూర్ లోని బాల బ్రహ్మోస్వర స్వామి, రాయికల్ రామేశ్వరం, కందూరులోని రామలింగేశ్వర స్వామి ఆలయలాల వద్ద భక్తుల తాకిడి అధికంగా ఉంది.

ఖమ్మం: మహాశివరాత్రి సందర్భంగా ఖమ్మం జిల్లాలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చారిత్రిక స్వయంభూ గుంటుమల్లన్న దేవాలయం తెల్లవారుజాము నుండే శివనామస్మరణతో మార్మోగుతోంది

మెదక్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకను భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుఝాము నుంచే భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర ఆలయాన్ని ఎంపీ బీబీ పాటిల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయగర్భగుడిలో శివలింగానికి అభిషేకం నిర్వహించిన ఆయన రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగాలని మొక్కుకున్నారు.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ లో కొలువైన శ్రీబాలరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున నుంచే భక్తులు పోటెత్తారు.

రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్ పట్టువస్ర్తాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం రాజన్నకు రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్ర్తాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. అంతకుముందు టీటీడీ అర్చకులు, అధికారులు శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. శివరాత్రి సందర్భంగా రాజన్నను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తుననారు. క్యూలైన్లలో భారీగా భక్తులు వేచి ఉన్నారు.

వరంగల్: మహాశివరాత్రి పర్వదినోత్సవం సందర్భంగా శివాలయాలన్ని ఓం నమశ్సివాయ భక్తినామస్మరణతో భక్తులు పునీతులవుతున్నారు. వరంగల్ జిల్లాలోని శైవక్షేత్రాలన్ని భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.

కడప: మహా శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని కడప జిల్లాలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పట్టణంలోని మృత్యుంజయకుంట శివాలయం, పొలతల, నిత్యపూజకోన, హత్యరాల పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది శివాలయాలు భక్తజనసంద్రంగా మారాయి.

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాకినాడ రామారావుపేటలోని అన్నపూర్ణ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.

నెల్లూరు: నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. నెల్లూరులోని శ్రీభువనేశ్వరీ సమేత మూలస్థానేశ్వర స్వామి సంగమేశ్వరాలయం, రామతీర్ధం, కోటి తీర్ధం, గండవరం, చిరమన, ఘటన సిద్ధేశ్వరం, సిద్ధుల కోన ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు.

కర్నూలు: మహాశివరాత్రి సందర్భంగా కర్నూలు జిల్లాలో శివ క్షేత్రాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. అన్ని దారులు శ్రీశైలం వైపే చూపిస్తున్నాయి. శ్రీశైలం మల్లిఖార్జునుడిని దర్శించుకునేందుకు భక్తులు శివ ఆలయాల వద్ద బారులు తీరారు.

శ్రీకాకుళం: మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళం పట్టణంలోని శైవక్షేత్రాల్లో పరమశివుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శివనామస్మరణతో కిక్కిరిసిన ఉమారుద్రకోటేశ్వరాలయం.

చిత్తూరు : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చిత్తూరు జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తజనంతో నిండిపోయాయి. హరనామ స్మరణతో మార్మోగుతున్నాయి. శ్రీకాళహస్తి, తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం, పల్లి కొండేశ్వరుని ఆలయం, మొగిలేశ్వరుని ఆలయం, సురుటుపల్లి శివాలయాలలో తెల్లవారు ఝామునుంచే భక్తుల బారులు తీరారు. శ్రీకాళహస్తిలో మహాలఘు దర్శనం ప్రవేశపెట్టారు.

Next Story