మేజిక్‌ ఫిగర్‌ను క్రాస్‌ చేయని ఎన్డీఏ...అతిపెద్ద పార్టీగా...

మేజిక్‌ ఫిగర్‌ను క్రాస్‌ చేయని ఎన్డీఏ...అతిపెద్ద పార్టీగా...
x
Highlights

ఎలక్షన్‌ షెడ్యూల్‌ విడుదలైంది. మరి అధికారం ఎవరికి దక్కనుంది..? ఢిల్లీ పీఠాన్ని ఏ పార్టీ ఏలుతుంది..? 2014 లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీతో పట్టం కట్టిన...

ఎలక్షన్‌ షెడ్యూల్‌ విడుదలైంది. మరి అధికారం ఎవరికి దక్కనుంది..? ఢిల్లీ పీఠాన్ని ఏ పార్టీ ఏలుతుంది..? 2014 లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీతో పట్టం కట్టిన ఓటర్లు మరోసారి కూడా అధికారాన్ని అప్పగిస్తారా..? లేక యూపీఏకు అవకాశం ఇస్తారా..? అదీ కాకపోతే.. ఏటూ తేల్చకుండా సంకీర్ణానికి జై కొడతారా..? ప్రీ పోల్‌ సర్వేలు ఏం చెబుతున్నాయి..?

లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగింది. సమరానికి జాతీయ, ప్రాంతీయ పార్టీలు సిద్ధమయ్యాయి. మరి ఈ ఎన్నికల రణంలో ఎవరు గెలుస్తారు..? యుద్ధం ముంగిట బోల్తా కొట్టేదెవరు..? ఓ వైపు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడం ఆలస్యం మరోవైపు ప్రీ పోల్‌ సర్వేలు వెల్లడయ్యాయి. అయితే దాదాపు అన్ని సర్వేలు ప్రస్తుత ఎన్డీయేకే ఎక్కువ స్థానాలు కట్టబెట్టాయి. కానీ మేజిక్‌ ఫిగర్‌కు కాస్త దూరంగా నిలబెట్టాయి. అయినా అతిపెద్ద పార్టీగా ఎన్డీయే అవతరిస్తుందని స్పష్టం చేశాయి. అయితే కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ మాత్రం గతం కంటె మెరుగైన స్థానాలను కైవసం చేసుకున్నా అధికారానికి మాత్రం దూరంగా నిలుస్తుందని ప్రకటించాయి.

రిపబ్లిక్‌ సీ ఓటర్‌ సర్వే ప్రకారం ఎన్డీఏ - 264 స్థానాలు, యూపీఏ - 141 స్థానాలు కైవసం చేసుకుంటాయని వెల్లడించింది. ఇతరులు 138 సీట్లు గెలుచుకుంటారని అంచనా వేసింది. ఇక ఇండియా టీవీ సర్వే ప్రకారం ఎన్డీఏ - 285 సీట్లు, యూపీఏ - 126, ఇతరులు 132 సీట్లు సాధిస్తాయని లెక్కలు కట్టింది. ఇటు ఏబీపీ-సి ఓటర్ సర్వే కూడా ఎన్డీఏకే పట్టం కట్టింది. దీని ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ - 233 సీట్లలో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. యూపీఏ - 167, ఇతరులు 143 సీట్లలో పాగా వేస్తాయని స్పష్టం చేసింది.

ఇక రాష్ట్రాల వారిగా కూడా జాతీయ ఛానెళ్లు సర్వేలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌పైనే జాతీయ పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. యూపీ కోటను బద్దలు కొడితే ఢిల్లీలో అధికారపీఠంపై కూర్చోవచ్చనే రాజకీయ నానుడిని నిజం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.

80 స్థానాలున్న యూపీలో ఎస్పీ బీఎస్పీ కూటమికి ఎక్కువ స్థానాల్లో ప్రభావం చూపుతుందని అంచనా వేసింది. మొత్తం 47 స్థానాలు కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. బీజేపీ మాత్రం 29 స్థానాలతో సరిపెట్టుకోగా కాంగ్రెస్‌ 4 స్థానాలను మాత్రమే చేజిక్కించుకుంటుందని తెలిపింది. ఇండియా టీవీ సర్వే మాత్రం బీజేపీ అత్యధిక స్థానాలను కట్టబెట్టింది. బీజేపీ 40, బీఎస్పీ 16, ఎస్పీ 18, కాంగ్రెస్‌ 4 స్థానాలను కైవసం చేసుకోగా ఇతరులకు రెండు స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది. మరోవైపు ఏబీపీ సీ ఓటర్‌ సర్వే ప్రకారం ఎన్డీయే 25, యూపీఏ 4, ఇతరులు 51 స్థానాలు గెలుస్తారని అంచనా వేసింది.

యూపీ తర్వాత 48 లోక్‌సభ స్థానాలతో రెండో అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో బీజేపీ ప్రభావమే ఉంటుందని సర్వేలు అంచనా వేశాయి.

రిపబ్లిక్‌ సీ ఓటర్‌ సర్వే ప్రకారం బీజేపీ 35 స్థానాలు, కాంగ్రెస్‌ 13 స్థానాలను కైవసం చేసుకుంటుందని లెక్కలు కట్టింది. ఇండియా టీవీ సర్వే కూడా ఎన్డీఏకే మెజార్టీ కట్టబెట్టింది. 32 స్థానాల్లో ఎన్డీఏ పాగా వేయగా యూపీఏ 16 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. అయితే ఏబీపీ సీ ఓటర్‌ సర్వే ప్రకారం యూపీఏకు 28 స్థానాలు రాగా ఎన్డీయే 16 స్థానాలు, ఇతరులు 4 స్థానాలు కైవసం చేసుకుంటాయని వివరించింది.

ఇటు 42 స్థానాలున్న పశ్చిమబంగాలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టారు.

రిపబ్లిక్‌ సీ ఓటర్‌ సర్వే ప్రకారం తృణమూల్‌ కాంగ్రెస్‌కు 34, బీజేపీకి 8 స్థానాలు లెక్కకట్టింది. ఇండియా టీవీ సర్వే కూడా టీఎంసీ 30 స్థానాలు, బీజేపీ 12 స్థానాల్లో పాగా వేస్తాయని అంచనా వేసింది. ఏబీపీ సీ ఓటర్‌ సర్వే మాత్రం ఎన్డీయే, యూపీఏ కన్నా టీఎంసీ 34 స్థానాల్లో పాగా వేస్తుందని తేల్చిచెప్పింది.

బిహార్‌ లో జాతీయ ఛానెళ్లు ఎన్డీయే కూటమే అత్యధిక స్థానాల్లో విజయదుందుభి మోగిస్తుందని వెల్లడించాయి. రిపబ్లిక్‌ సీ ఓటర్‌లో బీజేపీకి 36 స్థానాలు కట్టబెట్టగా ఇండియా టీవీ 30, ఏబీపీ సీ ఓటర్‌ 35 స్థానాల్లో కూటమి పార్టీలు విజయం సాధిస్తాయని తెలిపింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమి నామమాత్రంగానే పోటీ ఇస్తుందని సర్వేలు వెల్లడించాయి.

దక్షిణాదిన అత్యధిక ఎంపీ స్థానాలున్న తమిళనాడులో యూపీఏ క్లీన్‌స్వీప్‌ చేస్తుందని ప్రీ పోల్‌ సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈ సారి ఆ రాష్ట్రంలో బీజేపీ ఖాతా తెరుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. రిపబ్లిక్‌ సీ ఓటర్‌ సర్వే ప్రకారం కాంగ్రెస్‌ డీఎంకే కూటమి 34 స్థానాలు, బీజేపీ 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఏబీపీ సీ ఓటర్‌ సర్వే మాత్రం కాంగ్రెస్‌, డీఎంకే కూటమి 39 స్థానాలకు అన్నింట్లోనే విజయం సాధిస్తుందని అంచనా వేసింది.

ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి గాలి వీస్తుందని ప్రీ పోల్‌ సర్వేలు అంచనా వేశాయి. రిపబ్లిక్‌ సీ ఓటర్‌, ఏబీపీ సీ ఓటర్‌ సర్వేలో బీజేపీ 24, కాంగ్రెస్‌ 2 స్థానాల్లో పాగా వేయగా ఇండియా టీవీ సర్వే మాత్రం బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని లెక్కగట్టింది.

మరోవైపు దేశరాజధాని ఢిల్లీని బీజేపీ ఒడిసిపడుతుందని ఎర్రకోటపై ఎన్డీయే జెండా ఎగురుతుందని తేల్చిచెప్పాయి. అన్ని సర్వేలు బీజేపీకి ఏడింటికి ఏడు స్థానాలు కట్టబెట్టాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు ప్రభావం చూపుతాయని సర్వేలు అంచనాకు వచ్చాయి. మొత్తంమీద సర్వేలు దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మొగ్గు చూపాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories