మీ హైదరాబాద్, ఢిల్లీ ట్యూషన్లు సరిగ్గా పనిచేయట్లేదు: జేడీ

మీ హైదరాబాద్, ఢిల్లీ ట్యూషన్లు సరిగ్గా పనిచేయట్లేదు: జేడీ
x
Highlights

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి-జనసేన నేత, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. 88 స్థానాల్లో విజయం సాధిస్తామంటూ...

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి-జనసేన నేత, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. 88 స్థానాల్లో విజయం సాధిస్తామంటూ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను విజయసాయిరెడ్డి ఎద్దేవా చేయడంతో వీరిద్దరి మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. మరోసారి ఇద్దరు నేతలు ట్వీట్టర్ వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు.

మూడు నెలల్లో మూడు పార్టీలు మారారంటూ తనన ఎద్దేవా చేసిన విజయసాయికి లక్ష్మీనారాయణ మరింత ఘటుగా బదులిచ్చారు.తాను రాజకీయాల్లో చేరబోతున్నట్టు ప్రకటించగానే అనేక పార్టీలు తనను ఆహ్వానించాయని, ఈ విషయాన్ని మీడియాతో పలుమార్లు చెప్పానన్న లక్ష్మీనారాయణ అందులో వైసీపీ కూడా ఉందన్నారు. రెడ్ కార్పెట్ పరిచి మరీ తనను ఆహ్వానిస్తానని చెప్పింది మీరు కాదా? అని విజయసాయిని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టని మీ తీరు చూస్తుంటే ప్రజల దగ్గర ఇంకెన్ని విషయాలు దాస్తున్నారోనని అనుమానంగా ఉందన్నారు. వైసీపీ ఆహ్వానాన్ని గౌరవంగా తిరస్కరించినందుకు మీ బాధను ఇలా వ్యక్తం చేస్తున్నారా? లక్ష్మీనారాయణ అని నిలదీశారు.

జనసేన 65 స్థానాల్లో పోటీ చేసి, 80 స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను నిలిపిందన్న విజయసాయి వ్యాఖ్యలకు కూడా లక్ష్మీనారాయణ బదులిచ్చారు. మీ హైదరాబాద్, ఢిల్లీ ట్యూషన్లు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ట్యూషన్ మాస్టార్లు కోప్పడతారు. ఓసారి లెక్కలు సరి చూసుకోండి. ఎగువ సభ ఔన్నత్యాన్ని నిలబెట్టండి. ప్రజలందరూ చూస్తున్నారు. మాది పారదర్శకమైన పార్టీ. మా జనసేన హోదాలతో పనిచేసే పార్టీ కాదు, హృదయాలతో పనిచేసే పార్టీ అని లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో విజయసాయి రెడ్డి ట్వీట్లకు జవాబులు ఇస్తూ తాను టైమ్ వేస్టు చేసుకోను అని అన్నారు లక్ష్మీనారాయణ.''నేను ప్రస్తుతం రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న పేదరికం, నిరుద్యోగ నిర్మూలనకై పాలసీ తయారీలో నిమగ్నమై ఉన్నాను. దీనికి మీ దగ్గర ఏమైనా ప్రత్యామ్నాయాలు వుంటే నాకు తెలియజేయగలరు. మీ అసత్య ట్వీట్లకు సమాధానమిస్తూ నా అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకోలేను. ఇది మీరు గమనించగలరు. ఇకపై మీ ట్వీట్లకు మా జనసైనికులు అవసరం అనుకుంటే సమాధానమిస్తారు! ధన్యవాదాలు' లక్ష్మీనారాయణ ఘాటు రిప్లై ఇచ్చారు. లక్ష్మీనారాయణ ట్వీట్లకు విజయసాయిరెడ్డి ధీటుగా బదులిచ్చారు. జేడీ గారు మీ టిక్కెట్ల లోగుట్టు అందరీకి తెలిసినదే. తీర్థం బీ ఫామ్ మీద సంతకం జనసేనది, ప్రసాదం ఎన్నికల్లో వెదజల్లే డబ్బు తెలుగుదేశం పార్టీది. జనసేన తనకు తానుగా ఇచ్చినది 175లో 65 బీ ఫామ్లు. కాదు మొత్తం తెలుగుదేశం చెపితేనే ఇచ్చాం అని మీరు ఒప్పుకోదలుచుకుంటే మీ ఇష్టం.

మరో ట్వీట్ లో లక్ష్మీనారాయణ పార్టీల్లో చేరికపై విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. జేడీ గారు మీరు 2 నెలల క్రితం లోక్ సత్తా కండువా కప్పుకోబోయి నెలక్రితం భీమిలిలో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అయ్యి ఆ తర్వాత 2 రోజుల్లోనే జనసేన తరపున విశాఖ ఎంపిగా బరిలోకి దిగారు. 3 నెలల్లో 3 పార్టీలు. ఆహా ఏమి ప్రజాస్వామిక విలువలు ? ఏమి రాజకీయ విలువలు అంటూ లక్ష్మీనారాయణకు విజయసాయిరెడ్డి చురకలంటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories