పసుపు కుంకుమ డబ్బులు కావాలంటే...భర్తలకు విడాకులు ఇవ్వాలన్న బ్యాంక్ మేనేజర్

పసుపు కుంకుమ డబ్బులు కావాలంటే...భర్తలకు విడాకులు ఇవ్వాలన్న బ్యాంక్ మేనేజర్
x
Highlights

పొదుపు మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జారీ చేసిన పసుపు కుంకుమ పదకం కర్నూలు జిల్లాలో డ్వాక్రా మహిళలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది....

పొదుపు మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జారీ చేసిన పసుపు కుంకుమ పదకం కర్నూలు జిల్లాలో డ్వాక్రా మహిళలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. పసుపు కుంకుమ డబ్బులు కావాలంటే, భర్తలకు విడాకులు ఇవ్వాలన్నాడు ఓ బ్యాంక్ మేనేజర్. ఈ పరిణామానికి విస్తుపోయిన నారీ లోకం మేనేజర్ పై తిరుగుబాటు ప్రకటించింది.

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పసుపు కుంకుమ పథకం ద్వారా అర్హులైన చాలామంది మహిళలకు చెక్కులు అందాయి. అయితే, కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామంలో మహిళలకు మాత్రం ఇంకా పసుపు కుంకుమ చెక్కులు తమ చేతికి రాలేదు. దీంతో వీరు రోజుల తరబడి స్థానిక ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు.

మహిళలకు వచ్చిన పసుపు కుంకుమ డబ్బును భర్తలు తీసుకున్న పంట రుణాలకు జమ చేసుకుంటామని బ్యాంక్ మేనేజర్ చెప్పాడు. దీనికి మహిళలు అభ్యంతరం తెప్పడంతో ఆడవారికి శాంతంగా నచ్చ చెప్పాల్సిన మేనేజర్ సిద్ధప్ప నోరు జారాడు. మీ భర్తకు, మీకు సంబంధం లేదంటే భర్తతో విడాకులు తీసుకొని వచ్చి ఆ కాగితం తనకు చూపిస్తే పసుపు కుంకుమ డబ్బులు ఇస్తాను చెప్పాడు. దీంతో మహిళలు మేనేజర్ తో తీవ్ర వాగ్వివాదానికి దిగారు.

అసలు ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగిగా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. పొట్ట చేత పట్టుకొని ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లే తమకు పసుపు కుంకుమ డబ్బే ఆసరాగా ఉంటుందని స్పష్టం చేశారు.

రుణాల విషయంలో మహిళలకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ కి జరిగిన వివాదాన్ని హెచ్ఎంటీవీ వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన ఆంధ్ర ప్రగతి రీజినల్ మేనేజర్ వెంటనే వాస్తవాలను తెలుసుకునేందుకు విచారణ కోసం సీనియర్ అధికారిని నియమించారు. పసుపు కుంకుమ నగదు ఏ అప్పుకు జమ వేసుకోకుండా పొదుపు మహిళలకు అందివ్వాలని ముందుగానే సర్క్యులర్ జారీ చేశామని స్పష్టం చేశారు.

ఈ వివాదాన్ని వెలుగులోకి తీసుకువచ్చి.. తమకు పరిష్కారం చూసిన హెచ్ఎంటీవీకి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. పసుపు కుంకుమ డబ్బును, ఏ అప్పుకు జమ చేయమని అధికారులు చెప్పడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories