చిన్ననాటి ఐస్‌ గోలా తాతతో కేటీఆర్‌...తాత కష్టాలకు చలించిపోయిన కేటీఆర్‌...

చిన్ననాటి ఐస్‌ గోలా తాతతో కేటీఆర్‌...తాత కష్టాలకు చలించిపోయిన కేటీఆర్‌...
x
Highlights

బాల్యంలో బడికి వెళ్లిన జ్ఞాపకాలు. ఇంటర్వెల్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ఐస్‌ గోలా తిన్న మధుర క్షణాలు కేటీఆర్‌ మదిలో పది కాలాలపాటు పదిలంగా ఉన్నాయి....

బాల్యంలో బడికి వెళ్లిన జ్ఞాపకాలు. ఇంటర్వెల్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ఐస్‌ గోలా తిన్న మధుర క్షణాలు కేటీఆర్‌ మదిలో పది కాలాలపాటు పదిలంగా ఉన్నాయి. అప్పుడప్పుడూ మనసుని మురిపిస్తుంటాయి. ఆ చిన్ననాటి తీపి జ్ఞాపకం కేటీఆర్‌ మనసుని బాల్యానికి తీసుకెళ్లింది. ఓ తాత తనకు చేసిచ్చిన ఐస్‌ గోలాను మళ్లీ తినాలనిపించింది. తాత చేతి తీపి రుచిపై హెచ్‌ఎంటీవీ స్పెషల్‌ ఫోకస్.

చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తే మనసుకి పట్టలేని ఆనందం. మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లాలనిపిస్తుంది. అప్పటి ఆటలు ఆడాలనిపిస్తుంది అప్పటిలా ఐస్‌ తినాలనిపిస్తుంది. అలాంటి మధురానుభవమే కేటీఆర్‌కి ఎదురైంది. అదెలా అంటారా.

హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌ గ్రామర్‌ స్కూల్‌లో కేటీఆర్‌ విద్యనభ్యసించారు. అప్పట్లో అక్కడ సయ్యద్‌ అలీ అనే వ్యక్తి ఐస్‌ గోలా అమ్మేవాడు. ఇప్పటికీ అతను అక్కడే ఐస్‌ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు వారాల క్రితం మహబూబ్‌ అలీ అనే యువకుడు కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. తాత తనని కలవాలని అనుకుంటున్నారని తెలిపాడు. దీంతో వెంటనే స్పందించిన తారక్‌ తాతను ఆప్యాయంగా ఆహ్వానించారు.

ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కేటీఆర్‌ స్కూల్‌కి వెళ్లేటప్పుడు తాత సయ్యద్‌ అలీ ఐస్‌ గోలా అమ్ముకునే వారు. చిన్నప్పుడు తన చేతితో చేసిన ఐస్‌ గోలా తిన్న బాలుడు ఈనాడు టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. తాత మనస్సు ఒకసారి తారక్‌ని కలవాలని ముచ్చటపడింది. ఆ విషయం తెలుసుకున్న మహబూబ్ తాత సెల్ఫీ ఫోటోతో సహా కేటీఆర్‌కు ట్వీట్‌ చేశాడు. ఇక ట్వీట్‌ను చూసిన కేటీఆర్‌ మనసు మురిసిపోయింది. చిన్ననాటి మధుర జ్ఞాపకం కళ్ల ముందు కదలాడింది. మరుక్షణం మోముపై చిరునవ్వు చిందించి తాతను రమ్మని కబురు పెట్టారు. దీంతో తాత సయ్యద్‌ అలీ బేగంపేట క్యాంపు కార్యాలంలో తారక్‌ని కలిశాడు. తాతను చూసిన వెంటనే ఆత్మీయ ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేశారు మంత్రి. ఇంకా ఐస్‌ గోలానే అమ్ముతున్నావా తాత అంటూ ఆప్యాయంగా పలకరించి, మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, పిల్లలు ఏం చేస్తున్నారు, ఆరోగ్యం ఎలా ఉందని క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు.

వృధ్యాప్యంలో పనిచేయలేని స్థితిలో ఉన్నారు ఐస్‌ తాత సయ్యద్‌ అలీ. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, గత సంవత్సరమే ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అయ్యిందని కేటీఆర్‌కు చెప్పుకున్నారు. తాత కష్టాలకు చలించిపోయిన కేటీఆర్ ఉండడానికి ఇల్లు, వృద్ధాప్య పెన్షన్‌ ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. దీంతో తన కల నెరవేరినందుకు, కేటీఆర్‌ చేసిన సాయానికి మురిసిపోయారు ఐస్‌ తాత.


Show Full Article
Print Article
Next Story
More Stories