కర్నూలులో మారుతున్న రాజకీయ ముఖచిత్రం ..

కర్నూలులో మారుతున్న రాజకీయ ముఖచిత్రం ..
x
Highlights

జిల్లాలో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తే పార్టీ మారేందుకు సిద్ధమని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం రాత్రి పొద్దుపోయాక...

జిల్లాలో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తే పార్టీ మారేందుకు సిద్ధమని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం రాత్రి పొద్దుపోయాక ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సీఎంతో భేటీ అయిన కోట్ల కుటుంబం కర్నూలు ఎంపీగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు నుంచి వారం రోజుల్లోగా సమాధానం వస్తుందని అప్పుడే అన్నీ చెబుతానంటూ సూర్యప్రకాశ్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

ప్రతిపక్షానికి కంచుకోటగా ఉన్న కర్నూలును చేజిక్కించుకునేందుకు తెలుగుదేశం అమలుపర్చిన వ్యూహం ఆ పార్టీకి అనుకూలంగా ఫలితమిచ్చినట్లే కనిపిస్తుంది. దాదాపు 5 దశాబ్దాలుగా కర్నూలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కోట్ల కుటుంబం టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా టీడీపీలోకి కోట్ల ఫ్యామిలీ వస్తుందనే ప్రచారం జరుగుతున్న వేళ సోమవారం రాత్రి చంద్రబాబుతో భేటీ కావడంతో వాటికి బలం చేకూరినట్లైంది. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి సుజాతమ్మ, తనయుడు రాఘవేంద్రరెడ్డి చంద్రబాబుతో సమావేశం అయ్యారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ జట్టుకడుతుందని భావించి భంగపడ్డ కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి సైకిల్‌ ఎక్కేందుకు నిర్ణయించుకున్నారనే ప్రచారం సాగింది. కాంగ్రెస్‌లోనే కొనసాగితే రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందనే ఆలోచనకు వచ్చిన ఆయన టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారని కూడా ప్రచారం నడిచింది. అయితే జిల్లాలో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తే పార్టీ మారేందుకు సిద్ధమని సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. వేదవతి, గుండ్రేవుల, హోస్పేట్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఈ అంశాల పైనే తమ మధ్య చర్చ జరిగినట్లు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వివరించారు. అందుకు చంద్రబాబు వారం రోజుల సమయం అడిగారని కోట్ల చెప్పుకొచ్చారు.

కర్నూలు ఎంపీ స్థానంతో పాటు డోన్‌, ఆలూరు అసెంబ్లీ స్థానాలను కోట్ల కుటుంబం ఆశిస్తోందని ఈ డిమాండ్లనే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి చంద్రబాబు ముందుంచారని తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు చెబుతున్నారు. కోట్ల కుటుంబం టీడీపీలో చేరడం వల్ల పార్టీకి మేలు జరుగుతుందని టీడీపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. రెడ్డి, బీసీ కలయికతో జిల్లాలో పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని ధీమాగా ఉన్నారు. దాదాపు 8 నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందని విశ్వసిస్తున్నారు.

అయితే కర్నూలు రాజకీయాల్లో కోట్లకు, కేఈ కృష్ణమూర్తి వర్గానికి మధ్య చాలాకాలంగా రాజకీయ వైరం ఉంది. దీంతో టీడీపీలోకి కోట్ల రాకను తొలుత కేఈ వర్గం వ్యతిరేకించింది. దీనిపై చంద్రబాబు కేఈని ఒప్పించారు. పార్టీ బలోపేతం కోసం నిర్ణయం తీసుకున్నట్లు సర్ధిచెప్పారు. మరోవైపు ఇప్పటికే కర్నూలు ఎంపీగా కొనసాగుతున్న బుట్టా రేణుకకు పాణ్యం అసెంబ్లీ టిక్కెట్‌ ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే కర్నూలులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు కోట్ల కుటుంబం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories