బాబు ప్రచారంలో దూమ్మురేపిన మమత, కేజ్రీవాల్

బాబు ప్రచారంలో దూమ్మురేపిన మమత, కేజ్రీవాల్
x
Highlights

బీజేపీని మళ్లీ అధికారంలోకి రానివ్వబోమని విశాఖ వేదికగా ముగ్గురు సీఎంలు ప్రతినబూనారు. ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు, బెంగాల్ సీఎం మమత...

బీజేపీని మళ్లీ అధికారంలోకి రానివ్వబోమని విశాఖ వేదికగా ముగ్గురు సీఎంలు ప్రతినబూనారు. ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు, బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మోడీని సాగనంపితేనే దేశం బాగుపడుతుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని దీదీ, కేజ్రీ సాగర తీరాన నినదించారు.

విశాఖ మున్సిపల్‌ మైదానంలో నిన్న జరిగిన టీడీపీ బహిరంగ సభలో చంద్రబాబు, మమత బెనర్జీ, కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు దీదీ , కేజ్రీ సంపూర్ణ మద్దతు పలికారు. సీఎం చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి ముడిపడి ఉందని, ఆయన మళ్లీ వస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందని మమత అంటే ఈ ఎన్నికలు దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ముఖ్యమైనవని ఢి ల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. చంద్రబాబు ఏపీని మోడర్న్‌ రాష్ట్రంగా మార్చారని, ఆయన మరోసారి సీఎం కావాలని ఇద్దరూ ఆకాంక్షించారు.

విశాఖ సభలో ముగ్గురు సీఎంలు ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో మోడీ చాయ్‌వాలా అన్నారు. ఇప్పుడు చౌకీదార్‌ అంటున్నారని మమత విమర్శించారు. మోడీ చెప్పేవన్నీ అబద్ధాలేనన్న మమత 56 అంగుళాల ఛాతీ అంటూనే 560 అబద్ధాలు చెప్పారని ఎద్దేవా చేశారు. మోడీతో బహిరంగ చర్చకు దీదీ సవాల్ విసిరారు.

మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే హిట్లర్‌ పాలన వస్తుందన్న ఢిల్లీ సీఎం బీజేపీ మళ్లీ గెలిస్తే భవిష్యత్తులో ఎన్నికలు ఉండవని ఆ పార్టీ నేతలే అంటున్నారని గుర్తు చేశారు. మోడీ, అమిత్‌షా కలిసి దేశంలో అనేక సమస్యల్ని సృష్టించారని కేజ్రీవాల్ అన్నారు. మోడీ రాజధాని అమరావతికి సహకరించకుండా నమ్మకద్రోహం చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. హుద్‌హుద్‌ తుపాను సాయం ఎగ్గొట్టారని , ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి అడ్డంకులు సృష్టించారని, డివిజన్‌ లేకుండా విశాఖ రైల్వే జోన్‌ ఇచ్చారని , వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకున్నారని, విమర్శించారు. మోడీ ఓడిపోతేనే దేశం బాగుపడుతుందన్నారు చంద్రబాబు.

విశా‌ఖ సభలో మమత తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విశాఖ కేంద్రంగా స్వాతంత్ర్య ఉద్యమం నిర్వహించిన అల్లూరి సీతారామరాజు, తెన్నేటి విశ్వంలకు నివాళులు అర్పించారు. తాను గతంలో ఆంధ్రాకు వచ్చినా తిరుపతి దర్శన భాగ్యం కలగలేదనీ ఈసారి కచ్చితంగా వెంకటేశుని దర్శనం చేసుకుంటానని చెప్పారు. దివంగత టీడీపీ నేత బాలయోగి స్పీకర్‌గా ఉన్న సమయంలో ఏపీ వచ్చానని దీదీ గుర్తు చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories