ప్రగతి భవన్‌‌ చుట్టూ చక్కర్లు కొడుతోన్న ఎమ్మెల్యేలు

ప్రగతి భవన్‌‌ చుట్టూ చక్కర్లు కొడుతోన్న ఎమ్మెల్యేలు
x
Highlights

మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో హైదరాబాద్‌లో మకాం వేసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్‌‌ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ముఖ్యమంత్రి...

మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో హైదరాబాద్‌లో మకాం వేసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్‌‌ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ను కలిసి అమాత్య పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సీఎంవో, ప్రగతి భవన్‌, పార్టీ కార్యాలయం నుంచి ఎలాంటి లీకులు రాకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. కేసీఆర్ పరిశీలనలో అసలు తమ పేరు ఉందోలేదోనని తెగ టెన్షన్ పడుతున్నారు.

మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో ఎవరెవరికి చోటు దక్కనుందనే చర్చ టీఆర్‌ఎస్‌లో జరుగుతోంది. ప్రస్తుతం కేబినెట్‌లో 16 ఖాళీలు ఉండగా, ఎంత మందిని తీసుకుంటారు? ఎవరెవరిని తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు పూర్తిస్థాయి విస్తరణ ఉంటుందా? లేక పది మందికే పరిమితం చేస్తారా? అలాగే, పాత మంత్రుల్లో ఎంత మందికి ఛాన్స్ ఉంటుంది? ఈసారి ఎక్కువమంది కొత్త ముఖాలకు చోటు కల్పిస్తారా? కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కూడా ఛాన్సిస్తారా? అంటూ గులాబీ లీడర్లు చర్చించుకుంటున్నారు.

కేబినెట్‌ బెర్త్ ఖాయమంటూ కొంతమంది పేర్లు తెరపైకి వచ్చినా అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో వాళ్లంతా సైలెన్స్‌ మెయింటైన్ చేస్తున్నారు. ఇక పదవి ఖాయమన్న ధీమాతో ఉన్న నేతలు సైతం ఎక్కడ నోరు విప్పితే ఏం కొంప మునుగుతుందోనని మౌనం పాటిస్తున్నారు. కొందరైతే తమ పేర్లు ప్రచారంలో లేకపోయినా చివరి నిమిషంలో ఏమైనా జరగొచ్చని, తమకు కూడా పిలుపురావొచ్చనే ఆశతో ఉన్నారు. మరికొందరైతే తమకు కేబినెట్‌ బెర్త్‌ ఖాయమంటూ ప్రచారం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంకొందరైతే జిల్లాలు, సామాజిక సమీకరణాలు, సమర్ధతను బేరీజు వేసుకుంటూ అమాత్య పదవి ఖాయమన్న ధీమాతో ఉన్నారు.

మంత్రి పదవి కోసం ట్రై చేస్తున్న ఎమ్మెల్యేలు కలిసొస్తే అమాత్య యోగం పడుతుందని లేకుంటే కనీసం విప్‌ పదవైనా దక్కుతాయన్న ఆలోచనలో ఉన్నారు. దాంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ను కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నేతల తాకిడి అధికంగా ఉండటంతో కేసీఆర్ ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. దాంతో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌‌ను కలిసి తమను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

తొలి విడత విస్తరణలో 8నుంచి 10మందికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. పాత-కొత్త కలయికతో మంత్రివర్గ కూర్పు ఉండనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈసారి ఎక్కువ మంది కొత్త ముఖాలకు చోటు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కూడా ఛాన్స్‌ దక్కొచ్చని చెబుతున్నారు. మొత్తానికి ఇన్నిరోజులూ కేబినెట్‌ విస్తరణ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసినా నేతలు ఇప్పుడు తమకు చోటు దక్కుతుందా లేదా అని తెగ టెన్షన్‌ పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories