కలిసి నడుద్దాం.. ప్రగతి సాధిద్దాం: కేసీఆర్‌

కలిసి నడుద్దాం.. ప్రగతి సాధిద్దాం: కేసీఆర్‌
x
Highlights

రాష్ట్ర విభజన తర్వాత ఎడమొఖం పెడముఖంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు ఇక నుంచి కలిసి కట్టుగా నడవబోతున్నాయా? రెండు ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తాయా?...

రాష్ట్ర విభజన తర్వాత ఎడమొఖం పెడముఖంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు ఇక నుంచి కలిసి కట్టుగా నడవబోతున్నాయా? రెండు ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తాయా? ఇద్దరు సీఎంలు సామరస్యగా సమస్యలు పరిష్కరించుకుంటూ విభజన హామీలు సాధించుకునేందుకు ప్రయత్నిస్తారా..? అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి. గతంలో ఏపీ, తెలంగాణ సీఎంల మధ్య సఖ్యత లేకపోవడంతో విభజన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. తాజాగా ఏపీ కొత్త సీఎంగా వైఎస్ జగన్ ఎన్నిక కావడంతో తెలంగాణ సీఎం కేసీఆర్‌లో కొత్త జోష్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సమస్యలకు పరిష్కారం దొరకుతుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఎన్నికతో సమన్వయంతో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన నాటి నుంచి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య సఖ్యత లేదు. గత సీఎం చంద్రబాబు, కేసీఆర్ మద్య అంతర్యుద్ధం నడిచింది. దీంతో విభజన సమస్యలకు పరిష్కారం దొరకలేదు. కృష్ణా,గోదావరి జలాలు, విద్యుత్, ఉద్యోగుల విభజన లాంటి అంశాలపై సీఎంలు చర్చించిన దాఖలాలు లేవు. దీంతో ఐదేళ్లుగా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.

అయితే, ప్రస్తుతం ఏపీకి కొత్త సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయడంతో కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ జగన్‌కు తన పక్షాన, తెలంగాణ ప్రభుత్వ పక్షాన అభినందనలు తెలిపారు. తెలుగు ప్రజల జీవన గమనంలో ఇది ఒక ఉజ్వలమైన ఘట్టమన్నారు. ఉభయ రాష్ర్టాల్లో, దేశంలో, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ ప్రేమతో, అనురాగంతో, పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు రెండు రాష్ర్టాల తెలుగు ప్రజలు, రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు ఇప్పుడు చేయాల్సింది ఖడ్గచాలనం కాదని కరచాలనం అని చెప్పారు కేసీఆర్. ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయతతో, అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలన్నారు. తనకు తెలిసి జగన్‌మోహన్‌రెడ్డి ముందున్న తక్షణ కర్తవ్యం గోదావరి జలాల సంపూర్ణ వినియోగమేనన్నారు. వందశాతం ఇది జరిగి తీరాలని, మీ ఆధ్వర్యంలో జరుగుతుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు కేసీఆర్.

అలాగే, కృష్ణానదిలో మనకు సమస్యలు ఉన్నాయని, అక్కడ లభించే నీటి బొట్టును ఒడుపుగా, ఒద్దికగా, ఓపికగా ఉభయ రాష్ర్టాల వాళ్లం కలిసి వినియోగించుకుంటూనే సంవృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో ప్రతి అంగుళం సస్యశ్యామలం కావాలని తాను మనసారా కోరుకుంటున్నానన్నారు కేసీఆర్. ఆ కర్తవ్య నిర్వహణలో అవసరమన అండదండలు సహాయ సహకారాలు అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం అందిస్తుందని ఈ సందర్భంగా ఉభయ రాష్ర్టాల ప్రజలకు తాను తెలియజేస్తున్నానన్నారు.

మొత్తానికి ఏపీకి కొత్త సీఎంగా జగన్‌ రాకతో విభజన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. మరి ఈ ఇద్దరి సీఎంలు సమన్వయంతో పనిచేసి విభజన సమస్యలు సాధించుకోవడంతోపాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారా..? లేదా..? అన్నది చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories