మరో శాఖపై కేసీఆర్ నజర్...విప్లవాత్మక మార్పులకు సర్కార్‌ శ్రీకారం

మరో శాఖపై కేసీఆర్ నజర్...విప్లవాత్మక మార్పులకు సర్కార్‌ శ్రీకారం
x
Highlights

ఇంటర్ బోర్డు వివాదంతో విద్యాశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ప్రాథమిక విద్య నుంచి యూనివర్శిటీ ఎడ్యుకేషన్ వరకు సమూల మార్పులకు కసరత్తు...

ఇంటర్ బోర్డు వివాదంతో విద్యాశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ప్రాథమిక విద్య నుంచి యూనివర్శిటీ ఎడ్యుకేషన్ వరకు సమూల మార్పులకు కసరత్తు చేస్తున్నారు. సర్కార్ స్కూళ్ల నిర్వహణ, టీచర్ల వ్యవహారాలను స్థానిక సంస్థలకు అప్పగించేందుకు రంగంసిద్ధం చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్సీటీసీ ఎన్నికల ముగిసిన తర్వాత కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంస్కరణలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్ శాఖల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సీఎం ఇప్పుడు విద్యారంగంపై దృష్టిపెట్టారు. పెద్దమొత్తంలో జీతాలు చెల్లిస్తున్నా విద్యాశాఖలో ఆశించిన ఫలితాలు రావడం లేదని భావిస్తున్న కేసీఆర్‌ సమూల మార్పులకు సిద్ధమవుతున్నారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యాయనే ఆరోపణలు పెరగడంతో విద్యాశాఖలో సంస్కరణలు, సమూల ప్రక్షాళనకు కసరత్తు చేస్తున్నారు.

1998 కంటే ముందు స్కూళ్ల నిర్వహణ, టీచర్ల నియామకాలు, బదిలీలు అంతా జిల్లా, మండల పరిషత్‌ల ఆధీనంలో ఉండేవి. ఆ తర్వాత టీచర్ల నియామకాలు, బదిలీల వ్యవహారాన్ని స్థానిక సంస్థల నుంచి తప్పించి డీఈవోలకు అప్పగించారు. అయితే ఇంటర్ వివాదం నేపథ్యంలో పాత పద్ధతిని పునరుద్ధరించి సర్కార్ బడుల నిర్వహణ, టీచర్ల వ్యవహారాలను స్థానిక సంస్థలకు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పాఠశాల విద్యను మండల ప్రజాపరిషత్‌ కమిటీకి అప్పగించనున్నారు. అలాగే 6 నుంచి టెన్త్ వరకు హైస్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహణను జిల్లా పరిషత్‌లకు అప్పగించాలని భావిస్తున్నారు. 73,74 యాక్టుల ప్రకారం స్థానిక సంస్థలకు అప్పగించాల్సిన 29 రకాల విధుల్లో విద్యారంగం కూడా ఉంది. ఇప్పుడిదే చట్టాన్ని ఉపయోగించుకొని పాత పద్ధతిని పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో అవినీతి పేరుకుపోయిందంటూ సమూల ప్రక్షాళన దిశగా అడుగులేస్తోన్న కేసీఆర్‌ ఇప్పుడు విద్యాశాఖపై ఫోకస్‌‌ పెట్టడం సంచలనం రేపుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories