స్టాలిన్ కేసీఆర్ భేటీలో ఏం తేల్చినట్టు..?

స్టాలిన్ కేసీఆర్ భేటీలో ఏం తేల్చినట్టు..?
x
Highlights

ఫెడరల్‌ ఫ్రంట్‌పై కేసీఆర్‌ స్పీడ్‌ కంటిన్యూ చేస్తున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్‌తో మరోసారి భేటీ అయ్యారు. కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో ప్రాంతీయ...

ఫెడరల్‌ ఫ్రంట్‌పై కేసీఆర్‌ స్పీడ్‌ కంటిన్యూ చేస్తున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్‌తో మరోసారి భేటీ అయ్యారు. కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషిస్తాయని భావిస్తున్న సమయంలో ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై ఇద్దరు నేతలు మధ్య కీలక చర్చ జరిగింది.

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌తో సమావేశం అయ్యారు. చెన్నైలోని స్టాలిన్‌ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌ను ఘనంగా స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. ఆ తర్వాత సుమారు గంటకు పైగా జరిగిన భేటీలో ఇద్దరు నేతలు కీలక విషయాలపై చర్చ జరిపారు. మరో 10 రోజుల్లో వెల్లడయ్యే సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో ప్రాంతీయ పార్టీలదే కీలకం అని భావిస్తున్న తరుణంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై కీలక చర్చ జరిపారు.

కాంగ్రెస్‌, బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే క్రమంలో కేసీఆర్‌ స్టాలిన్‌తో భేటీ కీలకంగా మారింది. గత వారమే కేరళకు వెళ్లిన కేసీఆర్‌ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సమావేశం అయ్యారు. అదే సమయంలో కర్ణాటక సీఎం కుమారస్వామితో ఫోన్‌లో మాట్లాడారు. అంతకుముందు ఫెడరల్‌ ఫ్రంట్‌కు అనుకూలంగా ఉన్న పార్టీల అధినేతలతో సమావేశం అయ్యారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకం కాబోతుందని అప్పుడు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ వివరిస్తూ వచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాదని బలంగా నమ్ముతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన తదుపరి సమావేశాల్లో మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేశ్‌లను కలిసే అవకాశాలున్నాయి. అయితే స్టాలిన్ లాగే వాళ్లు కూడా కేసీఆర్ ప్రతిపాదనను లైట్ తీసుకుంటారా..? లేక సానుకూలంగా స్పందిస్తారా? అన్నది వేచి చూడాలి.

అయితే ఇటీవలి దక్షిణాది పర్యటనలోనే డీఎంకే అధినేత స్టాలిన్‌తో సమావేశం కావాలని కేసీఆర్‌ అనుకున్నారు. అయితే ఈ నెల 13 న రావాలని కేసీఆర్‌ను, స్టాలిన్‌ ఆహ్వానించడంతో సోమవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో డీఎంకే సీనియర్ నాయకులు దురైమురుగన్, టీఆర్‌బాలు పాల్గొనగా కేసీఆర్‌ వెంట ఎంపీలు వినోద్ కుమార్, సంతోశ్ కుమార్ ఉన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories