కోటి ఎకరాలకు నీళ్లిచ్చి.. నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

CM KCR
x
CM KCR
Highlights

బంగారు తెలంగాణలో సాగు నీటి ప్రాజెక్టులే అత్యంత కీలకమని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై ప్రగతి భవన్‌లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

బంగారు తెలంగాణలో సాగు నీటి ప్రాజెక్టులే అత్యంత కీలకమని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై ప్రగతి భవన్‌లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వాహణ కోసం విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి 30వేల కోట్ల ఆర్ధిక సాయం కోరినా ఆశించిన స్ధాయిలో స్పందన రాలేదన్నారు.

కోటి ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేయాలని సీఎం కేసీఆర్ నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని నమ్మకంతోనే ప్రజలు తమకు పట్టం కట్టారన్న ఆయన ఈ టర్మ్ లోనే అన్ని ప్రాజెక్టులు నూటికి నూరు శాతం పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవలే ప్రాజెక్టుల పనులను స్వయంగా సందర్శించి వచ్చిన రిటైర్డు ఇంజనీర్లు, వివిధ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు, ప్రభుత్వ ముఖ్య అధికారులతో ప్రగతి భవన్‌లో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వారిగా నివేదికలు అందజేసిన రిటైర్డ్ ఇంజనీర్లు, పనులు వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను స్వయంగా వివరించారు .

కాళేశ్వరం తరహాలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేయాలని సూచించారు. రైతులకు సాగునీరు ఇవ్వడంతో పాటు పరిశ్రమలకు, మంచినీటికి కూడా ఎంత నీరు అవసరమవుతుందో లెక్కకట్టి, ఏ ప్రాజెక్టు నుంచి ఎంత నీరు వాడాలో నిర్ణయించాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలోని నీటి వినియోగం అత్యంత కీలకమన్న కేసీఆర్ కృం‌ష్ణా, గోదావరి నదుల పరిధిలో రాష్ట్ర వాటాను పూర్తి స్ధాయిలో వినియోగించుకోవాలన్నారు. ప్రాజెక్టుల్లోకి వచ్చే నీటితో మొదట చెరువులు నింపడానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్ర వృద్ధి రేటు పరుగులు పెడుతుందని అధికారులకు కేసీఆర్ సూచించారు.

సమీక్షలో భాగంగా కేంద్రం వైఖరిపై సీఎం తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. భారీ సాగు నీటి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించి ఆర్ధిక సాయం కోరినా పట్టించుకోలేదని కేసీఆర్ విమర్శించారు. మిషన్‌ భగీరథ, కాకతీయలకు 24 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా మోదీ ప్రభుత్వం 24 రూపాయలు కూడా ఇవ్వలేదంటూ ఆక్షేపించారు. అయినా నిధుల గురించి ఎలాంటి ఆందోళన వద్దన్న ఆయన బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయిస్తామని భరోసానిచ్చారు. ఇంకా అవసరం అయితే ఇతర ఆర్థిక సంస్థల నుంచి కూడా నిధులు సేకరిస్తామని వివరించారు. ప్రాజెక్టుల వారిగా పనుల వేగవంతం చేయడంపై దృష్టి సారించాలని ఆదేశించారు .

Show Full Article
Print Article
Next Story
More Stories