ఫెడరల్‌ ఫ్రంటా? రిటర్న్‌ గిఫ్టా?

kcr
x
kcr
Highlights

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో టీఆర్‌ఎస్ నేతలు వైసీపీతో చర్చలు జరపడం వెనక ఇతర రాజకీయ ప్రయోజనాలున్నాయా? టీడీపీ అధినేత చంద్రబాబును దెబ్బ తీసే లక్ష్యంతో టీఆర్ఎస్‌ వ్యూహాలు సిద్ధం చేస్తోందా ? కారు పార్టీతో దోస్తి కోసం ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారా ?

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో టీఆర్‌ఎస్ నేతలు వైసీపీతో చర్చలు జరపడం వెనక ఇతర రాజకీయ ప్రయోజనాలున్నాయా? టీడీపీ అధినేత చంద్రబాబును దెబ్బ తీసే లక్ష్యంతో టీఆర్ఎస్‌ వ్యూహాలు సిద్ధం చేస్తోందా ? కారు పార్టీతో దోస్తి కోసం ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారా ? తన వ్యక్తిగత చరిష్మాకు కేసీఆర్ చాణక్య నీతి తోడు చేస్తున్నారా ? లెట్స్ వాచ్ దిస్ స్టోరి.

రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ అంటే రెండు అంటూ నిర్వచనం చెబుతూనే ప్రత్యర్ధి టోటల్‌ లాస్ తరహాలో టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఓ వైపు కొనసాగిస్తూనే తమకు రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్న చంద్రబాబును దెబ్బ తీసే దిశగా అధినేత కేసీఆర్ ప్రణాళిక రచించారు. ఫెడరల్ ఫ్రంట్‌లోకి వైసీపీని ఆహ్వానించడం ద్వారా అటు చంద్రబాబును ఇటు కాంగ్రెస్‌ను దెబ్బతీసేలా వ్యూహం సిద్ధం చేశారు.

తెలంగాణలో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ఎన్నికల్లో తమను దెబ్బతీయాలని చూసిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ ప్రకటించారు.ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు టార్గెట్ గా టీఆర్ఎస్ నేతలు విమర్శలకు దిగారు. తాజాగా ఏపీలో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చంద్రబాబుకు నూటికి నూరు శాతం రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ ప్రకటించారు. ఇదే సమయంలో జగన్‌తో టీఆర్ఎస్ నేతలు భేటి కావాలని నిర్ణయించడం రాజకీయాల్లో అటు ఆసక్తిని ఇటు ఉత్కంఠను రేపింది.

వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్ర ముగింపు సందర్భంగా జాతీయ స్ధాయిలో ఏపార్టీతో పొత్తు పెట్టుకోమంటూ ప్రకటించారు. ఇదే సమయంలో ప్రస్తుతం ఏపీ విభజన హామీలు అమలు కావాలంటే టీఆర్ఎస్‌తో సఖ్యత అవసరమన్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదాపై బహిరంగంగా మద్దతు ఇచ్చినందున ఏపీలోని 25 సీట్లు తాము గెలుచుకుంటే టీఆర్ఎస్ తమకు అండగా నిలిస్తే పార్లమెంట్ లో నిర్ణయాత్మక పాత్ర పోషించవచ్చంటూ జగన్ విశ్లేషించారు. ఈ నేపధ్యంలో టీఆర్ఎస్సే ఒక అడుగు ముందుకు వేసి జగన్ తో భేటి కావాలని నిర్ణయించింది.

ఇరు పార్టీలు పరస్పర రాజకీయ ప్రయోజనాల కోసమే చర్చలు జరుపుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ, ఆర్ధిక, సామాజికంగా బలమైన నాయకుడిగా ఉన్న చంద్రబాబును ఢీ కొట్టాలంటే టీఆర్ఎస్ సహకారం కావాలని జగన్ భావిస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ ఏపీ సీఎం కావాలనుకుంటున్న జగన్ వీలైనంత మేర కేసీఆర్ తోడ్పాటు తీసుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో వైసీపీ పోటీ చేయకుండా పరోక్షంగా టిఆర్ఎస్‌కు సహకరించినట్టు పలువురు చెబుతున్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ కూడా తన వంతు జగన్‌కు ఆర్థికంగా సహకరిస్తూ రాజకీయంగా అనుసరించాల్సిన సలహాలు సూచనలు చేస్తూ బాబును దెబ్బతీసేలా వ్యూహరచన చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఫెడరల్ ఫరంట్ ప్లాట్ ఫాంను వేదికగా మార్చుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

టీఆర్ఎస్ , వైసీపీల నేతల చర్చలపై టీడీపీ నేతలు బహిరంగంగా స్పందించకపోయినా జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పటికే మోడీ, జగన్ , కేసీఆర్ ఒకటే నంటూ ప్రచారం చేస్తున్న సీఎం చంద్రబాబు ఇదే అదునుగా విమర్శలకు పదును పెట్టే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల సమయంలో కేసీఆర్ రాజేసిన తరహాలోనే ఏపీలో కూడా ఇదే అంశాన్ని హైలెట్ చేసే వ్యూహాన్ని టీడీపీ సిద్ధం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

టీడీపీ వ్యూహం ఎలా ఉన్నా టీఆర్ఎస్ నేతలు మాత్రం భవిష్యత్ తరాల ప్రజా ప్రయోజనాల కోసమే జగన్‌తో చర్చలు జరుపుతున్నట్టు చెబుతున్నారు. రోజుకో మాట పూటకో బాట పట్టే వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శిస్తూనే గడచిన ఐదేళ్లలో జగన్ అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి దూరంగానే ఉండటం వల్లే చర్చలు జరుపుతున్నామన్నారు. జాతీయ రాజకీయాల పేరుతో నైతికత మరచి ప్రవర్తిస్తున్న చంద్రబాబు ఈ విషయంలో తమపై విమర్శలు చేయలేరంటూ తాజా పరిణామాలను సమర్ధించుకుంటున్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకమైతే రాష్ట్రాలకే ప్రయోజనం చేకూరుతుందన్న విషయం మరిచిపోతే ఎలాగంటూ ప్రశ్నిస్తున్నారు.

అటు టీడీపీకి ఇటు కాంగ్రెస్ కు చెక్ పెట్టేలా వైసీపీతో టీఆర్ఎస్‌ జట్టు కట్టినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు . ఏపీలో కాంగ్రెస్ నామ మాత్రంగానే ఉంది. తెలంగాణలో బలమైన నాయకులు ఉన్నా వ్యక్తిగత చరిష్మా ఉన్న వారు లేరని నిర్ధారణకు వచ్చిన టీఆర్ఎస్ ఈ వ్యూహం అనురిస్తున్నట్టు విశ్లేషిస్తున్నారు. టీడీపీని దెబ్బతీయడం వల్ల జాతీయ స్ధాయిలో చక్రం తిప్పే అవకాశం దక్కుతుందని కూడా టీఆర్ఎస్ నేతలు ఆశిస్తున్నారు. అయితే ఇవన్నీ ఏ మేరకు ఫలిస్తాయనేది తెలుసుకోవాలంటే మరికొంత ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories