బాబు బుజ్జగించినా.. దారికి రాని పంచాయితీ

బాబు బుజ్జగించినా.. దారికి రాని పంచాయితీ
x
Highlights

టీడీపీ కంచుకోటలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరు ఆగడం లేదు. స్వయంగా సీఎం చంద్రబాబే జోక్యం చేసుకుంటున్నా ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. నువ్వు ఒక్క టంటే నేను నాలుగంట అనే తరహాలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.

టీడీపీ కంచుకోటలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరు ఆగడం లేదు. స్వయంగా సీఎం చంద్రబాబే జోక్యం చేసుకుంటున్నా ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. నువ్వు ఒక్క టంటే నేను నాలుగంట అనే తరహాలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అదిగో మీ అవినీతి చిట్టా అంటూ బహిరంగ విమర్శలకు దిగుతూ పార్టీ పరువు బజారుకీడుస్తున్నారు.

అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మధ్య మరో సారి మాటల తూటాలు పేలాయి. రాంనగర్ లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనుల పరిశీలన విషయంలో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు బహిరంగ దూషణలకు దిగారు. నాలుగేళ‌్ల క్రితం 23 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన రాంనగర్‌ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. సంక్రాంతి సమయంలో బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలంటూ అధికారులను ఆదేశించారు.

ఈ విషయం తెలుసుకున్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలంలా ఫైరయ్యాడు. స్వయంగా బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పేరు ఎత్తకుండా తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు. బ్రిడ్జి నిర్మాణం కోసం తాను పాటుపడితే అడ్డుకునేందుకు ప్రభాకర్ చౌదరి యత్నించారంటూ ఆరోపించారు. నాలుగున్నరేళ్లు చేసిన అభివృద్ధి ఏమి లేకపోయినా అవినీతి బాగా చేశారంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

జేసీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అభివృద్ధి ఎవరిదో అవినీతి ఎవరిదో తేల్చుకుందామా ? అంటూ సవాల్ విసిరారు. బ్రిడ్జి కాంట్రాక్ట్ అస్మదీయులకు అప్పగిస్తే అంతా తానే చేసినట్టు అవుతుందా ?అంటూ ప్రశ్నించారు. ప్రజాధనంతో చేస్తున్న పనులపై జేసీ పెత్తనం ఏంటంటూ ప్రశ్నించారు. అందరి చిట్టా తన దగ్గర ఉందంటూ ఘాటుగా హెచ్చరించిన ప్రభాకర్ చౌదరి తన సహనం నశిస్తే ఇబ్బందులు తప్పవంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

నాలుగేళ్లుగా ఎంపీ, ఎమ్మెల్యేలు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేడర్‌ రెండుగా విడిపోయిందని జమిలి ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలాంటి పరిణామాలు పార్టీతో పాటు ఇరువురికి మంచిది కాదంటూ ద్వితియ శ్రేణి నాయకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకొని వివాదానికి ముగింపు పలకాలని కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories