నగేశ్‌ సాయంతో రాకేష్ రెడ్డి భారీ స్కెచ్

నగేశ్‌ సాయంతో రాకేష్ రెడ్డి భారీ స్కెచ్
x
Highlights

వ్యాపారవేత్త జయరామ్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జయరామ్ హత్య వెనుక చాలా మంది పాత్ర ఉన్నట్లు బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు....

వ్యాపారవేత్త జయరామ్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జయరామ్ హత్య వెనుక చాలా మంది పాత్ర ఉన్నట్లు బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు రాకేష్‌‌రెడ్డితోపాటు పలువురిని ప్రశ్నించిన పోలీసులు మరింత సమాచారం సేకరించారు. జయరామ్‌ హత్యలో రాకేష్‌‌కు సహకరించిన ఎస్సార్‌నగర్ రౌడీషీటర్ నగేష్‌‌ను బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రౌడీషీటర్ నగేష్‌‌తోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అలాగే కోస్టల్ బ్యాంక్ ఉద్యోగి ఈశ్వర్‌ప్రసాద్, అకౌంటెంట్‌ వేణును కూడా పోలీసులు విచారించారు. వాళ్లిద్దరూ చెప్పిన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.

జయరామ్ ఆస్తులను మొత్తం కొట్టేయాలని రాకేష్‌‌రెడ్డి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అమ్మాయితో జయరామ్‌ను ట్రాప్‌ చేసి తన ఇంటికి రప్పించుకున్న రాకేష్‌ రౌడీషీటర్‌ నగేష్‌తో కలిసి బెదిరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. అలాగే జయరామ్ నుంచి దశలవారీగా డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఖాళీ బాండ్ పేపర్స్‌పై జయరామ్‌తో సంతకాలు కూడా చేయించుకున్నట్లు ఇంటరాగేషన్‌లో తేలింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో రాకేష్‌‌కు ఎస్సార్‌‌నగర్ రౌడీషీటర్ నగేష్‌ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. జయరామ్‌ను కిడ్నాప్ చేయడం దగ్గర్నుంచి బాండ్ పేపర్స్‌పై సంతకాలు చేయించుకోవడం అనంతరం మర్డర్ చేయడం వరకు నగేష్‌ పాత్ర ఉన్నట్లు విచారణలో తేలింది.

జయరామ్ మర్డర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిఖాచౌదరిని బంజారాహిల్స్‌ పోలీసులు ప్రశ్నించారు. శిఖా వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాకేష్‌‌రెడ్డితో సంబంధాలపై ఆరా తీశారు. రాకేష్‌‌రెడ్డి నీకు ఎలా తెలుసు? ఎప్పట్నుంచి తెలుసు? రాకేష్‌‌రెడ్డిని నీకు పరిచయం చేసింది ఎవరు? అంటూ ప్రశ్నించారు. జయరాం హత్య తర్వాత అతని ఇంటికి ఎందుకెళ్లావు? నీతోపాటు జయరాం ఇంటికొచ్చిన యువకుడు ఎవరు? జయరామ్‌తో ఏమైనా విభేదాలు ఉన్నాయా? జయరామ్‌తో నీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? జయరాం-రాకేష్‌తో నీకు ఆర్ధిక లావాదేవీలు ఉన్నాయా? అంటూ శిఖాను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

జయరామ్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడైన రాకేష్‌‌‌రెడ్డితో 11మంది పోలీస్ అధికారులు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. జయరాం హత్య తర్వాత ఈ 11మంది పోలీస్ అధికారులకు రాకేష్ ఫోన్లు చేసినట్లు గుర్తించారు. రాకేష్‌రెడ్డి కాల్‌ డేటా ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు ఈ సమాచారం సేకరించారు. వీరిలో నలుగురు డీఎస్సీలు, నలుగురు ఇన్స్‌పెక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ఏసీపీతోపాటు నల్లకుంట ఇన్‌స్పెక్టర్ సహకరించినట్లు భావిస్తున్నారు. రాకేష్‌తో పోలీస్ అధికారుల సంబంధాలపైనా ఆరా తీస్తోన్న బంజారాహిల్స్ పోలీసులు త్వరలో నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

జయరామ్ మర్డర్‌ ఎలా జరిగిందో తెలుసుకునేందుకు బంజారాహిల్స్ పోలీసులు రాకేష్‌ రెడ్డి ఇంట్లో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. రాకేష్‌ ఇంటిని పరిశీలించిన పోలీసులు జయరామ్‌ హత్యకు ముందు, తర్వాత సన్నివేశాలను స్కెచ్‌ వేశారు. గంటపాటు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు హత్య తర్వాత కారులో తిరిగిన ప్రాంతాలకు రాకేష్‌‌ను తీసుకెళ్లారు. అలాగే హత్య తర్వాత జయరామ్‌ ఇంటికి శిఖాచౌదరితో కలిసి వచ్చిన సంతోష్‌ ‌కుమార్‌ గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వైన్స్‌, పబ్‌లు నిర్వహిస్తోన్న సంతోష్‌‌కు త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories