Top
logo

ఐటీ గ్రిడ్స్‌ సీఈఓ అశోక్‌ కోసం వేట ముమ్మరం

ఐటీ గ్రిడ్స్‌ సీఈఓ అశోక్‌ కోసం వేట ముమ్మరం
X
Highlights

ఐటీ గ్రిడ్ కేసు వ్యవహారంలో సైబరాబాద్‌ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఐటీ గ్రిడ్స్‌ కంపెనీలో సోదాలు...

ఐటీ గ్రిడ్ కేసు వ్యవహారంలో సైబరాబాద్‌ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఐటీ గ్రిడ్స్‌ కంపెనీలో సోదాలు కొనసాగిస్తున్న తెలంగాణ పోలీసులు ఆ సంస్థ సీఈఓ అశోక్‌ కోసం వేట ముమ్మరం చేశారు. మరోవైపు డేటా లీకేజీ వార్తలు అవాస్తవమని ఏపీ అధికారులు ప్రకటించారు.

డేటా చోరీ వ్యవహారంలో మాదాపూర్‌ ఐటీ గ్రిడ్స్‌ కంపెనీలో సోదాలు కొనసాగాయి. రికార్డులు, ల్యాప్‌టాప్‌లను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన సమాచారం డేటా గ్రిడ్స్‌ సంస్థకు ఎలా చేరిందనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. ఏపీ ప్రభుత్వానికి సర్వేలు చేసిన సంస్థల ద్వారా డేటాను ఐటీ గ్రిడ్‌ సేకరించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డేటాను సమీకరించేందుకు ఎవరెవరు సహకరించి ఉంటారనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.

డేటా లీకే కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఐటీ గ్రిడ్‌ డైరెక్టర్‌ అశోక్‌ను సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు గత నెల 23వ తేదీనే పోలీస్టేషన్‌కు పిలిపించి విచారించినట్లు సమాచారం. ఆయన నుంచి కొంత ప్రాథమిక సమాచారం సేకరించిన పోలీసులు మరోసారి విచారణకు రావాల్సిందిగా పంపించారు. ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌కు అశోక్‌ వెళ్లలేదు. ఫిబ్రవరి 27వ తేదీన ఐటీ గ్రిడ్ కార్యాలయంలోని కంప్యూటర్లలో ఉన్న సమాచారంతో పాటు సేవా మిత్ర యాప్‌లో కొంత సమాచారాన్ని తొలగించినట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీస్ శాఖలోని ఐటీ విభాగం నిపుణుల సాయం తీసుకొని డేటా మొత్తం రికవరీ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అశోక్ అొంగుబాటుకు సైబరాబాద్‌ పోలీసులు ఇచ్చిన గడువు ముగియడంతో ఆయన కోసం గాలింపు చేపట్టారు. అశోక్‌ కోసం తెలంగాణ పోలీసులు మూడు టీమ్‌లను ఆంధ్రప్రదేశ్‌కు పంపారు.

మరోవైపు ఐటీ గ్రిడ్స్ సంస్థకు సంస్థకు సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరిస్తున్న అమెజాన్‌, గూగుల్‌ సంస్థల వివరణ కోరుతూ పోలీసులు లేఖలు రాశారు. సైబరాబాద్‌ పోలీసుల నోటీస్‌లకు స్పందించిన అమెజాన్‌, గూగుల్‌ రెండు రోజుల్లో వివరాలు ఇస్తామని తెలిపాయి. ఇక ప్రభుత్వ డేటా చోరీ అయ్యే అవకాశమే లేవని ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి విజయానంద్ తేల్చి చెప్పారు. డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కూడా లేదని వివరించారు. ఆధార్‌ డేటా చోరీకి గురయ్యేందుకు ఆస్కారం లేదన్న విజయానంద్ ప్రజాసాధికార సర్వే డేటా లీక్‌ అయిందనే వార్తలు పూర్తిగా అవాస్తవమని అన్నారు.

ఇక తెలంగాణ పోలీసులు సమాచారం కోరితే స్పందిస్తామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ఐటీ గ్రిడ్‌కు వెళ్లిన ఓటరు జాబితా అందరికీ అందుబాటులో ఉండేదేనని అన్నారు. దానిని పబ్లిక్‌ డొమైన్‌లో ఎవరైనా దీన్ని తీసుకునే వీలుందని వివరించారు. ఓటరు జాబితాలో ఆధార్‌, బ్యాంకు ఖాతా, సంక్షేమ పథకాల సమాచారం ఉండదని తెలిపారు.

Next Story