నయీం ఆస్తుల అటాచ్‌మెంట్‌కు రంగం సిద్ధం

Nayeem
x
Nayeem
Highlights

కరడుగట్టిన నేరగాడు నయీం ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు ఆదాయపన్నుశాఖ రంగం సిద్ధం చేసింది. ఈ ఆస్తుల చిట్టాను ఇప్పటికే ఎడ్యుడికేటింగ్‌ అథారిటీకి పంపారు. అక్కడి నుంచి అనుమతి రాగానే ఆస్తుల స్వాధీన ప్రక్రియ మొదలుకానుంది.

కరడుగట్టిన నేరగాడు నయీం ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు ఆదాయపన్నుశాఖ రంగం సిద్ధం చేసింది. ఈ ఆస్తుల చిట్టాను ఇప్పటికే ఎడ్యుడికేటింగ్‌ అథారిటీకి పంపారు. అక్కడి నుంచి అనుమతి రాగానే ఆస్తుల స్వాధీన ప్రక్రియ మొదలుకానుంది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం నయీం ఆస్తుల విలువ 1200 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా.

కనిపించిన స్థలాన్ని కబ్జా చేయడం కాదూ కూడదంటే కడతేర్చడం ఇదీ నయీం అనుసరించిన విధానం. అందుకే అనతికాలంలోనే ఎవరూ ఊహించనన్ని ఆస్తులు కూడబెట్టాడు. 2016 ఆగస్టు 9న షాద్‌నగర్‌ వద్ద జరిగిన కాల్పుల్లో నయీం మరణించిన తర్వాత అతని పాపాల చిట్టా బయటపడటం మొదలైంది. ఇంతకాలం అతనికి భయపడి మౌనంగా ఉన్న బాధితులు ఒక్కసారిగా బయటకు వచ్చారు. తమ స్థలాలు ఎలా కబ్జా చేసిందీ వివరించారు. దీనిపై ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 293 కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు.

నయీం కేసులను దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు నయీం ఇప్పటివరకు వెయ్యి ఎకరాల భూమి, 1.67 లక్షల చదరపు అడుగుల ఇళ్లస్థలాలు, 27 ఇళ్లు అక్రమంగా కూడబెట్టినట్లు గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకొని బాధితులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

బాధితుల ఫిర్యాదుల ఆధారంగా నయీం ఎవరెవరి స్థలాలు కబ్జా చేశాడో సిట్‌ అధికారులు తెలుసుకున్నారు. నయీంతోపాటు అతని బంధువుల ఇళ్లలో జరిపిన సోదాల్లో వీటికి సంబంధించిన దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని సర్వే నంబర్ల ఆధారంగా కబ్జా ఆస్తులు గుర్తించారు. నయీం కబ్జా ఆస్తులను గుర్తించిన పోలీసులు వాటిపై ఎలాంటి లావాదేవీలూ జరగకుండా చూడాలంటూ రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాశారు. ఈ లేఖ ప్రకారం లావాదేవీలు నిలిపివేయడం కుదరదని, తమకు న్యాయస్థానం ద్వారా ఆదేశాలు రావాల్సి ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తెలిపారు. దాంతో సిట్‌ అధికారులకు ఏం చేయాలో పాలుపోలేదు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ఆస్తుల దస్తావేజులను తమ స్వాధీనంలో ఉంచుకున్నారు. వందలకోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు తెరవెనుక ప్రయత్నాలు మొదలయ్యాయని పోలీసులు గుర్తించారు.

అయితే, నయీం కబ్జా చేసిన ఆస్తుల్లో ఏ ఒక్కటీ అతని పేరుమీద లేదు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్లమీదనే ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేయించేవాడు. అతనిపై కేసు పెట్టిన ఆదాయపన్నుశాఖ అధికారులు ఇప్పటికే నయీం ఇళ్లకు నోటీసులు అంటించారు. ఆదాయపన్నుశాఖలోని బినామీ ప్రాపర్టీస్‌ ప్రొహిబిషనరీ విభాగం అధికారులు ఈ వ్యవహారాన్ని చూస్తున్నారు. నయీం ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవల ఎడ్యుడికేటింగ్‌ అథారిటీకి లేఖ రాశారు. అథారిటీ తీర్పు వచ్చిన వెంటనే నయీం ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుంటారు. ఆ తర్వాత న్యాయస్థానంలో వాదోపవాదాలు మొదలవుతాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories