లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన నారీ లోకం... ఈ సారి 78 మంది

లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన నారీ లోకం... ఈ సారి 78 మంది
x
Highlights

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు. స్వతంత్ర భారతదేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 78 మంది ఎన్నికై రికార్డులకెక్కారు. 724 మంది...

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు. స్వతంత్ర భారతదేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 78 మంది ఎన్నికై రికార్డులకెక్కారు. 724 మంది మహిళలు పోటీ చేశారు. గెలిచిన 78 మందిలో ప్ర‌ధాన జాతీయ పార్టీలైన బీజేపీ నుంచి 41మంది, కాంగ్రెస్ నుంచి 9మంది విజ‌యం సాధించారు.

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌‌‌‌ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందనప్పటికీ లోక్‌‌‌‌సభకు వెళ్లే మహిళల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో మహిళా అభ్యర్ధులు చరిత్ర సృష్టించారు. 17వ లోక్‌‌‌‌సభకు పోటీ చేసిన 724 మంది క్యాండిడేట్లలో 78 మంది మహిళా ఎంపీలు గెలిచారు. 1952 నుంచి ఇప్పటి వరకు ఇంత మంది మహిళలు గెలవడం ఇదే మొదటిసారి. వారిలో యూపీ, పశ్చిమ బెంగాల్‌‌‌‌ నుంచి గెలిచిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో ఇప్పుడు మహిళా ఎంపీల శాతం 14కు పెరిగింది.

ఈ ఎన్నికల్లో 41 మంది సిట్టింగ్ ఎంపీలు మళ్లీ బరిలో నిలవగా వారిలో 27 మంది విజయం సాధించారు. వీరిలో చాలామంది మహిళలు హేమాహేమీలను మట్టికరిపించడం మరో విశేషం. భోపాల్‌లో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌ను బీజేపీ నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ ఓడించగా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓడించారు. తెలుగులో హిట్టయిన శీను వాసంతి లక్ష్మి చిత్రంలో అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన నవనీత్ కౌర్ సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసి శివసేన పార్టీ దిగ్గజం ఆనంద్ రావు అద్సుల్‌పై 30 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

16వ లోక్‌సభలో 64 మంది మహిళ ప్రాతినిధ్యం ఉండగా, ఈసారి అది 78కి చేరుకుంది. ఈ ఎన్నికల్లో అందరికంటే ఎక్కువగా కాంగ్రెస్ 54 స్థానాలను మహిళలకు కేటాయించగా, బీజేపీ 53 స్థానాల్లో మహిళలను బరిలోకి దింపింది. 78 మంది మహిళలతో కొత్త లోక్‌సభలో మహిళా ఎంపీల ప్రాతినిధ్యం 14శాతానికిపైగా పెరిగింది. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ నుంచి 11 మంది చొప్పున విజయం సాధించారు.

వాస్తవానికి ప్రతి సార్వత్రిక ఎన్నిక సమయంలో లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం పెరుగుతూ వస్తోంది. మొదటి, రెండో లోక్‌సభలో 24 మంది చొప్పున మహిళలు ఎన్నిక కాగా.. మూడో లోక్‌సభలో 37మంది అడుగుపెట్టారు. ఎనిమిదో లోక్‌సభ 45, తొమ్మిదిలో 28, 10వ లోక్‌సభలో 42 మంది మహిళలు చట్టసభకు ఎన్నికయ్యారు. 11వ లోక్‌సభలో 41, 12లో 44, 13లో 52, 14వ లోక్‌సభలో 52 మంది మహిళలు వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించారు. 15వ లోక్‌సభలో 52, 16వ లోక్‌సభలో 64 మంది మహిళా ఎంపీలు తమ వాణి వినిపించారు.

ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 724 మంది మహిళలు తమ భవితవ్యాన్ని పరీక్షించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధికంగా 54 మంది బరిలో నిలవగా.. బీజేపీ 53 మందికి టికెట్లు ఇచ్చింది. 222 మంది మహిళలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగారు. యూపీలో అత్యధికంగా 104 మంది, తమిళనాడులో 64, బీహార్‌లో 55, బెంగాల్‌లో 54మంది మహిళలు పోటీ చేశారు. ఈసారి 41 మంది సిట్టింగ్ ఎంపీలు మళ్లీ బరిలో నిలవగా వారిలో 27 మంది విజయం సాధించారు. గెలిచిన మొత్తం 78 మంది మహిళా ఎంపీలలో 27 మంది పాత వారే ఉన్నారు. 51 మంది మహిళా ఎంపీలు మొదటి సారిగా లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories