అభినందన్‌ను రేపు విడుదల చేస్తాం: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

అభినందన్‌ను రేపు విడుదల చేస్తాం: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
x
Highlights

భారత్‌ ఒత్తిడికి పాకిస్తాన్‌ తలొగ్గింది. భారత పైలట్‌ విక్రమ్‌ అభినందన్‌ వర్థమాన్‌ను రేపు విడుదల చేస్తామని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌...

భారత్‌ ఒత్తిడికి పాకిస్తాన్‌ తలొగ్గింది. భారత పైలట్‌ విక్రమ్‌ అభినందన్‌ వర్థమాన్‌ను రేపు విడుదల చేస్తామని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పాకిస్తాన్‌ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడేందుకు ప్రయత్నించినా, కుదరలేదని పేర్కొన్నారు. శాంతి చర్యల్లో భాగంగా అభినందన్‌ను విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

భారత గగనతలంపైకి దూసుకొచ్చిన శత్రు దేశాల యుద్ధ విమానాలను వెంబడిస్తూ ఐఏఎఫ్ పైలట్ అభినందన్ పాక్ భూభాగంలోకి వెళ్లిపోయి వారికి చిక్కారు. ఈ వార్త తెలిసిన మరుక్షణం నుంచి ఆ పైలట్ క్షేమం కోసం భారతీయులు దిగులు చెందారు. పైలట్‌పై పాక్ ప్రజలు దాడి చేసి తీవ్రంగా కొట్టినట్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన వీడియోలను చూసి మరింత ఆందోళనకు గురయ్యారు. దీంతో భారత పైలట్‌ అభినందన్‌ను విడిపించుకోవడానికి పాకిస్థాన్‌తో ఎలాంటి ఒప్పందం​ చేసుకోబోమని, బేషరతుగా వెంటనే అభినందన్‌ను పాక్‌ భారత్‌కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను విడుదల చేయాలని భారత్‌, పాక్‌పై ఒత్తిడి తెచ్చింది. అభినందన్‌ విడుదల విషయంలో పాక్‌తో ఎలాంటి చర్చలు కానీ, ఒప్పందాలు కానీ ఉండబోవని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అభినందన్‌ విషయంలో కాందహర్‌ విమానం హైజాక్‌ ఘటన తరహాలో ఇచ్చిపుచ్చుకునేవీ ఏమీ ఉండవని తెలిపింది.

పాక్‌ భూభాగం నుంచి పనిచేస్తున్న ఉగ్రవాదులు, వారి ముసుగులపై పాకిస్థాన్‌ సత్వరమే తగిన చర్య తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికే 40మందిని పొట్టనబెట్టుకున్న పూల్వామా ఉగ్రవాద దాడికి సంబంధించిన ఆధారాలను పాక్‌ రాయబారికి భారత్‌ అందజేసింది. ఈ నేపథ్యంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తన మాట నిలబెట్టుకోవాలని, భారత్‌ ఇచ్చిన ఆధారాలపై దర్యాప్తు జరపాలని కేంద్రం పేర్కొంది. భారత్‌ పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేసిందని, కానీ, పాకిస్థాన్‌ భారత్‌లోని సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకొని దాడికి ప్రయత్నించిందని కేంద్రం గుర్తు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories