'బాలాకోట్' గురి తప్పిందా!?

బాలాకోట్ గురి తప్పిందా!?
x
Highlights

బాలాకోట్‌పై భారత్‌ అటాక్‌ జరిగిన తీరుపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా సంస్థలు భారత్‌ దాడి గురి తప్పిందని అంటుంటే ప్రతిపక్షాలు...

బాలాకోట్‌పై భారత్‌ అటాక్‌ జరిగిన తీరుపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా సంస్థలు భారత్‌ దాడి గురి తప్పిందని అంటుంటే ప్రతిపక్షాలు ప్రూఫ్‌ ఎక్కడా అంటూ ప్రశ్నిస్తున్నాయి. భారత ప్రభుత్వం మాత్రం అది పక్కా అటాక్‌ అని, ఉగ్రవాదులు హతమయ్యారని స్పష్టంగా చెప్తోంది. అందుకు సాక్ష్యంగా భారత వైమానిక దళం తమ దగ్గర రాడార్‌ చిత్రాలున్నాయని చెప్తోంది. ఈ క్రమంలో శాన్‌ఫ్రాన్సిస్‌కో విడుదల చేసిన శాటిలైట్‌ చిత్రం అనేక సందేహాలను నివృత్తి చేస్తోంది.

భారత వైమానిక దళం పాకిస్థాన్‌ భూభాగంలోని బాలాకోట్‌ జైషే మహ్మద్‌ ఉగ్ర స్థావరంపై దాడుల వర్షం కురిపించిందని ఈ ఘటనపై జాతీయంగా, అంతర్జాతీయంగా భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఉగ్ర స్థావరాన్ని భూ స్థాపితం చేశామని భారత ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఉగ్ర స్థావరాలకు ఎలాంటి నష్టం జరగలేదని కొన్ని వార్తా సంస్థలు చెప్తున్నాయి. ఈ క్రమంలో శాన్ ఫ్రాన్సిస్‌కోలోని ప్లానెట్‌ ల్యాబ్స్‌ సంస్థ హై రెజల్యూషన్‌ శాటిలైట్‌ ఇమేజ్‌ను రిలీజ్‌ చేసింది. ఈ చిత్రం కాస్తా ఉన్న సందేహాలతో పాటు మరికొన్ని సందేహాలకు తెరలేపింది.

బాలకోట్‌పై జరిపిన భారత వైమానిక దాడిలో 250 నుంచి 350 వరకు జైషే మొహమ్మద్‌ ఉగ్రవాదులు మరణించారని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా, అందుకు సాక్ష్యాలు చూపించాలంటూ ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. మరోవైపు పుల్వామా ఉగ్రదాడిలో అశువులు బాసిన జవాన్ల కుటుంబాలు కూడా బాలకోట్‌ ఉగ్ర స్థావరంపై భారత వైమానిక దళాలు జరిగిన దాడుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల మృతదేహాలు చూపించాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో శాటిలైట్‌ ద్వారా విడుదలైన చిత్రం పలు సందేహాలకు సమాధానంగా నిలుస్తోంది.

భారత వైమానిక దాడులపై భిన్న కథనాలు వస్తున్న నేపథ్యంలో పలు జాతీయ, అంతర్జాతీయ జర్నలిస్టులు బాల్‌కోట్‌ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లారు. వారికి స్థానికులు, పాక్‌ సైనికులు 'బాంబులు వేసింది ఇక్కడే' అంటూ కొన్ని బాంబులు పడిన గుర్తులను చూపారు. బాంబు దాడిలో ఓ పౌరుడికి గాయం అయిన విషయం వెలుగులోకి వచ్చింది. కానీ అక్కడికి సమీపంలోనే ఉన్న ఉగ్రవాదుల శిక్షణా కేంద్రం మదర్సాను సందర్శించేందుకు మాత్రం పాక్‌ సైనికులు అనుమతించడం లేదు. దీంతో అంతర్జాతీయ మీడియా శాటిలైట్‌ చిత్రాలతో భారత్‌ దాడులు గురి తప్పాయంటూ పలు కథనాలు ప్రచురించాయి.

అయితే ఉగ్ర దాడిలో ఉగ్రవాదులకు అపార నష్టం జరిగిందని రుజువు చేయడానికి ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ వద్ద రాడార్‌ చిత్రాలు, ఇండియన్‌ ఆర్మీ వద్ద శాటిలైట్‌ చిత్రాలు ఉన్నాయంటూ కొన్ని జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి. దీనిపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వం రానున్న ఎన్నికల కోసమే అబద్దపు ప్రచారం చేస్తుందంటూ మండిపడుతున్నాయి. కనుక భారత ప్రభుత్వం వెంటనే ఆ రాడార్‌, శాటిలైట్‌ చిత్రాలు విడుదల చేస్తే అనేక సందేహాలకు తెరపడుతుందన్నది ప్రముఖుల వాదన.

Show Full Article
Print Article
Next Story
More Stories