శిఖా చౌదరికి త్వరలోనే నోటీసులు

శిఖా చౌదరికి త్వరలోనే నోటీసులు
x
Highlights

చిగురుపాటి జయరాం హత్య కేసు విచారణను తెలంగాణ పోలీసులు ముమ్మరం చేశారు. జయరాం భార్య చిరుగుపాటి పద్మశ్రీ లేవనెత్తిన అనుమానాలతో పాటు కేసును మొదటి నుంచి...

చిగురుపాటి జయరాం హత్య కేసు విచారణను తెలంగాణ పోలీసులు ముమ్మరం చేశారు. జయరాం భార్య చిరుగుపాటి పద్మశ్రీ లేవనెత్తిన అనుమానాలతో పాటు కేసును మొదటి నుంచి విచారిస్తున్నారు. ఏపీ పోలీసులు ఇచ్చిన ఆధారాలతో పాటు కేసులో అత్యంత కీలకంగా భావిస్తున్న సీసీ పుటేజీ, కాల్ లిస్ట్‌లపై పోలీసులు దృష్టి సారించారు. ఈ వ్యవహారంలో జయరాం భార్య పద్మశ్రీ స్టేట్‌మెంట్‌ను తెలంగాణ పోలీసులు మరోసారి రికార్డ్ చేశారు.

రోజుకో మలుపు తిరుగుతున్న ఎన్నారై, కోస్టల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ చిగురుపాటి జయరాం హత్య కేసు మూలాలను చేధించేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధమయ్యారు. కేసులో ఆర్ధిక వ్యవహారాలతో పాటు మరిన్ని కోణాలు ఉన్నాయని భావిస్తున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. జయరామ్‌ మామయ్య గుత్తా పిచ్చయ్య ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్‌ 419, 342, 346, 348, 302, 201, రెడ్‌విత్‌ 34 కింద కేసు నమోదు చేశారు. దీంతో పాటు రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా నందిగామ పోలీసుల నుంచి అందుకున్న ఆధారాలతో పలు సెక్షన్ల కింద 8 కేసులు నమోదు చేశారు. విచారణలో భాగంగా బంజారాహిల్స్‌ ఏసీపీ శ్రీనివాసరావు శుక్రవారం జయరాం భార్య పద్మశ్రీ వాంగ్మూలం తీసుకున్నారు. తన భర్త హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర ఉందని ఆమె మరోసారి చెప్పినట్టు సమాచారం. అనంతరం జయరాం ఇంట్లో పనివారిని కూడా ప్రశ్నించారు. జయరాం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఉన్న వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు.

జయరాం మృతదేహం లభించినప్పటి నుంచి హంతకుడు రాకేష్‌రెడ్డిని అరెస్ట్‌ వరకు జరిగిన పరిణామాలను, కేస్‌ డైరీగా రూపొందించిన పత్రాలు, సీడీలను దర్యాప్తు బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ కేసులో మృతుడు జయరాంతో పాటు నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డి, అనుమానితురాలు శిఖా చౌదరి కాల్ లిస్ట్‌లను పరిశీలించాలని నిర్ణయించారు. వీటిని బట్టి ఆయా ప్రాంతాల్లోని సీసీ పుటేజీని పరిశీలిస్తే కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరో వైపు ఈ కేసు విచారణలో భాగంగా శిఖా చౌదరికి త్వరలోనే నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. హత్యకు ముందు తనను చిగురుపాటి జయరాం కోటి రూపాయలు అడిగినట్టు చెప్పడం హత్య అనంతరం జయరాం నివాసానికి వెళ్లినట్టు ఆధారాలు లభించడంపై పోలీసులు ఆరా తీయనున్నారు. ఇదే వ్యవహారంలో రాకేష్‌ రెడ్డి, శ్రీనివాసరెడ్డిలతో పాటు ఇంకెవరైనా ఉన్నారా ? నిందితులకు సహకరించిన వారు ఎవరు ? ఎలా సహకరించారు ? ఎందుకు సహకరించారు ? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి, మరో నిందితుడు శ్రీనివాస్‌లను తమకు అప్పగించాలని జూబ్లీహిల్స్ పోలీసులు పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో ఈ రోజు ఇద్దరు నిందితులను హైదరాబాద్ తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో హాజరుపర్చే అవకాశాలున్నాయి. అనంతరం నిందితులిద్దరితో క్రైమ్ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయాలని భావిస్తున్నారు. కేసు విచారణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దర్యాప్తు బృందం ఏఒక్క ఆధారాన్ని వదులుకోకూడదని భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories