Top
logo

అడ్డదారులు తొక్కుతున్న పార్టీలు..భారీగా పట్టుబడుతున్న నోట్ల కట్టలు

అడ్డదారులు తొక్కుతున్న పార్టీలు..భారీగా పట్టుబడుతున్న నోట్ల కట్టలు
Highlights

ప్రచారం మరికొన్ని గంటల్లో ముగుస్తుండటంతో ఓట్ల కోసం పార్టీలు భారీ ప్రలోభాలకు దిగుతున్నాయి. చివరి నిమిషం వరకు...

ప్రచారం మరికొన్ని గంటల్లో ముగుస్తుండటంతో ఓట్ల కోసం పార్టీలు భారీ ప్రలోభాలకు దిగుతున్నాయి. చివరి నిమిషం వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి. ఎలాగైనా గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. వేలకు వేలు పంచుతూ.. ఓట్లను కొనేందుకు పావులు కదుపుతున్నాయి. దీంతో తనిఖీల్లో రోజుకో చోట ఏకంగా కోట్లకు కోట్లే పట్టుబడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో 8 కోట్ల నగదు పట్టుబడటం సంచలనం రేపుతోంది. పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయ్యింది. మరికొన్ని గంటల్లోనే ఓటర్లు నేతల తలరాతలు రాయబోతున్నారు. ఈ సమయంలో ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకునేందుకు పార్టీలన్నీ అడ్డదారులు తొక్కుతున్నాయి. నగదును పంచేందుకు కోట్లకు కోట్లు తరలిస్తున్నాయి. మరోవైపు పోలీసులు కూడా తనిఖీలు ముమ్మరం చేయడంతో భారీగా నగదు పట్టుబడుతోంది.

గత శని, ఆదివారాల్లోనే హైదరాబాద్‌లో సుమారు 5 కోట్ల వరకు నగదు పట్టుబడగా.. సోమవారం ఒక్కరోజే నారాయణగూడలో కారులో తరలిస్తున్న 8 కోట్ల నగదు పట్టబడింది. నారాయణగూడ ఫ్లై ఓవర్‌పై సెంట్రల్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీల్లో ఈ మొత్తం పట్టుబడింది. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు నుంచి డ్రా చేసి తీసుకొస్తున్నామని పట్టుబడ్డ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. అయితే ఈ డబ్బంతా ఓ జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడిదని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ అవసరాల కోసమే డబ్బును తరలిస్తున్నట్లు సదరు పార్టీ శ్రేణులు కూడా చెబుతున్నాయి. కానీ ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం సంచలనంగా మారింది. మరోవైపు పోలీసులు, ప్రత్యేక బృందాలు నగరంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టాయి. ముఖ్యంగా నగదు రవాణా అధికంగా జరుగుతుండటంతో ఎక్కడికక్కడ సోదాలు చేపడుతున్నాయి. దీంతో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి.

Next Story