పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఎన్నికల వ్యయం

పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఎన్నికల వ్యయం
x
Highlights

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మూడేళ్ల పదవీ కాలం కోసం పెద్దఎత్తున ఖర్చు చేయాల్సి ఉండటంతో...

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మూడేళ్ల పదవీ కాలం కోసం పెద్దఎత్తున ఖర్చు చేయాల్సి ఉండటంతో అభ్యర్ధులు తలలు పట్టుకుంటున్నారు. ఖర్చుకు సిద్ధపడే బరిలోకి దిగినా, అది ఎంతనే దానిపై అభ్యర్ధులు అంచనాకి రాలేకపోతున్నారు. మరోవైపు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఓటర్లయిన స్థానిక ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారు. దాంతో పేరుకు ఎమ్మెల్సీ ఎన్నికలే అయినా, ఎమ్మెల్యే ఎన్నికల కంటే కాస్ట్లీగా మారాయి.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీలను తెగ భయపెడుతున్నాయి. విపక్షాలనే కాదు అధికార పార్టీని సైతం ఇబ్బంది పెడుతున్నాయి. మూడేళ్లు మాత్రమే పదవీ కాలముండే ఈ ఎమ్మెల్సీ పదవి కోసం పెద్దఎత్తున వ్యయ ప్రయాసలు పడాల్సి రావడం అభ్యర్ధులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మేనేజ్‌ చేయాల్సి ఉండటంతో అటు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఇటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ రెండూ కూడా భారీ వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి.

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్‌ అఫీషియో సభ‌్యులకు ఓటు హక్కు ఉంటుంది. ఎక్కువగా ఎంపీటీసీలే ఓటర్లుగా ఉంటారు. పైగా వీళ్లందరికీ జులై 7తో పదవీకాలం ముగుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయడానికి ఇదే చివరి ఛాన్స్‌. దాంతో అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటున్నారు. దాంతో వీళ్లందరినీ మేనేజ్ చేయాలంటే పెద్దఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుందని, అవసరమైతే క్యాంపులు కూడా నడపాల్సి ఉంటుందని అభ్యర్ధులు భయపడుతున్నారు.

ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించిన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ కూడా ఆర్ధికంగా బలమున్న బిగ్‌ షాట్స్‌నే బరిలోకి దింపాయి. అయితే గెలుపు కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా, ఎన్నికల ఖర్చు విషయంలో మాత్రం ఆయా అభ్యర్ధులు అంచనాకి రాలేకపోతున్నారని తెలుస్తోంది. ఏదేమైనా ఎన్నికల వ్యయం అటు అధికార పార్టీని, ఇటు ప్రధాన ప్రతిపక్షాన్ని ముచ్చెమటలు పట్టిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories