తూర్పులో పోటెత్తిన మహిళా ఓటు ఎవరికి చేటు..ఎవరికి స్వీటు?

తూర్పులో పోటెత్తిన మహిళా ఓటు ఎవరికి చేటు..ఎవరికి స్వీటు?
x
Highlights

మహిళలు డిసైడయ్యారంటే, వార్‌ వన్‌ సైడే. ఒక్కసారి నమ్మారంటే, తిరుగులేని తీర్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి మహిళలు భారీ ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు....

మహిళలు డిసైడయ్యారంటే, వార్‌ వన్‌ సైడే. ఒక్కసారి నమ్మారంటే, తిరుగులేని తీర్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి మహిళలు భారీ ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. తమ పాలకుడెవరో ఓటేశారు. ఈవీఎంలలో తమ నిర్ణయాన్ని భద్రపరిచారు. అయితే, అత్యధిక నియోజకవర్గాలుండే, తూర్పు గోదావరిలోనూ మహిళలలు పెద్ద ఎత్తున ఓట్ల వర్షం కురిపించారు. అసలు తూర్పులో ఏ పార్టీకయితే సీట్లు ఎక్కువొస్తాయో, వారిదే సింహాసనం అని సెంటిమెంట్‌ ఉంది. మరి తూర్పులో ఓట్లు కురిపించిన మహిళాలోకం, ఎవరికి పట్టంకట్టిందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. వార్డులవారీగా వివరాలు తెప్పించుకంటూ, పార్టీలు లెక్కలేస్తున్నాయి.

తూర్పు గోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం 42 లక్షల 4వేల 436 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళలు 21 లక్షల 23 వేల 332 మంది. అంటే పురుషులకంటే మహిళల సంఖ్య 42 వేల 581 అధికం. ఈ అత్యధిక ఓట్లే ఎవరి కొంప ముంచుతాయోనని అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.

మొత్తం ఓట్లలో 33 లక్షల 63 వేల 352 ఓట్లు పోలవ్వగా, 80శాతంగా ఓట్ల పోలింగ్ జరిగింది. అయితే ఇందులో 16లక్షల 69వేల 578 మహిళా ఓటర్లు తమ ఓటు వినియోగించుకోగా, పురుషులు 16లక్షల 93వేల 702 మంది ఓటేశారు. దాదాపు 16 అసెంబ్లీ నియోజకర్గాలలో పురుషులు- మహిళలు సమానంగానో, కాస్త అటో ఇటో పోలింగ్‌లో పాల్గొంటే, రాజమండ్రి సిటీ, కాకినాడ సిటీ, రాజమండ్రి నగరంలో కొంతభాగంతో కలిసివున్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలలో మహిళల ఓటు బ్యాంకు పురుషులకంటే, వేల సంఖ్యలో అధికంగా పోలైంది. దీంతో ప్రధాన రాజకీయ పక్షాలనేతలతో పాటు, పోటీలోని అభ్యర్ధులు అధికంగా ఓటేసిన మహిళలు, ఎవరికి వేసివుంటారోనని తలపట్టుకుని లెక్కలేసుకుంటున్నారు. ఓటింగ్ సరళిని బట్టి వార్డుల వారీగా తమ బలాబలాలను బేరీజు వేసుకుంటున్నారు.

సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో మహిళా ఓట్ల పోలింగ్ శాతం పెరగడం సహజం. అలాంటిది ఇపుడు నగర నియోజకవర్గాలలో మహిళల పోలింగ్ శాతం పెరగడం, ప్రధానంగా తెలుగుదేశం- వైసీపీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమకు అనుకూలంగానే మహిళలు ఓట్లు వేశారని తెలుగుదేశం అంచనాలు వేసుకుంటుంటే, జగన్ కోసం మహిళలు ముందుకొచ్చి ఓట్లు వేశారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మధ్యలో జనసేన మహిళా ఓట్లు తమకే పడ్డాయని లెక్కలేసుకుంటోంది.

రాజమండ్రి సిటీలో మొత్తం 2లక్షల 53వేల 87 ఓట్లలో, లక్షా 67 వేల897 ఓట్లు పోలయ్యాయి. అంటే 66.34 శాతం నమోదైంది. మొత్తం ఓట్లలో మహిళా ఓట్లు కూడా పురుషులకంటే 8,444 అధికంగా వున్నాయి. జిల్లా సరాసరి ఓట్ల శాతం 80 అయితే దాదాపుగా 14 శాతం వరకూ నగరాలలో మైనస్ అయింది. రాజమండ్రి సిటీలో పోలైన ఓట్లలో 81వేల418 పురుషుల ఓట్లు కాగా, 86వేల 474 మహిళా ఓటర్లుగా తేలాయి. అంటే దాదాపుగా పురుషులకంటే మహిళలు అధికంగా 5వేల 56 మంది ఓటేశారు. దీంతో ఈ మహిళా ఓట్ల సంఖ్య ఎవరికి మేలు చేస్తుందో ఎవరికి కీడు చేస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అలాగే కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలించినట్లయితే, మొత్తం ఓట్లు 2లక్షల 55 వేల 716 కాగా , లక్షా69 వేల 754 ఓట్లు పోలింగ్ జరిగి, 66.38శాతంగా పోలింగ్ నమోదయ్యింది. కాకినాడ సిటీలో కూడా మహిళా ఓటర్లు పురుషులకంటే 8వేల 444 మంది అధికంగా వున్నారు. పోలింగ్‌లో పురుషులకంటే 4వేల 797 మహిళా ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. అదే తరహాలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం, రాజమండ్రి నగరంలో అంతర్భాగంగా వుంటుంది. ఈ నియోజకవర్గంలో కూడా పోలింగ్ శాతం 73గా నమోదయ్యింది. అయితే ఇక్కడ కూడా అధికంగా 2,531 మంది మహిళా ఓటర్లు ఓటేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2 లక్షల 54వేల339 ఓట్లు కాగా, మహిళల ఓట్లు లక్షా 29వేల 650. అంటే పురుషులకంటే ఐదు వేల వరకూ అధికంగా మహిళా ఓటర్లు ఈ నియోజకవర్గంలో వున్నారు.

ఇలాంటి పరిణామాల్లో ఈ మూడు నియోజకవర్గాలలో నేతల తలరాతలను మార్చేది మహిళా ఓటర్లేనని, ఎక్కువగా పడిన మహిళా ఓటర్లు ఎవరి పక్షాన మొగ్గుచూపారోనని, అంచనాల మీద అంచనాలు వేసుకుంటున్నారు అభ్యర్ధులు. మహిళా ఓటర్లు ఏపార్టీకి మొగ్గుచూపితే అదే పార్టీ విజయం సాధిస్తుందని బేరీజు వేసుకుంటున్నారు. డ్వాక్రా రుణాలు, పసుపు కుంకుమ, పెన్షన్లు వంటి సంక్షేమ పథకాల వల్లే మహిళలు ఎక్కువగా వచ్చి ఓట్లు వేశారని తెలుగుదేశం నాయకులు భావిస్తుంటే, జగన్‌ను సీఎంను చేయాలనే మహిళలు వచ్చి ఓట్లు వేశారని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద తూర్పు గోదావరి జిల్లాలో ఈ మూడు నియోజకవర్గాలలో ఆసక్తికర చర్చనడుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories