జనసేనకు తూర్పులో వచ్చే ఓట్లెన్నీ, సీట్లెన్ని?

జనసేనకు తూర్పులో వచ్చే ఓట్లెన్నీ, సీట్లెన్ని?
x
Highlights

జనసేనకు తూర్పులో వచ్చే ఓట్లెన్నీ, సీట్లెన్ని. ఇప్పుడు ఇదే లెక్కల్లో మునిగితేలుతున్నాయి పార్టీలు. బెట్టింగ్ బంగార్రాజులు కూడా, దీనిపైనే ఎక్కువ ఫోకస్...

జనసేనకు తూర్పులో వచ్చే ఓట్లెన్నీ, సీట్లెన్ని. ఇప్పుడు ఇదే లెక్కల్లో మునిగితేలుతున్నాయి పార్టీలు. బెట్టింగ్ బంగార్రాజులు కూడా, దీనిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అయితే, 2009లో ప్రజారాజ్యం సాధించిన సీట్లు, ఇప్పుడు జనసేన సాధించబోయే సీట్లతో కంపారిజన్‌‌ అనాలిసిస్‌కు పదునుపెడుతున్నారు విశ్లేషకులు. అంతేకాదు, నాడు ప్రజారాజ్యంతో కాంగ్రెస్‌కే లాభం జరిగిందని, ఇప్పుడు మాత్రం జనసేన ఎఫెక్ట్‌ ఏ పార్టీ మీద పడుతుందో అర్థంకావడం లేదని తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ జనసేన చీల్చే ఓట్లు, ఏ పార్టీకి చిల్లులు పెడతాయి?

2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ప్రభంజనం తప్పదని చాలామంది ఊహించారు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. కానీ జిల్లాలో కేవలం నాలుగు అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుచుకుని ఉసూరుమనిపించింది ప్రజారాజ్యం. అదే తరహాలో అవిర్భవించిన జనసేన పార్టీ, ఆ నాలుగు సీట్లయినా గెలవగలదా అన్న అనుమానానాలను సొంత పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు.

జనసేన సీట్లు పెద్దగా గెలవకపోయినా, భారీగా ఓట్లు చీల్చే ప్రమాదం పొంచివుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అనేక సర్వేలలో జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే జనసేనకు వస్తాయన్న ఫలితాలొచ్చాయి. మరికొన్ని సర్వేల్లో జనసేనకు అసలు సీట్లు రావని లెక్కలేశారు. అయితే నాలుగు సీట్లలో తమకు అనుకూమైన పరిస్థితున్నాయని జనసేన అంచనా వేసుకుంటోంది. జనసేన ఓట్ల చీలిక ఎంతవరకూ దారితీస్తుందో అర్థంకాక ప్రధాన రాజకీయపక్షాలు తలపట్టుకునికూర్చున్నాయి.

జనసేన అభ్యర్ధులు రాజోలు, పి.గన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల‌్, కాకినాడ రూరల‌్, రామచంద్రాపురం, మండపేట, పిఠాపురం, పెద్దాపురం వంటి అసెంబ్లీ స్థానాల్లో గట్టిపోటీనిచ్చారు. మరికొన్ని చోట్ల అత్యధికంగా ఓట్లు చీల్చుకున్నారనే లెక్కలు, సర్వేల ద్వారా వేస్తున్నారు. ఈ నియోజకవర్గాలలో జనసేన గెలిచే సీట్లెన్ని....చీల్చుకునే ఓట్లెన్ని కోణంలో అంచనాలు కడుతున్నారు. నవరత్నాలు మీద వైసీపీ ఆశలు పెంచుకుంటే, పసుపుకుంకుమ, డ్వాక్రా రుణాలు, రైతులకు పెట్టుబడి భరోసా, పెన్షన్లపై తెలుగుదేశం ఆధారపడింది. పోలింగ్‌కు ముందుగా ఎవరి వ్యూహాలు వారు అమలు చేసుకున్నా.. ధైర్యంగా గెలుపుదీమాలేని పరిస్థితి ప్రధాన పక్షాల అభ్యర్థులది.

2009లో ప్రజారాజ్యం పోటీచేసినపుడు త్రిముఖ పోటీ జరిగింది. అపుడు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను బేరీజు వేసుకుని వాటికంటే జనసేనకు తగ్గుతాయనే అటు వైసీపీ, ఇటు తెలుగుదేశంలు అంచనాలు వేస్తన్నాయి. దీంతో తమకే మెజారిటీ స్థానాలు వస్తున్నాయని లెక్కలేస్తున్నాయి. 2014లో తెలుగుదేశంతో కలిసి జనసేన వున్నందున, జనసేన వల్ల ఇపుడు తెలుగుదేశానికే ఎక్కవ నష్టమని, ఆపార్టీకి చెందిన ఓట్లనే ఎక్కవగా చీల్చిందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ఈ వాదనను తెలుగుదేశం తిప్పికొడుతోంది.

ప్రభుత్వంపై వున్న వ్యతిరేక ఓటు ఏమైనా వుంటే అది, కొత్తగా వచ్చిన ఓటు బ్యాంకు, గత ఎన్నికల్లో వైసీపీకి పడిన కొంతశాతం ఓట్లు జనసేనకు వెళతాయని, దానివల్ల తెలుగుదేశానికి పెద్దగా నష్టం లేదంటోంది టీడీపీ. నిశ్శబ్దంగా జనసేనకు ఓటుబ్యాంకు పడిందని కూడా అంచనా వేస్తోంది. ఏది ఏమైనా ప్రధాన రాజకీయపక్షాల నాయకుల వెన్నులో జనసేన వణికిపుట్టిస్తోంది. అమలాపురం, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాల్లో, జనసేన ఎంపీ అభ్యర్థులకు క్రాస్‌ ఓటింగ్‌ బాగా జరిగిందనే ప్రచారం జరుగుతోంది. దీనివల్ల ఎవరి పుట్టి మునుగుతుందోనన్న ఆందోళన అభ్యర్థులలో నెలకొంది.


Show Full Article
Print Article
Next Story
More Stories