అభినందన్‌ను విడుదల చేయడం వెనక అసలు కారణాలు ఏంటి ?

అభినందన్‌ను విడుదల చేయడం వెనక అసలు కారణాలు ఏంటి ?
x
Highlights

భారత ప్రభుత్వ ద్విముఖ వ్యూహంతోనే పాక్‌ దారికి వచ్చిందా ? తన చేతిలో బందీగా ఉన్న అభినందన్‌ను విడుదల చేయడం వెనక అసలు కారణాలు ఏంటి ? అంతర్జాతీయ సమాజం...

భారత ప్రభుత్వ ద్విముఖ వ్యూహంతోనే పాక్‌ దారికి వచ్చిందా ? తన చేతిలో బందీగా ఉన్న అభినందన్‌ను విడుదల చేయడం వెనక అసలు కారణాలు ఏంటి ? అంతర్జాతీయ సమాజం నుంచి పాకిస్ధాన్‌ మద్ధతు లభించకపోవడం వెనక అసలు వ్యూహమేంటి ? భారత్‌ను ద్వేషించడమే లక్ష్యంగా పనిచేసే పాకిస్ధాన్ ప్రభుత్వం ఎందుకు వెనక్కు తగ్గింది. తన చెరలోని భారతీయ పైలెట్‌ను అప్పగించాలని రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకోవడం వెనక జరిగిందేంటి ?

తూటాల చప్పుళ్లే తప్ప శాంతి ప్రవచనాలకు వినేందుకు ఏనాడు ఇష్టపడిన దాయాది దేశం ఒక్కసారిగా శాంతి వచనాలు వల్లిస్తోంది. భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రపంచ దేశాలకు వినబడేలా గొంతు చించుకుంటోంది. మా చిత్తశుద్ధిని శంకించవద్దంటూ అగ్రరాజ్యాలను వేడుకుంటోంది. కావాలంటే చూడండంటూ బందీగా ఉన్న భారతీయ పైలెట్‌ను స్వదేశానికి అప్పగిస్తున్నామంటూ పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటనలు చేస్తోంది.

భారత పైలెట్‌ అభినందన్‌ విడుదలలో భారత ప్రభుత్వ రాజనీతి వ్యూహం ఉందంటున్నారు నిపుణులు. పాక్‌ చేతిలో భారత్‌కు చెందిన పైలెట్‌ అభినందన్ బందీగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ఈ విషయంలో తాము ఎలాంటి చర్చలు జరపబోమంటూ తేల్చి చెప్పిన విదేశాంగ శాఖ జెనీవా ఒప్పందాన్ని బయటకు తీసి నియమ నిబంధనల ప్రకారం తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేసింది. పాకిస్ధాన్ డిప్యూటి హైకమిషనర్‌గా ఉన్న సయ్యద్ హైదర్‌ను పిలిచి ఇదే విషయాన్ని తెలియజేస్తూ దేశ భద్రతలో కఠిన, నిర్ణయాత్మక చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమంటూ కఠిన స్వరంతోనే హెచ్చరించింది.

ఓ వైపు భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుండగానే ఉగ్రవాద నిర్మూలనలో చిత్తశుద్ధి చాటుకోవాలంటూ ప్రపంచదేశాలు సూచించడం పాకిస్ధాన్‌కు ఏమాత్రం మింగుడు పడలేదు. తప్పనిసరి పరిస్ధితుల్లో అభినందన్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ప్రకటించారు. ఇక ఉగ్రవాదులకు ఆర్ధిక సాయం అందించే దేశాలపై నిఘా వేసే ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్‌ ఫోర్స్‌ ఇప్పటికే పాకిస్ధాన్‌ను గ్రే లిస్టులో చేర్చింది. ఇలాంటి సమయంలో పట్టుబడిన యుద్ధ ఖైదీలపై చర్యలు తీసుకుంటే అది బ్లాక్ లిస్ట్‌లో పెట్టే వరకు వెళ్లే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే పాక్‌కు అంతర్జాతీయంగా తీవ్ర ప్రతికూలత ఎదురవుతుంది. ఇప్పటికే ఆర్ధిక వ్యవస్ధ చిందరవందరగా మారి పొదుపు మంత్రం జపిస్తున్న వేళ విదేశీ నిధులు రాకపోతే ఆర్ధికంగా దివాళ తీసే పరిస్ధితి. ఇలాంటి సమయంలో ఒక అడుగు వెనక్కు వేయడమే మంచిదని పాకిస్ధాన్ భావించిందని విదేశీ నిపుణులు విశ్లేషిస్తున్నారు

ఆపద సమయంలో ఆదుకుంటుందని భావించిన చైనా కూడా పాకిస్ధాన్‌కు బహిరంగంగా మద్ధతివ్వకపోవడం భారత దేశ దౌత్య విజయంగా విదేశాంగ శాఖ నిపుణులు చెబుతున్నారు. అమెరికా, రష్యా వంటి అగ్ర రాజ్యాలు భారత్‌కు బహిరంగంగానే మద‌్ధతు పలకడం పాకిస్ధాన్‌కు వార్నింగ్‌ ఇవ్వడం భారతీయ దౌత్య నీతికి అద్దం పడుతున్నాయి. ఇదే ఇప్పుడు దేశానికి శ్రీరామ రక్షగా పాక్‌ పాలిట శాపంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories