వైసీపీ అధికారంలోకి వస్తే షర్మిల స్థానం ఏంటి...పార్టీలో కీలక పదవి అప్పగిస్తారా?

వైసీపీ అధికారంలోకి వస్తే షర్మిల స్థానం ఏంటి...పార్టీలో కీలక పదవి అప్పగిస్తారా?
x
Highlights

ఫలితాలకు ముందే, మంత్రివర్గ కూర్పుపై చర్చిస్తున్న వైసీపీలో, షర్మిలపై జోరుగా డిస్కషన్‌ జరుగుతోంది. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే ఆమెకు ఎలాంటి పదవి...

ఫలితాలకు ముందే, మంత్రివర్గ కూర్పుపై చర్చిస్తున్న వైసీపీలో, షర్మిలపై జోరుగా డిస్కషన్‌ జరుగుతోంది. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే ఆమెకు ఎలాంటి పదవి కట్బబెడతారు రాజ్యసభ ఇచ్చి పార్లమెంట్‌కు పంపుతారా లేదంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కీలక పదవి అప్పగిస్తారా అని, చర్చ జరుగుతోంది. ఇంతకీ షర్మిల ప్రస్థానమెటు?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను ఈసారి అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష వైసీపీకి చావోరేవో తేల్చుకోవాల్సిన ఎన్నికలు కావడంతో, జగన్ కుటుంబం మొత్తం ఎన్నికల ప్రచారంలో పాల్గొంది.

మొదటి నుంచి జగన్‌కి అండగా ఉంటున్న షర్మిల, ఈ ఎన్నికల్లోను పార్టీ తరుపున విస్తృతంగా ప్రచారం చేశారు. 2014 ఎన్నికల ముందు జగన్ జైలుకి వెళ్లడంతో, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ గెలుపు కోసం రెండు వేల ఐదు వందల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. ఇక ఈ ఎన్నికల్లోనూ షర్మిల చేసిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. బైబై బాబు అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతవరకు బాగానే ఉన్నా, అసలు వైసీపీ అధికారంలోకి వస్తే షర్మిల స్థానం ఏంటి సోదరి కష్టాన్ని జగన్ గుర్తిస్తారా అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో ఉన్నా, తమ కుటుంబ సభ్యులకు రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తున్నాయి. తెలంగాణాలో కేసీఆర్ సీఎంగా ఉండగా, ఆయన తనయుడు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. కేసీఆర్ కుమార్తె కవిత ఎంపీ. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఆయన తనయుడు లోకేష్ రాష్ట్ర మంత్రి అయ్యారు. జగన్ కుటుంబం నుంచి సోదరుడు అవినాష్ కడప ఎంపీ, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే అయ్యారు. వాళ్లిద్దరూ ప్రస్తుతం ఎన్నికల బరిలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే షర్మిలకు ఇంత వరకూ పార్టీలో ఎలాంటి పదవీ ఇవ్వలేదు జగన్.

ఈ ఎన్నికల తరువాతైనా పార్టీ గెలుపోటములకు సంబంధం లేకుండా పదవులు ఇస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చి, జగన్ సీఎం అయితే, కుటుంబ సభ్యులకు ఎక్కువ పదవులు ఇచ్చారన్న అపవాదు రాకుండా ఉండేందుకు షర్మిలకు ప్రభుత్వ పదవులకు దూరంగా ఉంచే అవకాశం ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. జగన్ సీఎం అయితే పార్టీ, ప్రభుత్వ బాధ్యతల నిర్వహణ కష్టం అవుతుందని, అప్పుడు పార్టీలో కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో కేసీఆర్ సీఎం అయ్యాక పార్టీ బాధ్యతలు కేటీఆర్‌కి, చంద్రబాబు, రాష్ట్ర పార్టీ బాధ్యతలు కళా వెంకటరావుకి ఇచ్చారు. జగన్ కూడా అదే ఫార్ములా పాటిస్తే షర్మిలకి పార్టీ పదవి ఖాయం అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఒకవేళ జగన్ మళ్ళీ ప్రతిపక్షానికి పరిమితం అయితే మాత్రం, షర్మిల మరో ఐదేళ్లు రాజకీయాలకు దూరం కావాలిసిందే అనే అభిప్రాయం వ్యక్తంమవుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories