శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మిక్కిలి టెన్షన్‌...దడ పుట్టిస్తున్న టెక్కలి ఓట్ల లెక్కలు

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మిక్కిలి టెన్షన్‌...దడ పుట్టిస్తున్న టెక్కలి ఓట్ల లెక్కలు
x
Highlights

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో, ఓట్ల లెక్కలు మిక్కిలి టెన్షన్‌ పెట్టేస్తున్నాయి. ఒకవైపు మంత్రి పోటీ మరోవైపు వైసీపీ నుంచి గట్టి అభ్యర్థి పోటీ. వార్‌ వన్‌...

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో, ఓట్ల లెక్కలు మిక్కిలి టెన్షన్‌ పెట్టేస్తున్నాయి. ఒకవైపు మంత్రి పోటీ మరోవైపు వైసీపీ నుంచి గట్టి అభ్యర్థి పోటీ. వార్‌ వన్‌ సైడ్‌ అనుకున్నారు అంతా. కానీ పోలింగ్ ముగిశాక, గట్టిపోటీ అన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ టెక్కలిలో టెన్షన్‌ రేపుతున్న ఓట్ల లెక్కలేంటి మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడమే ఇద్దరిలోనూ ఆందోళనకు కారణమవుతోందా పసుపు కుంకుమే వారిని పోలింగ్‌ బూత్‌కు రప్పించిందా లేదంటే వైసీపీ ఇచ్చిన హామీలతోనే మహిళలు ఓటింగ్‌కు క్యూకట్టారా టెక్కలిలో ఈ లెక్కల చిక్కులు విప్పేదెలా?

శ్రీకాకుళం జిల్లాలోని పది నియోజకవర్గాలలో టెక్కలి పైనే ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. మొత్తం 2 లక్షల 22 వేల 222 మంది ఓటర్లు కలిగిన ఈ నియోజకవర్గంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లక్షా 75 వేల 92 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ఆలస్యం అయి అర్ధరాత్రి వరకు పోలింగ్ నమోదు అయినా ఏ మాత్రం సహనం కోల్పోకుండా అక్కడే పడిగాపులు పడి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎన్నికల రోజున 85 వేల 532 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 89 వేల 559 మంది మహిళలు ఓటేశారు గత రెండు ఎన్నికల పోలింగ్ సరళిని పోల్చితే ఈసారి మహిళలదే పై చేయిగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇదే అంశం నియోజకవర్గం సహా జిల్లాలో గెలుపు ఎవరిని వరిస్తుంది అనేదానిపై చర్చనీయాంశంగా మారింది. బారులు తీరిన ఓటర్లు ఎవరిపై అభిమానంతో లేదంటే ఎవరిపై కోపంతో ఓటేశారన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.

ఈసారి మహిళల ఓటింగ్ శాతం పెరగడంపై కొత్త చర్చ మొదలయ్యింది. రాజకీయ పార్టీలన్నీ ఎవరికీ వారు తమ ఖాతాలో పడే ఓట్ల పై అంచనాలు వేసుకుంటున్నారు. టెక్కలిలో ఓటేసిన వారిలో పురుషుల కన్నా మహిళలే ఎకువగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోనే మూడవ స్థానంలో నిలుస్తూ పురుషుల కంటే 4 వేల 27 మంది మహిళలు ఎక్కువగా ఓట్లు వేశారు.

ఇక పోతే టీడీపీ, వైసీపీలు ఎవరికీ వారు తాము అధికారంలోకి రావడం ఖాయమనే లెక్కలు వేసుకుంటున్నాయి. ముఖ్యంగా గడిచిన ఐదేళ్ళు గా నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి, ఇటీవల ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ, వృద్దాప్య పెన్షన్, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్ పథకాలపై ఆదరణ లభించడం వల్లనే పెద్ద సంఖ్యలో మహిళలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమకు ఓటేశారని టీడీపీ అభ్యర్ధి అచ్చెన్నాయుడు బేరీజు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పెరిగిన ఓటింగ్ శాతంతో టెక్కలిలో మరోసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయమనే దీమాతో ఉన్నారాయన.

అయితే వైసీపీ అభ్యర్ధి పెరాడ తిలక్‌ది కూడా కాన్ఫిడెన్స్. పార్టీ అధినేత కురిపించిన వరాల జల్లు, ప్రచారం సమయంలో జగన్ ఈ నియోజకవర్గంపై ప్రత్యెక దృష్టి సారించి మరీ ప్రచారం చేయడం, ఆ సమయంలో అందరికీ మరోమారు అండగా ఉంటానన్న భరోసా ఇవ్వడంతో పాటు, మేనిఫెస్టో, ముఖ్యంగా నవరత్నాలు, అధికారంలోకి వస్తే మహిళలకు అన్నివిధాలా అండగా ఉంటామన్న హామీతో పాటు జగన్ చరిష్మా పనిచేయడం వల్లనే పెద్దఎత్తున మహిళలు పోలింగ్ నాడు పోలింగ్ బూత్‌లకు వచ్చి క్యూ లైన్లలో గంటల కొద్దీ నిలబడి ఓట్లు వేశారని, ఆ ఓట్లన్నీ తమ పార్టీకి పడ్డాయనే దీమాతో ఉన్నారు వైసీపీ నాయకులు.

ఇదిలావుంటే, టెక్కలిలో విజయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలనే వైసీపీ ప్రత్యెక దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన అచ్చెన్నాయుడుని ఓడించేందుకు ఎన్నికల్లో వ్యూహాలు రచించుకొని మరీ, పార్టీ నాయకులు చేసిన కృషితో గెలుపు తమ వశం అనే నమ్మకం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అందుకోసమే ఎన్నికల హామీలు, అధికార పార్టీపై వ్యతిరేకతని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం కోసం ముఖ్యంగా ఎన్నికలకి స్వల్ప వ్యవధి ముందే పార్టీలో చేరిన కిళ్లి కృపారాణి, సామాజిక వర్గ బలం ఒకవైపు ఉంటే నియోజకవర్గ అభ్యర్ధి తిలక్‌తో పాటు పార్లమెంట్ అభ్యర్ధి దువ్వాడ శ్రీను ముగ్గురూ కలిసి నియోజకవర్గంలో గెలుపు కైవసం చేసుకోవాలనే దృక్పధంతో నిర్వహించిన ప్రచారం, ప్రజల్లో గట్టి నమ్మకం ఏర్పరిచిందని, ఈ తరుణంలో గెలుపు కచ్చితంగా తమదేననే దీమాతో ఉంది ఆ పార్టీ.

ఇకపోతే టీడీపీ అభ్యర్ధి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా అదే కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఐదేళ్ళ పాలనలో నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి, ముఖ్యంగా తన స్వగ్రామం నిమ్మాడతో పాటు, నియోజకవర్గ కేంద్రమైన టెక్కలిలో రోడ్ల విస్తీరణ, ముఖ్యంగా తిత్లీ సమయంలో ప్రభుత్వం చూపిన చొరవ, ఇటీవల అమలులోకి వచ్చిన సంక్షేమ పథకాల పట్ల ప్రజల నుంచి వస్తున్న స్పందన, లభించిన ఆదరణ తనకు విజయాన్ని అందిస్తాయనే నమ్మకంతో ఉన్నారు అచ్చెన్నాయుడు. మొత్తం మీద పోలింగ్ శాతం పెరిగినా, మహిళలు పోటెత్తి ఓటేసినా, కొంత సందిగ్దత మాత్రం పార్టీ నేతలను వెంటాడుతోంది. అయినప్పటికీ ఎవరికివారు మాత్రం, పైకి మేకబోతు గాంభీర్యంతో గెలుపు తమదంటే తమదనే దీమాతో ఉన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories