Top
logo

నేడే తొలి విడత పంచాయతీ ఎన్నికలు

నేడే తొలి విడత పంచాయతీ ఎన్నికలు
Highlights

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సోమవారం మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు.

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సోమవారం మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు. ప్రీసైడింగ్ అధికారి సమక్షంలో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు.

తెలంగాణలో ఇవాళ తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 3వేల 701 గ్రామాల్లో సర్పంచ్‌‌లు, 28వేల 976 వార్డు మెంబర్ల ఎన్నిక కోసం పోలింగ్‌ జరగనుంది. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్‌ నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి, సాయంత్రానికల్లా ఫలితాలు వెల్లడించనున్నారు. తొలుత వార్డు మెంబర్లు, ఆ తర్వాత సర్పంచ్‌ ఓట్లు లెక్కిస్తారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్, వార్డు మెంబర్లతో ప్రీసైడింగ్ అధికారి సమావేశం నిర్వహించి ఉప సర్పంచ్ ను ఎన్నుకుంటారు. చెయ్యి ఎత్తే పద్ధతిలో ఉపసర్పంచ్ ఎన్నిక జరుగనుంది. ఇక తొలి విడతలో సర్పంచ్ పదవులకు 12వేల 202మంది, వార్డు సభ్యుల కోసం 70వేల 94మంది పోటీపడుతున్నారు. ఇక మొదటి విడతలో 4వేల 479 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా, 769 సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. అలాగే ఫస్ట్ ఫేజ్‌లో 39వేల 822 వార్డులకు 10వేల 654 ఏకగ్రీవమయ్యాయి.

ఓటర్లకు పంపిణీ చేసిన స్లిప్‌ చూపిస్తే ఓటు వేయనిస్తారు. ఓటరు ఫొటో గుర్తింపు కార్డు, ఆధార్ కార్డుతో సహా 23 రకాల ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయవచ్చు. ఓటర్ల సంఖ్య ఆధారంగా ఇద్దరు లేదా ముగ్గురు పోలింగ్ అధికారులు విధులు నిర్వహిస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తారు. సున్నితమైన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలన చేస్తారు. దివ్యాంగ ఓటర్ల కోసం ప్రతి గ్రామ పంచాయతీలో ఒక వీల్ చైర్ ను అందుబాటులో ఉంచారు.

రాజకీయాలకు అతీతంగా, పార్టీల గుర్తులు లేకుండా, అభ్యర్థులు పేర్లు, ఫొటోలు కూడా బ్యాలెట్ పత్రంలో లేకుండా కేవలం గుర్తులపైనే జరుగుతున్న ఈ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. సర్పంచ్ పదవులకు పోటీ చేస్తున్న వారి పేర్లు తెలుగు అక్షరమాల క్రమం అనుసరించి జాబితా రూపొందించారు. ఇక ఈనెల 25న రెండో దశ, 30న మూడో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

Next Story


లైవ్ టీవి