గులాబీ పార్టీలో ప‌ద‌వుల భ‌ర్తీ షురూ

KCR
x
KCR
Highlights

గులాబీ పార్టీలో నామినేటేడ్ ప‌ద‌వుల భ‌ర్తీ షురూ అయింది. పార్టీకి విధేయులుగా ఉన్న నేత‌ల‌కు నామినేటేడ్ పోస్ట్ లు ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

గులాబీ పార్టీలో నామినేటేడ్ ప‌ద‌వుల భ‌ర్తీ షురూ అయింది. పార్టీకి విధేయులుగా ఉన్న నేత‌ల‌కు నామినేటేడ్ పోస్ట్ లు ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. తొలుత సివిల్ స‌ప్ల‌య్ కార్పొరేష‌న్ తో భ‌ర్తీని ప్రారంభించిన కేసీఆర్ ఇక మిగ‌తా నియ‌మిత ప‌ద‌వుల భ‌ర్తీకి క‌స‌ర‌త్తు చేస్తున్నారు. మ‌రోవైపు పార్టీ బ‌లోపేతంపై దృష్టి సారించినందున ఎమ్మెల్యేల‌కు నామినేటేడ్ ప‌ద‌వులు ఇవ్వ‌కూడ‌దని కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

రెండోసారి అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ నామినేటేడ్ ప‌ద‌వుల భ‌ర్తీ పై దృష్టి సారించారు. కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా భాద్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడింట్ గా కేటీఆర్ ను నియ‌మించారు. ఒక వైపు పాల‌న‌తో పాటే మ‌రోవైపు పార్టీని సమాంతరంగా బ‌లోపేతం చేయాల‌ని ముఖ్య‌మంత్రి భావిస్తున్నారు. గ‌తంలో మాదిరి కాకుండా కార్పోరేష‌న్ ప‌ద‌వుల భ‌ర్తీ , జిల్లా పార్టీ క‌న్వీన‌ర్లు,త‌దిత‌ర ప‌ద‌వుల‌న్ని ఇప్ప‌టినుంచే భ‌ర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ పాల‌న‌పై వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పార్టీ బ‌లోపేతం దృష్టిసారించారు. ఇందులో భాగంగానే సివిల్ స‌ప్ల‌య్ కార్పోరేష‌న్ చైర్మ‌న్ గా సిద్దిపేట జిల్లాకు చెందిన మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిని నియ‌మించారు.

ఈనెల‌17న ప్రారంభం కానున్న అసెంబ్లీ స‌మావేశాల్లో ఎమ్మెల్యేలు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఆ త‌ర్వాత మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణకు అవ‌కాశం ఉంది. అనంత‌రం విడత‌ల వారీగా కార్పొరేష‌న్ చైర్మ‌న్ లు ,మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్లు, డైరెక్ట‌ర్లతో పాటూ ఇత‌ర నియ‌మిత ప‌ద‌వుల‌న్నింటిని భ‌ర్తీ చేయ‌నున్నారు. సామాజిక స‌మీక‌ర‌ణాల‌ను దృష్టిలో పెట్టుకొని ప‌ద‌వుల భ‌ర్తీ కి అవకాశాలు క‌నిపిస్తున్నాయి. జిల్లాల వారీగా ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశించి భంగ‌ప‌డ్డ నేత‌లు, ద్వితీయ శ్రేణి నేత‌ల‌కు ఈ ప‌ద‌వుల్లో స్థానం క‌ల్పించనున్నారు. తాజాగా గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ బ‌లోపేతం కోసం దృష్టి సారించాల్సి ఉన్నందున నామినేటేడ్ పోస్టుల్లో వారిని నియ‌మించే అవ‌కాశాలు లేన‌ట్లు పార్టీలో చ‌ర్చ జ‌రుగుతుంది.

మొత్తానికి నామినేటేడ్ పద‌వుల భ‌ర్తీ మొద‌ల‌వ‌డంతో నేత‌ల్లో ఆశ‌లు చిగురిస్తున్నాయి. ఎలాగైనా ప‌ద‌వులు ద‌క్కించుకొనేందుకు త‌మ‌కు ద‌గ్గ‌రగా ఉన్న నేత‌ల‌తో ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు ఆశావాహులు.

Show Full Article
Print Article
Next Story
More Stories