Top
logo

నలుగురు తెలుగువారికి పద్మశ్రీ అవార్డులు

నలుగురు తెలుగువారికి పద్మశ్రీ అవార్డులు
Highlights

విభిన్న రంగాల్లో విశేష సేవలందించిన నలుగురు తెలుగు ప్రముఖులను పద్మశ్రీ పురస్కారం వరించింది. ప్రసిద్ధ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ప్రముఖ చదరంగ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, రైతునేస్తం వ్యవస్థాపకుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు సునీల్‌ ఛెత్రీకి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

విభిన్న రంగాల్లో విశేష సేవలందించిన నలుగురు తెలుగు ప్రముఖులను పద్మశ్రీ పురస్కారం వరించింది. ప్రసిద్ధ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ప్రముఖ చదరంగ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, రైతునేస్తం వ్యవస్థాపకుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు సునీల్‌ ఛెత్రీకి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అలాగే హైదరాబాద్‌లో చదివి, అమెరికాలో స్థిరపడిన టెక్‌ దిగ్గజం శంతను నారాయణ్‌కు ప్రవాస భారతీయుల కోటాలో పద్మశ్రీ లభించింది.

ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుల తెలుగు రాష్ట్రాల్లో నలుగురిని వరించింది. అందులో తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఇద్దరు చొప్పున ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా మొత్తం 94 మందికి కేంద్రం పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించగా అందులో నలుగురు తెలుగువారున్నారు.

'నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని'.. అంటూ తూటాల్లాంటి మాటలనే పాటలుగా సంధించి సమాజాన్ని మేల్కొలిపిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రిని పద్మశ్రీ పురస్కారం వరించింది. అలాగే చెస్‌ క్వీన్‌ ద్రోణవల్లి హారిక, ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు సునిల్‌ ఛెత్రి, 'రైతు నేస్తం' సంస్థ వ్యవస్థాపకుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావులకు కూడా కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది. వీరిలో యడ్లపల్లి వెంకటేశ్వరరావు, హరికలకు ఏపీ నుంచి ఈ పురస్కారం దక్కగా సిరివెన్నెల సీతారామశాస్త్రి, సునీల్‌ ఛెత్రి తెలంగాణ నుంచి ఆ గౌరవాన్ని పొందారు.

చేంబోలు వేంకటయోగి, సుబ్బలక్ష్మి దంపతులకి ప్రథమ సంతానంగా 1955 మే 20న మధ్యప్రదేశ్‌లోని శివినిలో జన్మించారు సీతారామశాస్త్రి. అనకాపల్లిలో హైస్కూలు విద్యాభ్యాసం, కాకినాడ ఆదర్శ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్యకళాశాలలో చేరి ఒక యేడాది ఎమ్‌.బి.బి.ఎస్‌ చదివాక టెలిఫోన్స్‌ శాఖలో అసిస్టెంటుగా ఉద్యోగంలో చేరారు. కాకినాడలో ఉద్యోగం చేస్తున్నప్పుడే ఆంధ్రా విశ్వవిద్యాలయం లో ఎమ్‌.ఎ చేశారు. అక్కడే పలువురు సాహితీవేత్తలతో ఆయనకి స్నేహం బలపడింది. భరణి అనే కలం పేరుతో పలు పత్రికల్లో కథలు, కవితలు రాశారు. 1985లో కె.విశ్వనాథ్‌ 'సిరివెన్నెల' చిత్రంతో సీతారామశాస్త్రి గీత రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. అలా తొలి చిత్రం పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది.

ద్రోణవల్లి హారిక చెస్‌ అభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. పసి ప్రాయంలోనే చెస్‌ ఆడటం మొదలుపెట్టిన హారిక అండర్‌-9 జాతీయ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలవడంతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో మెరిసింది. 20 ఏళ్ల వయసులో గ్రాండ్‌మాస్టర్‌ అయిన హారిక ప్రతిష్టాత్మక మహిళల ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో మూడు కాంస్యాలు సాధించింది. 2016లో మహిళల గ్రాండ్‌ ప్రి చెస్‌ టోర్నీ విజేతగా నిలిచింది.

ఇక భారత ఫుట్‌బాల్‌లో మరే క్రీడాకారుడికీ సాధ్యం కాని ఘనతలందుకున్న ఆటగాడు సునీల్‌ ఛెత్రి. వంద అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడు ఛెత్రినే. ఎక్కువ మ్యాచ్‌లు ఆడటమే కాదు ఏకంగా 67 గోల్స్‌ కూడా సాధించాడు. ప్రస్తుతం ఫుట్‌బాల్‌లో కొనసాగుతున్న క్రీడాకారుల్లో క్రిస్టియానో రొనాల్డో తర్వాత స్థానం అతడిదే. ఇటీవలే మెస్సి ను అతను అధిగమించాడు. కెప్టెన్‌గా, జట్టులో కీలక ఆటగాడిగా ఎన్నో ఏళ్లుగా భారత ఫుట్‌బాల్‌కు పర్యాయ పదంలా నిలుస్తున్న ఛెత్రి దేశానికి ఎన్నో విజయాలందించాడు.

అలాగే, రైతునేస్తం ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావుకు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తుల దిగుబడికి ఆయన చేస్తోన్న నిరంతర కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. పద్మ అవార్డులు సాధించిన తెలుగు తేజాలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌ అభినందనలు తెలిపారు.


లైవ్ టీవి


Share it
Top