అమరావతిలో మరో ప్రతిష్టాత్మక నిర్మాణం

Iconic Bridge
x
Iconic Bridge
Highlights

ఏపీ రాజధానిలో మరో ప్రతిష్టాత్మక నిర్మాణానికి అడుగు పడబోతోంది. రాజధాని అమరావతికి తలమానికంగా నిలిచే ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి పునాది రాయి వేయబోతున్నారు.

ఏపీ రాజధానిలో మరో ప్రతిష్టాత్మక నిర్మాణానికి అడుగు పడబోతోంది. రాజధాని అమరావతికి తలమానికంగా నిలిచే ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి పునాది రాయి వేయబోతున్నారు. విజయవాడ శివారులోని పవిత్ర సంగమ ప్రాంతం నుంచి అమరావతిని అనుసంధానిస్తూ నిర్మిస్తున్న భారీ బ్రిడ్జికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం శంకుస్థాపన చేస్తారు.

విజయవాడ ఫెర్రీ పవిత్ర సంగమ ప్రాంతం నుంచి అమరావతిని కలుపుతూ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జిని అమరావతి అభివృద్ధి కార్పోరేషన్ చేపడుతోంది. 125 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న ఈ ఐకానిక్ వంతెనలో ఇరువైపులా 2.5 మీటర్ల ఫుట్ పాత్‌ను కూడా నిర్మిస్తున్నారు. ఈ వంతెన కోసం 1387 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఎల్ అండ్ టీ కంపెనీ నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిని రెండేళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఖ్యాతిని ప్రపంచం వ్యాప్తం చేసే దిశగా ఐకానిక్ ఈ బ్రిడ్జి నిర్మాణం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. బ్రిడ్జి కోసం నిర్మిస్తున్న పిల్లర్లు కూచి పూడి నృత్య భంగిమలో ఉంటాయి. 3.20 కిలో మీటర్ల బ్రిడ్జిలో అర కిలోమీటర్ల మేర కేబుల్ బ్రిడ్జి ఉంటుంది. ఆరు లేన్లుగా నిర్మించనున్నఈ ఐకానిక్ వంతెనపై దేశంలోనే అత్యంత ఎత్తైన పైలాన్ కూడా నిర్మిస్తారు. పైలాన్ ఎత్తును 170 మీటర్లుగా నిర్థారించారు. ఈ వంతెన నిర్మాణం కోసం కృష్ణా నదిలో దాదాపు 36 పిల్లర్లను వేస్తారు. ఈ వంతెన నిర్మాణం కోసం విజయవాడ పవిత్ర సంగమ ప్రాంతం నుంచి అమరావతిలోని తాళ్లాయపాలెం, రాయపూడి వరకు నదిలో 40 నుంచి 50 మీటర్ల లోతులో పైల్స్ ను నిర్మించిస్తారు.

అమరావతి నుంచి విజయవాడ ఇబ్రహీంపట్నం సమీపంలోని రింగ్ రోడ్డు దగ్గర ఐకానిక్ బ్రిడ్జి జాతీయ రహదారికి అనుసంధానం అవుతుంది. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై నుంచి అమరావతికి ఈ వంతెన మీద నుంచి వెళ్తే చాలా సమయం ఆదా అవుతుంది. ఈ వంతెన నిర్మాణంతో హైదరాబాద్, జగదల్ పూర్‌లకు వెళ్లే మార్గం 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దాదాపు రెండు గంటల సమయం ఆదా అవుతుంది. అటు విజయవాడ ట్రాఫిక్ భారం కూడా ఈ వంతెన కారణంగా తగ్గుతుంది. అదే సమయంలో 4వ నెంబరు జాతీయ జలమార్గంలో కార్గో రవాణా కోసం వీలుగా ఈ ఐకానిక్ వంతెన నిర్మిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories