వంగవీటి వర్సెస్ వైసీపీ

వంగవీటి వర్సెస్ వైసీపీ
x
Highlights

వైసీపీకి రాజీనామా చేయడంపై మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ నోరు విప్పారు. వైసీపీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు. తన తండ్రి రంగా...

వైసీపీకి రాజీనామా చేయడంపై మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ నోరు విప్పారు. వైసీపీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు. తన తండ్రి రంగా విగ్రహావిష్కరణకు వెళ్ళడానికి కూడా అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఉండడం వల్లే వైసీపీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు తనను టీడీపీలోకి ఆహ్వానించారన్న రాధా రంగా హత్య కొందరు వ్యక్తుల పని అని, దానిని టీడీపీకి ఆపాదించడం సరికాదన్నారు.

మీడియా సాక్షిగా వైసీపీకి రాజీనామా చేసిన పరిస్థితుల గురించి విజయవాడలో రాధా వివరించారు. తన తండ్రి విగ్రహావిష్కరణకు వెళితే ఎవరి అనుమతి తీసుకున్నావంటూ జగనే స్వయంగా ఫోన్‌ చేసి తనను మందలించారని ఇదెక్కడి న్యాయమన్నారు. తమ్ముడిలా చూసుకుంటానని చెప్పి జగన్‌ రంగా మీద జాలి చూపించి పార్టీలో ఉండనిచ్చానని పదేపదే అనేవారని ఆవేదన రాధా వ్యక్తం చేశారు.

వైసీపీ కార్యకర్తలు తనను చంపేస్తామని సోషల్‌ మీడియాలో బెదిరిస్తున్నారని వంగవీటి రాధ చెప్పారు. యలమంచిలి రవిని పార్టీలోకి తీసుకురమ్మంటే తీసుకొచ్చానని, ఆయనకు ఇచ్చిన సీటులో తనను పోటీ చేయమంటే ఎలా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు తనను టీడీపీలోకి ఆహ్వానించారని రాధాకృష్ణ తెలిపారు. అయితే టీడీపీ ఆహ్వానంపై నేరుగా సమాధానం చెప్పలేదు. రంగా ఆశయాలను నెరవేర్చే వారితో ఉంటానని అన్నారు. సీఎం చంద్రబాబు విజయవాడ పేదలకు ఇళ్ళ పట్టాలు ఇప్పించాలని కోరిన రాదా రంగా హత్యను టీడీపీకి ఆపాదించడం సరికాదన్నారు.

అయితే వంగవీటి రాధాకృష్ణ ఆరోపణలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. రంగా విగ్రహావిష్కరణకు జగన్ అడ్డు చెప్పలేదన్న పేర్ని నాని ఏ ఊరు వెళ్ళినా కార్యకర్తలను కలవాలని మాత్రమే చెప్పారని వివరించారు. చంద్రబాబును రాధా నమ్మడం బాధాకరమన్నారు. అయితే చంద్రబాబు ఆహ్వానంపై రాధాకృష్ణ నేరుగా సమాధానం ఇవ్వకపోవడంతో ఆయన టీడీపీలో చేరతారా లేదంటే మరేదైనా ఆలోచన ఉందా అనే సస్పెన్స్ నెలకొంది.


Show Full Article
Print Article
Next Story
More Stories