ఒకప్పుడు టెర్రరిస్ట్ ..తర్వాత భారత జవాన్

ఒకప్పుడు టెర్రరిస్ట్ ..తర్వాత భారత జవాన్
x
Highlights

ఈ ఫొటోలోని వ్యక్తి పేరు లాన్స్‌ నాయక్‌ నజీర్‌ అహ్మద్‌ వానీ. జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలోని చెకి అష్ముజీ పట్టణానికి చెందిన ఇతడు ముందుగా...

ఈ ఫొటోలోని వ్యక్తి పేరు లాన్స్‌ నాయక్‌ నజీర్‌ అహ్మద్‌ వానీ. జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలోని చెకి అష్ముజీ పట్టణానికి చెందిన ఇతడు ముందుగా ఉగ్రవాద ప్రభావంతో టెర్రరిస్ట్ గా మారాడు. తర్వాత ఉగ్రవాదం లోగుట్టు తెలుసుకుని భద్రతా దళాలకు లొంగిపోయాడు. దేశానికి సేవలు అందించేందుకు నజీర్‌ అహ్మద్‌ 2004లో సైన్యంలోని 162వ ఇన్‌ఫ్యాంట్రీ బెటాలియన్‌ లో చేరారు. దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాదులపై చేపట్టిన పలు ఎన్‌కౌంటర్‌లలో పాల్గొన్నారు. టెర్రరిస్టులపై పోరులో ధైర్యసాహసాలకు గుర్తింపుగా నజీర్ అహ్మద్ కు రెండుసార్లు 'సేనా పతకం' లభించింది.

గత ఏడాది నవంబర్‌ 25న షోపియాన్‌ జిల్లాలోని హిరాపుర్‌ గ్రామంలో భీకర ఎన్‌కౌంటర్‌ జరిగింది. టెర్రరిస్టుల బుల్లెట్ల జడివానను లెక్కచేయకుండా నజీర్ అహ్మద్ లష్కరే తొయిబా ముఠాకు చెందిన జిల్లా కమాండర్‌ను, మరో విదేశీ ఉగ్రవాదిని హతమార్చారు. మరో ఉగ్రవాదిని గాయపరిచి నజీర్ అహ్మద్ తీవ్రగాయాలతో కన్నుమూశారు. నజీర్ అహ్మద్ వీర మరణంతో స్వస్థలం చెకి అష్ముజీలో తీవ్ర విషాదం నెలకొంది. శవయాత్రలో భారీ సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. నజీర్ అహ్మద్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

నజీర్‌ అహ్మద్‌ కు భార్య మహజబీన్‌, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త మృతదేహం వద్ద అతడి భార్య మహజబీన్‌ కన్నీరు మున్నీరుగా రోధించారు. నజీర్ అహ్మద్ వృద్ధ తండ్రిని ఓ సైనికుడు హత్తుకుని ఓదార్చారు. సైనిక లాంఛనాల మధ్య వీర సైనికుడు నజీర్ అహ్మద్ కు అంత్యక్రియలు నిర్వహించారు. భర్త స్ఫూర్తితో మహజబీన్‌ టీచర్ గా మారారు. కశ్మీరీ యువతను సరైన దారిలో నడిపించేందుకు కృషి చేస్తున్నారు. స్ఫూర్తిదాయకమైన సైనికుడు నజీర్ అహ్మద్ మరణాంతరం భారత ప్రభుత్వం అత్యున్నత సాహస పురస్కారం 'అశోక్‌ చక్ర'ను ప్రకటించింది.

ఉగ్రవాదాన్ని వీడి సైన్యంలో చేరి దేశ రక్షణలో అమరుడైన నజీర్‌ అహ్మద్‌కి 'అశోక్‌ చక్ర'ను ప్రభుత్వం అందజేసింది. రాజ్‌పథ్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా నజీర్ అహ్మద్‌ భార్య మహజబీన్‌ అవార్డును స్వీకరించారు. నజీర్ అహ్మద్ ధీర సైనికుడు అని, సొంత రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఆయన ఎంతో శ్రమించారు అని సైనికాధికారులు కొనియాడారు.


















Show Full Article
Print Article
Next Story
More Stories