Top
logo

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో విషాదం

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో విషాదం
X
Highlights

మెడ్చల్ జిల్లా రాంపల్లిలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. గోవా తాళ్లు ఒక్కసారిగా...

మెడ్చల్ జిల్లా రాంపల్లిలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. గోవా తాళ్లు ఒక్కసారిగా తెగడంతో నిర్మాణ పనుల్లో ఉన్న కూలీలు, పదో అంతస్తు పైనుంచి కిందిపడిపోయారు. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరోకరు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందారు. దీంతో మెడ్చల్ జిల్లా రాంపల్లిలో విషాదం నెలకొంది.

మేడ్చల్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కీసర మండలం రాంపల్లిలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో ప్రమాదవశాత్తూ భవనం పదో అంతస్థుపై నుంచి జారిపడి ఐదుగురు కూలీలు మృతి చెందారు. దీంతో ఇతర కూలీలు ఆగ్రహంతో నిర్మాణ సంస్థ కార్యాలయంపై దాడికి దిగారు. కోపంతో అద్దాలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు సర్ధిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

రాంపల్లిలో ప్రమాదం జరిగిన ఘటనా స్థలికి చేరుకున్న మల్కాజిగిరి డీసీపీ పరిస్థితిని సమీక్షించారు. ఐదుగురు కూలీల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాంట్రాక్టర్లు ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కూలీలు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని కాంట్రాక్టర్లు హామీ ఇచ్చారు.

డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనుల్లో ప్రమాద ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు. చనిపోయిన కార్మికులకు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల నష్ట పరిహారం ప్రకటించారు. మృతులను వారి స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. గోవా తాళ్లు తెగడంతో కూలీలు కింద పడిపోయారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story