Top
logo

'ఐటీ గ్రిడ్' హైడ్రామా!

X
Highlights

ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య డేటా వార్ ముదురుతోంది. హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్ సంస్థ కార్యాలయంలో సైబరాబాద్ ...

ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య డేటా వార్ ముదురుతోంది. హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్ సంస్థ కార్యాలయంలో సైబరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించడం కొందర్ని అదుపులోకి తీసుకోవడం ఈ కేసులో ఏపీ పోలీసులు జోక్యం చేసుకోవడం వివాదం రాజేసింది. ఐటీ గ్రిడ్ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు కనిపించడం లేదంటూ ఆ సంస్థ డైరెక్టర్ అశోక్ తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో వారిని రేపు ఉదయం తెలంగాణ హైకోర్టులో హాజరు పరచాలని న్యాయమూర్తి ఆదేశించడం కాక రేపుతోంది.

డేటా చోరీ కేసు దర్యాప్తు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. కూకట్ పల్లిలో విచారణ కోసం వెళ్లిన ఏపీ పోలీసులను తెలంగాణ పోలీసులు , వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. జరుగుతున్న తతంగాన్ని వీడియో తీసి ఉన్నతాధికారులకు చేరవేద్దామంటే సెల్ ఫోన్లు పగులకొడతామని వైసీపీ కార్యకర్తలు ఎదురుదాడి చేశారని ఏపీ పోలీసులు ఆరోపించారు. దీంతో వివాదం మరింత ముదిరింది. ఇక ఐటీ గ్రిడ్ సంస్థపై ఫిర్యాదు చేసిన లోకేష్ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు వచ్చారు. కూకట్ పల్లిలోని ఇందూ ఫార్చ్యూన్ విల్లాస్ కు చేరుకున్న ఏపీ పోలీసులు అతని ఇంటిని చుట్టుముట్టారు. వెంటనే అక్కడికి తెలంగాణ పోలీసులు వచ్చి లోకేష్ రెడ్డిని సైబరాబాద్ సీపీ కార్యాలయానికి తరలించారు. దీంతో విచారణ ఏపీ పోలీసులు వర్సెస్ తెలంగాణ పోలీసులుగా మారింది.

ఒక సామాజిక కార్యకర్తగా కేసు వేశానంటున్న లోకేశ్వర్ రెడ్డి.. ఒక ప్రైవేట్ సంస్థకు ఏపీ ప్రజల వివరాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తనకు ప్రాణహాని ఉందని లోకేశ్వర్ రెడ్డి వాపోయారు. అటు ఐటీ గ్రిడ్ సంస్థ ఉద్యోగులు నలుగురు కనిపించడం లేదంటూ ఆ సంస్థ సీఈఓ అశోక్ తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. భాస్కర్, ఫణి, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్ఖను తెలంగాణ పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి కనిపించకుండా పోయిన నలుగురు ఐటీ గ్రిడ్ సంస్థ ఉద్యోగుల్ని సోమవారం ఉదయం పదిన్నరకల్లా తన ముందు హాజరు పరచాలని ఆదేశించారు. మరోవైపు డేటా చోరీ కేసు వ్యవహారంపై అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్‌తో సీఎం చంద్రబాబు నాయుడు మంతనాలు జరిపారు. లీగల్ గా తీసుకోవాల్సిన అంశాల గురించి చర్చించారు.

Next Story