కౌంటింగ్‌ కోసం ఎదురుచూస్తున్న ఈవీఎంలు

కౌంటింగ్‌ కోసం ఎదురుచూస్తున్న ఈవీఎంలు
x
Highlights

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. దేశవ్యాప్తంగా 7దశల్లో జరిగిన పోలింగ్ ఈ నెల 19తో ముగిసింది. దీంతో మరికొన్ని గంటల వ్యవధిలోనే ఓట్ల...

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. దేశవ్యాప్తంగా 7దశల్లో జరిగిన పోలింగ్ ఈ నెల 19తో ముగిసింది. దీంతో మరికొన్ని గంటల వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. గురువారం ఉదయం 8గంటల నుంచి ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఈసారి వీవీ ప్యాట్‌ల లెక్కింపు కూడా వచ్చి చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియోజకవర్గానికి 5 ఈవీఎంల చొప్పున వీవీ ప్యాట్‌లను లెక్కించనున్నారు. దీంతో ఓట్ల లెక్కింపు ఎలా ఉంటుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇంతకాలం స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉన్న ఈవీఎంలు కౌంటింగ్‌ కోసం ఎదురు చూస్తున్నాయి. వాటి లెక్కింపు సమయం రానే వచ్చేసింది. సరిగ్గా ఎల్లుండి ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. గతంలో మాదిరిగానే ఈవీఎల లెక్కింపు జరుగుతుంది. అయితే, వాటితోపాటు వీవీ ప్యాట్‌లు కూడా నియోజకవర్గానికి 5 చొప్పున ఎంపిక చేసి లెక్కింపు అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం.

ఏపీలో మొత్తం 34చోట్ల 55 కౌంటింగ్ కేంద్రాల్లో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు జరపనున్నారు. పార్లమెంటుతోపాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగడంతో ఓట్ల లెక్కింపు కాస్త ఆలస్యం అయ్యేలా ఉంది. కౌంటింగ్‌ కోసం మొత్తం 25 వేల మంది సిబ్బందిని ఈసీ వినియోగించనుంది. అలాగే, 15 కంపెనీల పారా మిలటరీ బలగాలతో మూడంచెల భద్రతా విధానాన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయనుంది. ఇక స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి కౌంటింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలించే సిబ్బందికి అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు వేర్వేరుగా డ్రెస్ కోడ్ కూడా ప్రవేశపెట్టనుంది. ఈసీ.

సాధారణంగా 14 టేబుళ్లను కౌంటింగ్‌ కోసం ఏర్పాటు చేసి ఈవీఎంలు కౌంట్ చేస్తారు. రౌండ్ల వారీగా చేపట్టే ఈ లెక్కింపు ప్రక్రియలో కేంద్రాలను బట్టి 18 నుంచి 20 రౌండ్ల వరకూ ఉంటాయి. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇదే తరహాలో ఏర్పాట్లు చేసింది ఈసీ. 14 టేబుళ్లపైనా ప్రతి రౌండ్‌ కౌంటింగ్ పూర్తయ్యాక రౌండ్ల వారీగా ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రకటిస్తారు అధికారులు. అయితే, గురువారం తెల్లవారుజామున 4గంటలకే కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఎవరు ఏ నియోజకవర్గం కౌంటింగ్‌కు వెళ్తారో నిర్ణయిస్తారు.

అయితే, ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభిస్తారు. అరగంటలో ఈ లెక్కింపు పూర్తికాకపోయినా ఈవీఎంల లెక్కింపు మొదలు పెట్టాలని ఈసీ నిర్ణయించింది. అయితే, వీవీ ప్యాట్స్‌ లెక్కింపు కూడా జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో అసెంబ్లీ నియోజకవర్గం ప్రాతిపదికన లెక్కించాలని ఈసీ నిర్ణయించింది. ఈ ప్రకారం ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గానికి 5చొప్పున, పార్లమెంటు నియోజకవర్గానికి 7చొప్పున మొత్తం 35 వీవీ ప్యాట్లను లెక్కించాల్సి వస్తోంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1750 వీవీ ప్యాట్లను లెక్కించనున్నారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాక ర్యాండమ్ విధానంలో లాటరీ ద్వారా వీటిని ఎంపిక చేసి లెక్కిస్తారు అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories