టీడీపీ, వైసీపీలకు చావో, బతుకో సమరంలా మారిన ఎన్నికలు

టీడీపీ, వైసీపీలకు చావో, బతుకో సమరంలా మారిన ఎన్నికలు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అధికారాన్ని నిలబెట్టుకోడానికి ఓవైపు చంద్రబాబు నానాపాట్లు పడుతుంటే మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ అధికారం...

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అధికారాన్ని నిలబెట్టుకోడానికి ఓవైపు చంద్రబాబు నానాపాట్లు పడుతుంటే మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ అధికారం అందుకోడానికి తహతహలాడిపోతున్నారు. అయితే ఈ ఇద్దరూ దొంగలేనంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎదురుదాడి మొదలుపెట్టారు. తాను చేసే ఆదర్శవంతమైన రాజకీయానికి మద్దతుగా నిలవాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత రెండో ఎన్నికలకునవ్యాంధ్రప్రదేశ్ సిద్ధమయ్యింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో అధికారం చేపట్టిన టీడీపీ, ప్రతిపక్షపార్టీగా మిగిలిన వైసీపీలతో పాటు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన సైతం నేను సైతం అంటూ పోరాటానికి సిద్ధమయ్యాయి. ఎన్నికల ప్రచారం ముగియటానికి మరో మూడురోజులు మాత్రమే మిగిలిఉండటంతో వివిధ పార్టీల అధినేతలు ప్రచారాన్ని పతాకస్థాయికి తీసుకువెళ్లారు. రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 175 స్థానాలకు పోటీ హోరాహోరీగా సాగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీకి103 స్థానాలు సాధిస్తేవైసీపీ 67 స్థానాలతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలుగుదేశం మిత్రపక్షం బీజెపీకి 4 స్థానాలు దక్కాయి. రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ 29, టీడీపీ 23 స్థానాలు గెలుచుకొన్నాయి. అధికార టీడీపీ కంటే వైసీపీ ఆరుస్థానాలు ఎక్కువగా గెలుచుకొని రాయలసీమలో తన ఆధిక్యాన్ని చాటుకొంది.

అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలోని ఈ నియోజకవర్గాలలో ప్రస్తుతం పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో కూడిన ఉత్తరకోస్థాంధ్రలో మొత్తం 34 స్థానాలలో టీడీపీ 24 స్థానాలు కైవసం చేసుకొంది. వైసీపీ మాత్రం తొమ్మిది స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలతో పాటు జనసేన సైతం ఎన్నికల బరిలో నిలవడంతో ముక్కోణపు పోటీల ఫలితాలు ఆసక్తికరం కానున్నాయి. టీడీపీకి ఆయువుపట్టులాంటి ఉభయగోదావరి జిల్లాలలోని మొత్తం 34 సీట్లలో టీడీపీ 27 స్థానాలు సాధించగా వైసీపీకి ఐదుస్థానాలు మాత్రమే దక్కాయి.

పశ్చిమగోదావరి జిల్లాలోని 15 కు 15 స్థానాలూ టీడీపీ దాని మిత్రపక్షం బీజెపీ సొంతం చేసుకొని క్లీన్ స్వీప్ సాధించాయి. తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం టీడీపీ 13, వైసీపీ 5 సీట్లు గెలుచుకొన్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో సైతం అధికార టీడీపీ ఇదే జోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నా వైసీపీ, జనసేన పార్టీలు మాత్రం అధికార పార్టీ సీట్లకు గండికొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

కృష్ణ, గుంటూరు జిల్లాలలోని మొత్తం 33 స్థానాలలో టీడీపీ 22, వైసీపీకి 10 సీట్లు సొంతం చేసుకొన్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం టీడీపీ, వైసీపీల మధ్యనే పోటీ నువ్వానేనా అన్నట్లుగా సాగే అవకాశం ఉంది. ఎక్కువ నియోజకవర్గాలలో ముక్కోణపు పోటీలే ఉండటంతో తుదిఫలితాలు ఆసక్తికరంగా మారే అవకాశం లేకపోలేదు. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ అధికారానికి గురిపెడితే తొలిసారిగా పోటీలో నిలిచిన జనసేన మాత్రం అధికారం తమదేనంటూ జోరుగా ప్రచారం చేస్తోంది. రాష్ట్రాభివృద్ధి కోసం గత ఐదేళ్లుగా తాను చేపట్టిన కార్యక్రమాలు పూర్తికావాలంటే మరోసారి తనకే అవకాశం ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు ఓటర్లను వేడుకొంటున్నారు.

గత ఐదుసంవత్సరాలలో ఆరువందలకు పైగా వాగ్దానాలు చేసిన చంద్రబాబు కనీసం ఒక్క హామీని అమలు చేయలేదని, మోసపూరిత వాగ్దానాలతో కాలం గడిపిన బాబును పక్కన పెట్టి తనకు ఒక్క అవకాశం ఇస్తే నవరత్నాలతో కనీవినీ ఎరుగని అభివృద్ధి చేసి చూపుతానని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు. రాష్ట్ర విభజనతో భారీగా నష్టపోయిన నవ్యాంధ్రప్రదేశ్ ను గత ఐదేళ్లుగా భ్రష్టు పట్టించడంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పోటీపడ్డాయని దొందూదొందేనంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండి పడ్డారు. ఏపీలోని మొత్తం ఓటర్లలో 20 శాతం మంది కాపు ఓటర్లే ఉండటంతో నిర్ణయాత్మకపాత్ర పోషించనున్నారు.

పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జనసేనను పక్కన పెడితే టీడీపీ, వైసీపీలకు మాత్రం ఈ ఎన్నికలు చావోబతుకో సమరంలా మారాయి.రాయలసీమ, కోస్తాంధ్రలోని మొత్తం నియోజకవర్గాలలోని ఓటర్ల ఆదరణ పైనే ఏపార్టీకి అధికారం దక్కుతుందన్న అంశం ఆధారపడి ఉంది. అధికారం నిలుపుకోకుంటే టీడీపీ, అధికారం చేజిక్కించుకోకుంటే వైసీపీ పార్టీల ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశాలు లేకపోలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories