హోంశాఖపై సమీక్షను రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు

హోంశాఖపై సమీక్షను రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షలపై కొత్త వివాదం రాజుకుంది. వరుసగా ఆయన సమీక్షలు నిర్వహించడంపై బీజేపీ, వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీరు...

ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షలపై కొత్త వివాదం రాజుకుంది. వరుసగా ఆయన సమీక్షలు నిర్వహించడంపై బీజేపీ, వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీరు ఎన్నికల నిబంధనలకు పూర్తి వ్యతిరేకమంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఎం సమీక్షలు కోడ్ ఉల్లంఘనగా భావించిన ఈసీ మరోసారి కోడ్ నియమాలను విడుదల చేసింది.

ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షలపై వివాదం రాజకుంది. చంద్రబాబు కోడ్‌ ఉల్లంఘిస్తున్నారంటూ బీజేపీ, వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ముఖ్యనేతలైతే ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని మరోసారి కలిశారు. చంద్రబాబు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎలాంటి సమీక్ష సమావేశాలు నిర్వహించరాదని, కానీ చంద్రబాబు ప్రతి రోజూ సమీక్షలు నిర్వహించడం ద్వారా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు.

అలాగే, అధికారిక భవనాల్లో సమావేశాలు పెట్టకూడదని, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోకూడదని కోడ్ చెబుతోందని, కానీ చంద్రబాబు అన్నింటికీ తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ద్వివేదీకి వివరించారు. తన చర్యల ద్వారా అధికారులను చంద్రబాబు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. అమరావతిలోని ప్రజావేదికలో పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహించడం కూడా నిబంధనలకు వ్యతిరేకం అని వైసీపీ నేతలు పేర్కొన్నారు. తమ ఫిర్యాదును పరిశీలించి చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వారు సీఈవోను కోరారు.

మరోవైపు ఈసీ నిర్ణయాలను ప్రతిఒక్కరూ పాటించాల్సిందేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. చంద్రబాబు కోడ్ ఉల్లంఘనలపై ఆయన మండిపడ్డారు. సమీక్షల పేరుతో హడావిడి చేయొద్దని ఈసీ ఆయనకు సూచించిందన్నారు. ఈసీ నిర్ణయాలు ఎవరికైనా వర్తిస్తాయని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్‌పై కూడా ఒక నిర్ణయం చేసిందని చెప్పారు. అన్ని పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యవస్థ ఎన్నికల సంఘమని, మరోసారి ఇలాంటి తప్పిదాలు చేయకుండా సీఎం చంద్రబాబు జాగ్రత్త వహించాలని సూచించారు.

చంద్రబాబు కోడ్‌ ఉల్లంఘన వివాదంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది మరోసారి నియమావళిని విడుదల చేశారు. ఈసీ హెచ్చరికలతో చంద్రబాబు కూడా హోంశాఖ సమీక్షను అధికారుల సూచనల మేరకు రద్దు చేసుకున్నారు. అయితే, కోడ్ ఉల్లంఘించిన సీఎంల జాబితాలో చంద్రబాబు కూడా చేరినట్టయ్యింది.

Show Full Article
Print Article
Next Story
More Stories