Top
logo

వివేకా హత్యపై ఈసీ ఆరా..!

వివేకా హత్యపై ఈసీ ఆరా..!
Highlights

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తుపై సిట్ అధికారులు స్పీడ్ పెంచారు. హత్య కేసులో అనుమానితులుగా...

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తుపై సిట్ అధికారులు స్పీడ్ పెంచారు. హత్య కేసులో అనుమానితులుగా భావిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు. పులివెందులలో పర్యటించిన సిట్ బృందం పలు వివరాలను సేకరించారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యపై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ పులివెందులలో పర్యటించింది.

వివేకానందరెడ్డి హత్యలో సిట్ అధికారులు రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి వివాదాలు, అంతర్గత రాజకీయలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య జరిగిన వివేకా నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే ఘటనాస్థలంలో సాక్ష్యాల ధ్వంసంపై కూడా పోలీసుల విచారిస్తున్నారు. తలకు గాయాలు కనిపించకుండా టవల్‌ చుట్టడంపై ఆరా తీస్తున్నారు.

సిట్‌ అధికారులతో పాటు కడప జిల్లా ఎస్పీ, క్లూస్‌ టీమ్‌, ఫొరెన్సిక్ నిపుణులు వివేకా నివాసాన్ని పరిశీలించారు. హత్య జరిగినట్టుగా భావిస్తున్న బెడ్‌రూమ్‌, బాత్‌రూమ్‌లను సిట్ బృందం పరిశీలించింది. అనంతరం వివేకానంద కుమార్తె సునీత, జగన్‌ సోదరి షర్మిల నుంచి పలు వివరాలను సేకరించారు. ఈ హత్య కేసులో ఇప్పటికే వివేకానంద రెడ్డి డ్రైవర్‌ ప్రసాద్‌, పీఏ కృష్ణారెడ్డితో పాటు ఆయన అనుచరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు వివరాలను ఆదివారం వెల్లడించనున్నట్టు సిట్ అధికారులు తెలిపారు.

వివేకానంద హత్యకేసులో వైఎస్ రాజారెడ్డి హత్య కేసులోని నిందితుడు సుధాకర్ రెడ్డిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, హెచ్ఎంటీవీతో మాట్లాడిన సుధాకర్ రెడ్డి వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధంలేదని చెప్పాడు. హత్య సమయంలో తాను పొలంలో ఉన్నానని సుధాకర్ రెడ్డి తెలిపాడు.

మరోవైపు, వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యపై ఈసీ ఆరా తీసింది. హత్యకు దారితీసిన కారణాలేంటో తెలుసుకోవాలని కడప జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జీకే ద్వివేది ఫోన్‌లో మాట్లాడారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దని సూచించారు. లా అండ్ ఆర్డర్ కు విఘాతం కల్గిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

Next Story