తెలంగాణలో వేడెక్కిన ప్రచారం

తెలంగాణలో వేడెక్కిన ప్రచారం
x
Highlights

తెలంగాణ పోరు రసవత్తరంగా మారింది. ఓ వైపు ప్రధాని మోడీ మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ఇంకోవైపు సీఎం కేసీఆర్‌ వీరిమధ్య జరుగుతున్న ట్రయాంగిల్‌...

తెలంగాణ పోరు రసవత్తరంగా మారింది. ఓ వైపు ప్రధాని మోడీ మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ఇంకోవైపు సీఎం కేసీఆర్‌ వీరిమధ్య జరుగుతున్న ట్రయాంగిల్‌ వార్‌ అత్యంత ఆసక్తికరంగా మారింది. రాష్ట్రం నుంచి ఎలాగైనా వీలైనన్ని స్థానాలు రాబట్టేందుకు జాతీయ పార్టీలు ప్రయత్నిస్తుంటే టార్గెట్‌ను ఎలాగైనా రీచ్‌ అయ్యేందుకు అధికార టీఆర్ఎస్‌ తీవ్రంగా శ్రమిస్తోంది.

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ప్రచారం రంజుమీదికొచ్చింది. మరో వారం రోజుల్లో ఎన్నికలు రానుండటంతో జాతీయ స్థాయి నేతలంతా తెలంగాణలో తిష్ట వేశారు. సోమవారం ఒక్కరోజే ప్రధాని మోడీ సహా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రావడంతో రాష్ట్రంలో ప్రచార వేడి మరింత ఎక్కువైంది.

పట్టున్న స్థానాల్లో ఎలాగైనా ప్రభావం చూపించాలని అసెంబ్లీ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను రాబట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా రెండు రోజుల వ్యవధిలో ప్రధాని మోడీ రెండు సార్లు తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. మహబూబ్‌నగర్‌ సభ ద్వారా తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ సోమవారం ఎల్‌బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌పై మాటల దాడి చేశారు. కారు స్టీరింగ్‌ ఎంఐఎంకు అప్పగించారని ఎద్దేవా చేశారు.

మరోవైపు రాష్ట్రంలో అధికార పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌తో విలవిల్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి బూస్ట్‌ ఇచ్చేందుకు రాహుల్‌గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన పరువును లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా రాబట్టుకునేందుకు చెమటోడుస్తున్నారు. సోమవారం ఒక్కరోజే మూడు నియోజకవర్గాల్లో రాహుల్‌గాంధీ పర్యటించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జహీరాబాద్‌, వనపర్తి, హుజూర్‌నగర్‌ సభల్లో కేసీఆర్‌, మోడీ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు.

ఇక మిషన్‌ సిక్స్‌టీన్‌ ( 16 ) తో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన గులాబీ దళపతి జాతీయ పార్టీలపైనే బాణం ఎక్కుపెట్టారు. ఇన్నాళ్ల పాలనలో కాంగ్రెస్‌, బీజేపీలు దేశానికి చేసిందేమీ లేదంటూ రాబోయేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమే తేల్చిచెబుతున్నారు. కేంద్రంలో చక్రం తిప్పుతామంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

దేశంలో పేరుమోసిన ముగ్గురు నాయకులు తెలంగాణలో ప్రచారం చేస్తుండటంతో ప్రచారం వేడెక్కింది. ఇక ముందు ముందు మరికొందరు జాతీయస్థాయి నేతలు కూడా రాబోతుండటంతో ఎన్నికల నాటికి ప్రచారం మరింత పీక్‌లోకి వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


Show Full Article
Print Article
Next Story
More Stories