బెట్టింగ్ రాయుళ్ల హాట్‌హాట్‌ సీట్లేవి?

బెట్టింగ్ రాయుళ్ల హాట్‌హాట్‌ సీట్లేవి?
x
Highlights

కాయ్ రాజా కాయ్. సెగ్మెంట్‌లో ఎవరి గెలుస్తారో చెప్పు గెలిస్తే లక్ష పట్టు. ఏపీలో అధికారంలోకి వచ్చేదెవరు బెట్టుపట్టి మరీ చెప్పు...కోటి కొట్టు. కనీసం...

కాయ్ రాజా కాయ్. సెగ్మెంట్‌లో ఎవరి గెలుస్తారో చెప్పు గెలిస్తే లక్ష పట్టు. ఏపీలో అధికారంలోకి వచ్చేదెవరు బెట్టుపట్టి మరీ చెప్పు...కోటి కొట్టు. కనీసం మెజారిటీనీ అంచనా వెయ్ ఊహించనంత అమౌంట్ అందుకో. స్థలానికి స్థలం, నగదుకు నగదు, ఆభరణాలకు ఆభరణం ఆన్‌లైన్‌కు ఆన్‌లైన్ వస్తువుదైనా, పంపిణీ ఎలాగైనా ఓకే, డబ్బులు ఏ రూపంలోనైనా పర్లేదు కాయ్ రాజా కాయ్ అంటోంది ఆంధ్రప్రదేశ్. నరాలు తెగే ఎన్నికల ఫలితాల ఉత్కంఠను బెట్టింగ్ బంగార్రాజులు క్యాష్‌ చేసుకుంటున్నారు. ఐపీఎల్‌ను మించేలా, కోడిపందేలను తలదన్నేలా బెట్టింగ్‌కు సై అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు ముగిసినా, ఆ వాడివేడి మాత్రం తగ్గలేదు కదా, మరింత పెరుగుతోంది. అటు ఈవీఎంలు, ఈసీ తీరుపై అధికార, విపక్షాలు పరస్పర విమర్శలు చేసుకుంటూ, పొలిటికల్‌ హీట్‌ను పెంచుతున్నారు. ఎవరికివారు గెలుపు తమదేనంటున్నారు. వైసీపీ 120 ప్లస్ అంటుంటే, టీడీపీ ఏకంగా 150 ప్లస్ అంటోంది. పెరిగిన ఓటింగ్, అర్థరాత్రి తర్వాత కూడా సాగిన పోలింగ్, జనసేన రాకతో ముక్కోణపు పోటీ, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో నరాలు తెగే ఉత్కంఠ తెలుగు రాష్ట్రాల్లో పీక్‌ స్టేజ్‌లో ఉంది. ప్రజల నాడి ఎవరికీ బోధపడ్డంలేదు. ఇంత సస్పెన్స్‌గా ఎన్నికలు సాగిన నేపథ్యంలో, ఈ ఉత్కంఠను బెట్టింగ్ రాయుళ్లు క్యాష్‌ చేసుకుంటున్నారు. జనాల్లో టెన్షన్‌ను పందేల రూపంలో మరింత పెంచుతున్నారు. ఏపీలో ఇప్పుడు ఎక్కడా చూసినా, ఐపీఎల్‌కు పోటీగా, ఒక్కోసారి ఐపీఎల్‌ను మించినరీతిలో బెట్టింగ్‌లు సాగుతున్నాయి.

రాష్ట్రంలో కొన్ని హోట్ సీట్స్ పై భారీ బెట్టింగ్ సాగుతోంది. వాటిలో గుంటూరు జిల్లా మంగళగిరిదే ఫస్ట్‌ ప్లేస్‌. ఇక్కడ టీడీపీ మంత్రి లోకేష్, వైసీపీ నుంచి ఆర్కే బరిలో ఉన్నారు. టఫ్‌ ఫైట్‌ ఉండటం, అందులో సీఎం కుమారుడు, మంత్రిగా కూడా అయిన లోకేష్‌ గెలుస్తాడా లేదా సస్పెన్స్ నేపథ్యంలో, మంగళగిరిలో భారీగా పందేలు కాస్తున్నారు.

ఇక నెల్లూరు సిటీలో వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, టీడీపీ నుంచి మంత్రి నారాయణ బరిలో ఉన్నారు. ఇద్దరు నాయకులు భారీగా ప్రచారం చేయడం, నారాయణ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంతో, క్యాంపెయిన్‌ హోరాహోరిగా సాగింది. దీంతో బెట్టింగ్‌ కూడా ఓ రేంజ్‌లో హద్దులు దాటుతోంది.

బెట్టింగ్ రాయుళ్ల మరో హాట్‌ సీట్ చిత్తూరు జిల్లా నగరి సెగ్మెంట్. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా పోటీ చేస్తున్న నగరి నియోజకవర్గంలో పందేలు లక్షల్లో సాగుతున్నాయి. దివంగత నేత ముద్దు కృష్ణమ నాయుడు తనయుడు గాలి భానుప్రకాశ్‌ రంగంలోకి దిగారు. సానుభూతి ఓట్లు పడతాయని గాలి వర్గం భావిస్తుంటే, ఫైర్‌ బ్రాండ్‌ లీడరైన రోజానే గెలుస్తారని వైసీపీ లెక్కలేస్తోంది. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. ఈ ఉత్కంఠే బెట్టింగ్‌ను ఊపేస్తోంది.

కృష్ణా జిల్లా గుడివాడలో చాలా రోజుల నుంచి బెట్టింగ్ సాగుతోంది. అక్కడ దేవినేని అవినాష్, కొడాలి నాని పోటీ పడుతున్నారు. వీరి మ‌ద్య పెద్ద ఎత్తున బెట్టింగ్ న‌డుస్తోంది. మైలవరంలో మంత్రి ఉమా, వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ గెలుపు ఓటములపై బెట్టింగ్ అంతా ఇంతాకాదు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, కోడెల మధ్య గట్టి పోటీ ఉంది. పోలింగ్ రోజున జ‌రిగిన అల్లర్ల నేపపథ్యంలో ఈస్థానం స్టేట్ ఫోక‌స్‌గా మారింది. దీంతో ఇక్కడ పందేలకు హద్దు అదుపూ లేదు.

చీరాలలో ఆమంచి, కరణం బలరాం మధ్య పోటీ నెలకొంది. ఇద్దరూ గట్టి లీడర్లు కావడం, రెండు పార్టీలు బలంగా ఉండటం, ఎవరు గెలుస్తారన్నది అంతుచిక్కకపోవడం, బెట్టింగ్‌ బాబులకుకాసులకు కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. నంద్యాలలోని వైసీపీ, టీడీపీ మధ్య బెట్టింగ్ భారీగా ఉంది. ఇక అనంతపురం జిల్లాలో హిందూపురం, తాడిపత్రి, రాప్తాడు నియోజకవర్గాల్లో లక్షల నుంచి కోట్లకు పడగలెత్తుతోంది బెట్టింగ్. కడప జిల్లా జమ్మలమడుగులో పందేలు బాగానే సాగుతున్నాయి. పవన్ పోటీ చేస్తున్న భీమవరం, గాజువాకలోను విన్నింగ్ రేస్ ఓ రేంజ్‌లో సాగుతోంది. ప‌వ‌న్ రెండు స్థానాల్లోనూ గెలుస్తాడని కొందరు, రెండు స్థానాల్లోనూ ఓట‌మి అంటూ మరికొందరూ, ఒకే స్థానంలో గెలుస్తాడని ఇంకొందరు, సొమ్ములు కాస్కో అంటున్నారు.

అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ నియోజకవర్గాలపైనా పందేలు జరుగుతున్నాయి. వీటిలో వైజాగ్, నరసాపురం, విజయవాడ, గుంటూరు, హిందూపురం, కడప, స్థానాలపై అందరి దృష్టిపడింది. కేవలం స్థానాలపైనే కాకుండా అభ్యర్థుల మెజారిటీలపైనా పందేలు కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. వైసీపీ సాధించే సీట్లు, టీడీపీ కొల్లగొట్టే స్థానాలు, మెజార్టీలపై వేరువేరుగా పందాలు వేస్తున్నారు. పులివెందుల, కుప్పంలో అయితే జగన్ చంద్రబాబుల మెజార్టీపై డబ్బులు వెదజల్లుకుంటున్నారు. ఇక గోదావ‌రి, ఉత్తరాంధ్రా జిల్లాల్లో జ‌న‌సేనపై పెద్దెత్తున బెట్టింగ్ సాగుతోంది. కోడి పందేలకు ఏమాత్రం మించనివిధంగా అక్కడ బెట్టింగ్ జరుగుతోంది.

ఇలా రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్ మాఫియా జోరందుకుంది. ఒకపక్క తమ గెలుపు కోసం అభ్యర్థులు అంచ‌నాలు వేసుకుంటుంటే, బెట్టింగ్ మాఫియా వారి గెలుపు,ఓటమిపై బెట్టింగ్‌లు కాస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఈ ఎన్నికలకు కోట్లలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఒకవైపు ఐపీఎల్‌ సాగుతున్నా, అంతకుమించి అన్నట్టుగా ఎన్నికల గెలుపోటములను కాసులు కుమ్మరించుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories