రేవంత్ కు ఈడీ వేడి

రేవంత్ కు ఈడీ వేడి
x
Highlights

విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర స్ధాయిలో చిచ్చు రేపిన ఓటుకు నోటు కేసులో మరోసారి తెర పైకి వచ్చింది. ఇప్పటికే ఏసీబీ విచారణ చేసిన ఈ కేసులో...

విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర స్ధాయిలో చిచ్చు రేపిన ఓటుకు నోటు కేసులో మరోసారి తెర పైకి వచ్చింది. ఇప్పటికే ఏసీబీ విచారణ చేసిన ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదర్కొంటున్న వేం నరేందర్ రెడ్డి తోపాటు ఇద్దరు కుమారులను ఈడీ సుదీర్ఘంగా విచారించింది. ఇదే సమయంలో ఈ కేసులో ఏ వన్‌గా ఉన్న రేవంత్ రెడ్డితో మిగిలిన వారికి ఈడీ నుంచి పిలుపు అందడంతో విచారణ ఊపందుకుంది.

ఓటుకు నోటు కేసు విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు ఇచ్చిన 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చారనే కోణంలో ఈడీ విచారణ జరుపుతోంది. ఇదే సమయంలో మిగిలిన నాలుగున్నర కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నాయి. ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు ? అనే కోణంలోనూ ఈడీ వివరాలు రాబట్టుతోంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డి, ఆయన ఇద్దరు కుమారులను సుమారు ఆరు గంటలు పాటు ఈడీ అధికారులు విచారించారు. ఏసీబీ దాఖలు చేసిన చార్జ్‌షీట్ ఆధారంగా ప్రశ్నల వర్షం గుప్పించారు. ఇద్దరు కుమారులతో పాటు వేంరెడ్డి నరేందర్ రెడ్డి వేర్వేరుగా విచారించిన అధికారులు పలు కోణాల్లో సమాచారాన్ని రాబట్టారు.

ఓటుకు నోటు కేసులో ఈడీ నోటీసులకు అనుగుణంగానే విచారణకు హాజరైనట్టు వేం నరేందర్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ వ్యవహారంలో ఎలాంటి ప్రమేయం లేని తన కుమారులను ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు .

వేం నరేందర్ రెడ్డి నుంచి సేకరించిన సమాచారంతో పాటు వివిధ బ్యాంక్ అకౌంట్లు, ఏసీబీ చార్జ్‌షీట్ ఆధారంగా ఈ కేసులో ఏవన్‌గా ఉన్న రేవంత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. కేసు విచారణ కోసం వారంలోగా తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దీంతో పాటు మిగిలిన నిందితులకు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న రేవంత్ రెడ్డితో పాటు మరో నిందితుడు ఉదయ్ సింహలను ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ కేసులో పట్టుబడిన 50 లక్షల రూపాయలతో పాటు మిగిలిన 4.5 కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ? పట్టుబడిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ? ఒకేసారి ఇంత డబ్బును ఎలా తెచ్చారనే కోణంలో ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. గత మూడున్నరేళ్లుగా స్తబ్తుగా ఉన్న ఈ కేసులో ఈడీ ఎంటర్ కావడం నిందితుల్లో ఆందోళన రేపుతుంటే రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories