నిజామాబాద్‌లో బ్యాలెట్‌ పోరు తప్పదా?

నిజామాబాద్‌లో బ్యాలెట్‌ పోరు తప్పదా?
x
Highlights

తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా నిజామాబాద్ లోక్‌సభ స్థానం తీవ్ర చర్చనీయాంశమైంది. పెద్దఎత్తున నామినేషన్లు దాఖలవడమే కాదు స్క్రూటినీ తర్వాత కూడా 193మంది...

తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా నిజామాబాద్ లోక్‌సభ స్థానం తీవ్ర చర్చనీయాంశమైంది. పెద్దఎత్తున నామినేషన్లు దాఖలవడమే కాదు స్క్రూటినీ తర్వాత కూడా 193మంది అభ్యర్ధులు బరిలో ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా తమ డిమాండ్ల సాధన కోసం రైతన్నలు బ్యాలెట్‌ పోరుకు దిగడం సంచలనంగా మారింది.

రైతులు అనుకున్నంత పని చేశారు. మద్దతు ధర కోసం పోల్ బరిలో దిగిన మట్టి మనుషులు రికార్డుస్థాయిలో నామినేషన్లు దాఖలుచేసి సంచలనం సృష్టించారు. స్క్యూటినీలో 12మంది రైతుల నామినేషన్లను తిరస్కరించగా, 193మంది అభ్యర్ధులు ఒకే అయ్యారు. ప్రధాన పార్టీలతోపాటు ఇండిపెండెంట్స్‌గా రైతులు బరిలో ఉండటంతో నిజామాబాద్‌‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఎంతమంది రైతులు నామినేషన్లను ఉపసంహరించుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. ఒకవేళ అభ్యర్ధులంతా పోటీలో ఉంటే, పేపర్ బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పసుపు-ఎర్రజొన్నలకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్‌తో రైతులు పెద్దఎత్తున ఎన్నికల బరిలోకి దిగడంతో అధికార టీఆర్‌ఎస్‌ నేతలకు కంటి మీద కునుకు కరువైంది. నష్టనివారణ చర్యలు ప్రారంభించిన గులాబీ లీడర్లు రైతులతో నామినేషన్లు విత్‌డ్రా చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకూ వచ్చాక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ముందుకే వెళ్తామని రైతులు తేల్చిచెబుతున్నారట.

రాష్ట్రంలోనే కాదు ఏకంగా దేశంలో అత్యధిక అభ్యర్ధులు నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ పడుతుండటం, ముఖ్యంగా రైతులు తమ డిమాండ్ల సాధన కోసం బ్యాలెట్‌ పోరుకు దిగడం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. మరి దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోన్న నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో రైతన్న పోరు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో ఏ పార్టీ విజయాన్ని గల్లంతు చేస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories